వైభవంగా పూరీ జగన్నాథ రథయాత్ర

జగన్నాథుడు,బలరాముడు సుభద్రల విగ్రహాలు    

ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరిసేలా  భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే  క్షేత్రం పూరీ జగన్నాథక్షేత్రం.

క్షేత్రం ఎన్నో అద్భుతాలకు ప్రతీక. దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఒడిశా రాష్ట్రంలోని ఈ పవిత్రక్షేత్రం భక్తి, సమానత్వం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వంకు ప్రతీక. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన ఉత్సవాలలో ఒకటి. బంగారు చీపురుతో రాజు జగన్నాథ రథం ముందు శుభ్రంచేయడం ఆచారం.
జగన్నాథ రథోత్సవం 2026 జూలై 16న ప్రారంభమైంది. ఇది ఆషాఢ మాస శుక్ల ద్వితీయ తిథి నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలు తమ రథాలలో గుండిచా ఆలయానికి బయలుదేరి, జూలై 24న తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రథోత్సవం ఘట్టం తిలకించడానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచే కాకుండా విదేశీయులు కూడా వస్తారు. జగన్నాధ రథయాత్రను యూరప్‌లోని అన్ని దేశాలు, అమెరికా కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో ప్రధాన పట్టణాలలో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జరిగిన ఉత్సవంలో జూన్ 29న దేవతల పవిత్ర స్నానం, జూలై 14 న దేవతలు కొత్త రూపంలో దర్శనం, అనంతరం జూలై 15న గుండిచా ఆలయం శుభ్రం చేశారు. జూలై 16న రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. 20 న లక్ష్మీదేవి గుండిచా ఆలయ దర్శనం, 23 న సాయంత్ర దర్శనం, 24 న తిరుగు ప్రయాణం, 25 న బంగారు , ఆభరణాలతో అలంకారం, 26 న మధుర పానీయ సమర్పణ, జూలై 27 న దేవతలు ప్రధాన ఆలయంలో ప్రవేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్నో ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి.
ప్రతి రథోత్సవానికి కొత్త రథాలు తయారు చేస్తారు. ఇందుకోసం వంశపారంపర్యంగా చేస్తున్నవారే పాల్గోనడం విశేషం. మూడు రథాలకు వేరువేరు పేర్లు. నందిఘోష జగన్నాథుడి రథంకాగా, దీనికి 16 చక్రాలు ఏర్పాటు చేస్తారు.దీని ఎత్తు 13.5 మీటర్లు ఉంటుంది. బలభద్రుడి రథం పేరు తలధ్వజ 14 చక్రాలు, సుభద్రమ్మ రథానికి 12 చక్రాలు ఉంటాయి. దీనిని దర్పదలనా అని పిలుస్తారు. జగన్నాథరథంతో పోలిస్తే ప్రతి రథం రెండు చక్రాలు తక్కువగా ఉంటాయి. ఈ రథాలను లాగడం వంద యజ్ఞాల ఫలానికి సమానం అని శాస్త్రాలు చెబుతాయి. స్కంద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మ పురాణంలో రథోత్సవం ప్రస్తావన కనిపిస్తుంది. వీటి విశిష్టత వివరాల ప్రస్తావన కనిపిస్తుంది. రథాన్ని లాగినవారు పాప విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు.
రథయాత్రలో దేవతల దర్శనం చేసినా వంద యజ్ఞాల ఫలాన్ని పొందుతారు. ఎందుకంటే మూలవిరాట్టు అంటే ధృవభేరం రథంలో ఊరేగిస్తారు. కనుక రథయాత్ర తిలకించినా, రథం లాగినా జన్మతరించి పోతుందని భక్తుల విశ్వాసం. ఇదే పురాణకథనం కూడా. మహాభారతంలో సుభద్రమ్మను రథంలో తీసుకువెళ్ళిన ఘట్టం రథోత్సవ మూలకథగా భావిస్తారు.
పూరీ జగన్నాథ ఆలయం హిందువుల పవిత్రమైన చార్‌ధామ్ క్షేత్రాలలో ఒకటి. త్రిమతాచార్యులు క్షేత్రాన్ని సందర్శించారు. గురునానక్, కబీర్, తులసీదాస్‌లు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ఆధారాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా రామానుజాచార్యులు సంస్కరణలు ప్రవేశపెట్టడాని స్వయంగా భగవంతుడే నిలిపివేసినట్లు కథనం. రామానుజాచార్యులు క్షేత్రానికి రాలేక శ్రీకూర్మం నుంచి వెనుతిరిగినట్లు చెపుతారు. ఆలయ గోపురం నీడ నేలపై పడకపోవడం, గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో జెండా ఎగరడం, ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. సింహ ద్వారంవద్ద సముద్ర ఘోష వినపడడం, సముద్రతీరంలో ఉన్నా అలల తాకిడి తీరానికి లేకపోవడం లాంటి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. జగన్నాథస్వామికి నివేదించే ప్రసాదం మట్టిపాత్రలో తయారు చేస్తారు. జగన్నాథస్వామికి నివేదించే ప్రసాదం “మహాప్రసాదం” అని పిలుస్తారు. ఇది మొదట జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మలకు సమర్పించి, తరువాత ఆలయంలోని బిమలాదేవికి మళ్లీ సమర్పించిన తర్వాతే మహాప్రసాదంగా పరిగణించబడుతుంది. కుల, వర్గ, భేదం లేకుండా అందరూ ఆనందబజార్‌లో కూర్చునిమహాప్రసాదం సేవించడం జగన్నాథుని దర్శనం చేసినంత పవిత్రంగా భావిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలలో ప్రతిరోజూ మట్టి పాత్రలలో ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదం పేర్లు ఆసక్తికరంగా ఉంటాయి. సాధా అన్నం, గీ అన్నం, పఖాళా (నీటిలో నానబెట్టిన అన్నం), ఖిచ్డీ. పప్పులలో బిరి దాలి, చనా దాలి, మిఠా దాలి, ముగా దాలి.
కూరలలో దలమా (పప్పు–కూర కలిపిన వంటకం), బేసరా (కూర–మసాలా), సాగ (ఆకుకూరలు). తీపి పదార్థాలలో ఖాజా, గజా, లడ్డు, జీరా లడ్డు, మగజా లడ్డు, ఖురుమా, జగన్నాథ బల్లవ ఉంటాయి. పిండి వంటలలో అరిసా, మాండా, పూరి, లూచి, దహి బరా. పాలతో చేసినవి ఖీరి, రసబలి, తాడియా, ఛేనా ఖాయి. ఇలా చెప్పుకుంటే వెళుతే ఎన్నో ప్రముఖమైనవి ఉన్నాయి. మరోవిషయం ఏమిటంటే స్వామికి చప్పన్ భోగ్ అంటే 56 వంటకాలు నివేదిస్తారు. వీటిలో గోపాల వల్లభ భోగ్, సకల ధూప, భోగ మండప భోగ్, మధ్యాహ్న ధూప, సంధ్యా ధూప, బడా శృంగార భోగ్ ముఖ్యమైనవి విటిని ఉదయంనుంచి రాత్రివేళవరకు ప్రతి మూడు గంటలకొకమారు వరుసగా నివేదిస్తారు.
12వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగా దేవుడు ప్రస్తుత ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీనిని అనంతర కాలంలో అనంగభీమ దేవుడు పూర్తి చేశాడు. అయితే, పురాణాల ప్రకారం అవంతి రాజు ఇంద్రద్యుమ్నుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. శ్రీ జగన్నాథుడు తొలుత గిరిజనుల ఆరాధ్య దైవమైన నీలమాధవుడుగా పూజలందుకున్నట్లు పురాణకథనం.
ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు మారుస్తారు. శ్రీకృష్ణుడు (జగన్నాథుడు), బలరాముడు (బలభద్రుడు), సుభద్రల విగ్రహాలు కలపతో తయారు చేస్తారు. ఇందుకోసం వృక్షాలను ప్రత్యేకంగా నిపుణులు ఎంపిక చేస్తారు. వీరంతా వంశపారంపర్యంగా పాల్గొనే వారు కావండం విశేషం. శ్రీవైష్ణవుల దివ్య దేశాలలో ఒకటిగా, ఛార్ ధాంలో ఒకటికావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాలాకాలం పూరిలోనే నివసించినట్లు చారిత్రక కథనం. లభించిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాలు అనంతవర్మ హయాం (సా.శ.1078 – 1148) లోనే నిర్మించగా . అనంతరం ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించారు. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే యువకుడిని అక్కడికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి పెండ్లిచేసుకుంటాడు. అనంతరం అల్లుడి కోరికను కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి దారు కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. దేవశిల్పి విశ్వకర్మ తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఎవరూ రాకూడదనీ, పనికి ఆటంకం కలగకూడదనీ కఠినమైన షరతు విధిస్తాడు. విగ్రహాలు తయారు చేస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు కనిపిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా ìబ్రహ్మదేవుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు.
మహారాజ రంజిత్ సింగ్ అనే సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. ప్రాచీన కాలంనుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారుచేసిన నారాయణుని ప్రతిరూపమైన నీలమాధవగా కొలుస్తారు. ఆయన్ను నీలగిరి (నీల పర్వతం) లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ (బలభద్ర), సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలంనుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడివున్నాయి. వీటన్నిటికన్నా ఒడిషాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజాకార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ వుంటారు. వీటన్నిటిబట్టి మొదటి నుంచి శ్రీక్షేత్ర సాంస్కృతిక చరిత్ర హిందూ, ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పవచ్చు. ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమయ్యింది. ఈ మూడు విగ్రహాలు త్రిరథ (జైన ఆచారాలు) గా పిలవబడే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి.ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలవబడుతున్నాయి. పూరి జగన్నాథ్ శైవం, వైష్ణం, జైనమతం, బౌద్ధమతం కలయికగా చెప్పుకుంటారు.

— వొద్దిపర్తి రామచంద్రమూర్తి , సీనియర్ జర్నలిస్టు

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *