పాటకు ప్రాణం .. ముఖేష్ గానం

—-50వ వర్ధంతి 27 ఆగస్టు====
సెలయేటి పరవళ్లు నిత్య నూతనం. ప్రకృతి అందాలు అనునిత్య శోభితం . ముఖేష్ పాట
సెలయేటి ధారలా ప్రకృతి అందాల శోభితంగా హృదయాన్ని అహత్తుకుంటుంది. హద్దుల్లేని
ఆనందానికి సరిహద్దుల్లేని భావ గాఢతకు కొలమానంగా నిలుస్తుంది. ఆ పాట వినిపించని
పొద్దు ఉండదు. ఆ పాట అలరించని హృది ఉండదు. అందుకే మానవ జీవన యానంలోని
ప్రతి మజిలీ లోనూ ముఖేష్ పలకరిస్తాడు. అది వేదనైనా, ఆవేదనైనా , ఆనందమైనా సరే
ఆ పాటకు సాటిలేదు.. అందుకే తరాలు మారినా, దశాబ్దాలు గడచినా ఆ గళం మీటని
భారత హృదయ తంత్రీ లేదు. నవరసాలు రంగరించిన సుమధుర గాన గుళికలే ఆయన పాటలంటే
అతిశయోక్తి ఏమీకాదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా వేలాది పాటలను అందించిన
ఆ మహా గాయకుడు చిరస్మరణీయుడు. కథానాయకుడు ఎవరైనా ముఖేష్. పాటకు ఓ ప్రతేయ్కత
ఉంటుంది. రాజకపూర్ పాడినా, రాజేంద్రకుమార్ కు గళాన్ని అందించినా ధర్మేంద్రకు పాడినా
మనకు వినిపించేది ముఖేష్. పాటలే. మహానటులను సైతం మహోన్నత శిఖరాలను ఎక్కించిన
గాన దురంధరుడు ముఖేష్.. ఆయన పాటలను విని తరించి పరశించని హృదయం లేదంటే
అది నిజంగా నిజమే. ఎందుకంటే ఆయన పాటలు , ఆ పాటల్లోని భావయుక్తత అంతగా
ప్రతి ఒక్కరిని కట్టిపడేసేది. ‘దిల్ తడప్ తడప్ కే కహరహా హై’ అంటూ మంద్రంగా మొదలైన
ఆయన స్వరం ఆ పాటవెంట శ్రోతలను పరుగులు పెట్టించేది. ఆ భావలాలిత్యంలో
తన్మయులను చేసింది. నాయకుడు ఎవరైనా పాటలోని ముకేశ్ ముద్రవేరు. అందుకే ఆయన
పాడిన ప్రతి పాటా అజరామరమైనది. గళ లాలిత్యానికి మెచ్చుతునక. ఓ గాయకుడికి
అజరామరత్వం లభించిందంటే అందుకు కారణం ఆయన పాడిన ప్రతి పాట హృదయాంతరాల్లోకి
చొచ్చుకెళ్లగలడమే. హిందీ చలనచిత్ర రంగంలో మన్నాడే, తలత్ మహమూద్ , మహ్మద్ రఫీ,
కిశోర్ కుమార్ వంటి గాయకులు ఎందరున్నా ముకేష్ పాట మాత్రం హృదయ రంజితమే.
నలభయ్యవ దశకం ద్వితీయార్ధంలో హిందీ చలనచిత్ర నేపధ్య గాయకుడిగా మొదలైన
ముఖేష్ గాత్ర యానాం అచంచలంగా , అద్వితీయంగా, నవనవోన్మేషంగా సాగింది.
చివరివరకు కూడా ఆ గళానికి విశ్రాంతి లేదు. ఆ గళం నుంచి జాలువారిన గీతామృత ధారలు ప్రతి ఒక్కరిని
అలరిస్తూనే వచ్చాయి. నేటికీ ఆయన పాట మకుటాయమానం. భావానికి, అర్ధానికి మధ్య ఉండే స్వర శిఖరం ముఖేష్.
అందుకే అలాంటి గాయకుడికి జయంతులు, వర్ధంతులు ఉండవు. ఎక్కడైతే పాట పరవళ్లు తొక్కుతుందో
అక్కడ ముఖేష్ ఉంటాడు. ఎక్కడైతే భావం హృదయాన్ని తట్టి లేపుతుందో అనిర్వచనీయమైన
అనుభూతిని అందిస్తుందో అందులో ముఖేష్ కనిపిస్తాడు. ఆయన పాడిన ఏ పాట తీసుకున్నా
భావ యుక్తతకు నిలువెత్తు నిదర్శనమే.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *