
మే 28 జయంతి సందర్భంగా…
మే 28 ప్రతీ వారికి ఈ తారీఖు వినబడగానే మహనీయుడు ఎన్టీఆర్ పేరు స్మరణకి వస్తుంది. ఎన్టీఆర్ మే 28, 1923న జన్మించారు. 102వ జయంతి సందర్భంగా దైవంగా నేను తలిచే ‘‘అన్న’’ గారి జ్ఞాపకాలని అక్షర రూపంలో ప్రస్తావించాలని ఆశ.
ఎన్టీఆర్ జీవితం నటుడిగా దాదాపు 25 వసంతాలు, రాజకీయ నాయకుడిగా 13 వసంతాలు తెలుగు వారి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ‘మనదేశం’ నుంచి ‘మేజర్ చంద్రకాంత్’ వరకు ప్రతీ సినిమాలో నటుడిగా ఆయన ప్రతిభ ఎవ్వరూ మరిచిపోలేనిది. చాలా మంది విమర్శకులు ఎన్టీఆర్ గారిని పౌరాణిక చిత్రాలకు పరిమితం చేస్తారు. నిజానికి రక్తసంబంధం, దేవత, గుడిగంటలు, ఆరాధన, రాము చిత్రాలలో భావోద్వేగ భరితమైన అభినయం అందరి అభినందనలు అందుకోవడం విశేషం. దేశభక్తి గల చిత్రాలలో అందరికి దేశంపై అభిమానం పెంచేలా నటించారు.
ఎన్టీఆర్ ని ప్రారంభంలో శ్రీకృష్ణుడిగా అంగీకరించని జనం ‘మాయబజార్’ నుంచి ‘దాన వీర శూర కర్ణ ’ వరకు నిజంగానే శ్రీకృష్ణుడిగా పూజామందిరాలలో ఆరాధించే స్ధాయికి ఎదిగారు. శ్రీరాముడిగా ‘లవకుశ’ చిత్రంలో ఆయన్ని చూడడానికి జనం అందరూ పల్లెల నుంచి వెండితెరకి తరలివచ్చారు. దుర్యోధనుడు, కర్ణుడు, బృహన్నల, భీష్ముడు, రావణుడు ఇలా పాత్రలకి జీవం పోసారు ఎన్టీఆర్ . శివుడిగా ‘దక్షయజ్ఞం’లో మెరిసారు. కుమారుడు చనిపోవడం వలన ఇక ఆ పాత్రని పోషించడానికి ఇష్టపడలేదు. రాజసం, జానపదం, చారిత్రకు ఇలా విభిన్న పాత్రలకి చిరునామాగా నిలిచారు. ఆరుపదుల వయస్సులో ఇరవై వసంతాల శ్రీదేవి చెంత ఎన్టీఆర్ హుషారు అభినయం అప్పటి తరం విపరీతంగా అభిమానించారు. ఎన్టీఆర్ ప్రతిపాత్రని అభినయించే ముందు పరిశోధన చేసేవారు. వేటూరి, డా.సినారే, కైకాల, రావుగోపాలరావు, కాంతారావు, ఇలా ఎందరో ప్రతిభావంతులైన వ్యక్తుల్ని ఎన్టీఆర్ తన చిత్రాలు ద్వారా ఆదరించారు. రాముడిగా అందరి అభిమానం పొందిన సీతారామకళ్యాణం చిత్రంలో హరనాధ్ గారిని ఎంపిక చేయడం గొప్పతనానికి నిదర్శనం. వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రకి సజీవత కల్పించారు. ఎన్టీఆర్ 1982-95 మధ్యకాలంలో తెలుగునాడు రాజకీయాలకి కొత్త నిర్వచనం యిచ్చారు. ఎన్టీఆర్ విద్యారంగంలో సంస్కరణలు చేసారు. 1994-95 సంవత్సరాలలో వ్యక్తిగత అంశాల్ని, రాజకీయాలు జత చేయడం ఎన్టీఆర్ ను పదవికి దూరం చేసింది. ఎన్టీఆర్ ను విపరీతంగా అభిమానించే నేను, డా. కృష్ణవీర్ సహరచయితలుగా ‘ఎన్టీఆర్ భావోద్వేగాలు’ మీద రచన చేసాము. తెలుగు వారి అందమైన జ్ఞాపకం ఎన్టీఆర్ కు నివాళి. —డా. డి.వి.యస్.శర్మ





