గిరీశం, వెంకటేశం. మధ్యలో ‘భోగాపురం’

గత ఆదివారం భోగాపురంలో విమాన సర్వీసులు ప్రారంభించడానికి ముందు చేసిన రచన

*******

గిరీశం: సాయంకాలవైంది. మధ్యాహ్నానికల్లా వస్తానని చెప్పిన వెంకటేశం ఇప్పటిదాకా అయిపు లేడు. వీడికి ఈ మధ్య గోరోజనం ఎక్కువయింది. వీళ్ల నాన్న అగ్నిహోత్రావధానులు గారి గోల భరించలేక  విశాఖపట్నంలో ఉండే నా మిత్రుడు, పేపరు ఎడిటరు కాళ్లా వేళ్లా పడి, చచ్చీ చెడీ శాయంగల విన్నపాలన్నీ చేసి వీడిని అక్కడ ఉజ్జోగంలో చేర్పించడం పాపవైపోయింది. అప్పట్నించీ బొత్తిగా నల్లపూసయిపోయాడు. మన బొంకుల్దిబ్బ, మూడు లాంతర్లు, గంట స్థంభం అన్నీ మరిచిపోయి పూర్తిగా విశాఖ వాసి అయిపోయాడు. వీడొస్తే ఏదో రకంగా బతిమాలి బామాలి ఓ ఫైవ్ హండ్రెడ్ లాగెయ్యాలి. నిన్ననే జీతాలిచ్చి ఉంటారు.

    ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశంలా ఉంది. ముఖం ఏవిటీ ఆవుదం తాగినట్టు పెట్టుకొస్తున్నాడు? ఏంవాయ్ మై డియర్ వెంకటేశం, ముఖం ముటముటలాడిస్తున్నావు..మీ ఎడిటరు నిన్ను ముక్క చీవాట్లు పెట్టాడా ఏవిటి? 

వెంకటేశం: ఇహ మీర్నాతో మాట్లాడకండి. ఇవాళ రాను మొర్రో అంటుంటే వినకుండా ఇవాళే రమ్మని భీష్మించుకున్నారాయె. ఇవాళ భోగాపురం ఏర్ పోర్టు ప్రారంభోత్సవట..దారి పొడవునా జనాలూ, ట్రాఫిక్ జాములూనూ..అవన్నీ దాటుకుంటూ నానా అగచాట్లు పడి ఇక్కడికి చేరేటప్పటికి ఈ వేళయింది. ఇంతకీ ఏవిటి విషయం నన్ను ఉన్న పళంగా రమ్మన్నారు?

గిరీ: ఇవాళ మనం చాలా ఆనందంగా ఉన్నామోయ్ వెంకటేశం..ఈ శుభ సందర్భంలో ఒక కేజీ మిఠాయి కొని మీ ఇంటిల్లిపాదికీ ఇద్దామనుకుంటుణ్నాను. ఏదీ, ఓ ఫైవ్ హండ్రెడ్ కొట్టు!

వెంక: ఇది మరీ బావుంది. నా డబ్బుల్తో మిఠాయి కొని మా ఇంట్లో వాళ్లకి అదేదో మీరే కొన్నట్టు మెహర్బానీ చేస్తారా? ఇంతకీ ఎందుకా ఆనందం?

గిరీ: ఇది నా ఒక్కడి ఆనందం కాదోయ్, మన విజయనగరం వాళ్లందరి ఆనందం అనుక్కో. అంత గొప్ప విమానాశ్రయం మన జిల్లాకి రావడం, సాక్షాత్తూ ప్రధాన మంత్రిగారు మన జిల్లాలో అడుగుపెట్టి దానిని ప్రారంభించడం ఆనందం మాత్రమే కాదు, గర్వం కూడా కదుటోయ్!

వెంక: మీకలాగే ఉంటుంది. మా విశాఖపట్నం వాళ్లు మాత్రం అంత సంతోషంగా లేరు.

గిరీ: ఏవిటీ మా విశాఖపట్నం, మా విశాఖపట్నం అంటున్నావు.. విశాఖపట్నంలో ఉజ్జోగం వెలగబెట్టి రెణ్ణెల్లు కూడా కాలేదు, అప్పుడే ఉన్న ఊరు ప్రియమూ, కన్న ఊరు అప్రియమూ అయిపోయిందా ఏవిటి?

వెంక: అదేమీ లేదు లెండి. మన జిల్లాకి విమానాశ్రయం వస్తే నాకు మాత్రం సంతోషంగా ఉండదా? పాపం, విశాఖపట్నవే అన్యాయం అయిపోయిందని విచారంగా ఉంది.

గిరీ: ఇప్పుడు విశాఖపట్నానికి వచ్చిన లోటేమిటోయ్..క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రైల్వే జోనూ, గూగుల్ డేటా సెంటరూ..

వెంక: వల్లకాడూ, వసినిదిబ్బా.. అన్నీ ఉన్నా అయిదోతనం లేనట్టు విశాఖకి విమానాశ్రయం ఏదండీ? నగరంలో ఉన్నది కాస్తా మూసేసి ఊరికి దూరంగా వేరే జిల్లాలో ఉన్న భోగాపురంలో పెడితిరాయె.. ఇది విశాఖపట్నానికి అన్యాయం చేసినట్టు కాదూ? పైగా అంతర్జాతీయ నగరం అంటూ డప్పాలు ఒకటీ.. చెప్పుకుంటే సిగ్గు చేటు.

గిరీ: డామిట్..ఇలాంటి మాటలంటేనే నాక్కోపమొస్తుంది. అసలు ఏ ఊళ్లో విమానాశ్రయం ఆ ఊరి నడిబొడ్డున ఉంది చెప్పు. విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో, రాజమండ్రి విమానాశ్రయం మధురపూడిలో, తిరుపతి విమానా శ్రయం రేణిగుంటలో, హైదరాబాద్ విమానాశ్రయం శంషాబాదులో లేవూ? 

వెంక: నిజవే గానండి, అవన్నీ ఊరికి పాతిక ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోపే ఉన్నాయండి. మన భోగాపురం మాత్రం నలభై, యాభయ్ కిలోమీటర్ల దూరం లో ఉందండీ.. మామూలుగానే విమానాశ్రయానికి గంట ముందుగా వెళ్లాలి. విశాఖలో ట్రాఫిక్ సమస్యల్ని దాటుకుంటూ భోగాపురం చేరాలంటే కనీసం నాలుగ్గంటలు ముందుగా బయల్దేరాలి. ఇక ఏ గిరి ప్రదక్షిణం నాడో విమాన ప్రయాణం పెట్టుకుంటే విశాఖ ప్రదక్షిణం చెయ్యాల్సిందే!

గిరీ: నువ్వు విశాఖపట్నం వెళ్లి పూర్తి విశాఖ మనిషివై పోయావు. ఎంతసేపూ విశాఖ నుంచి దూరం గురించే మాట్లాడుతున్నావు గాని మన విజయనగరం నుంచి పాతిక కిలోమీటర్లలోపే భోగాపురం ఉందని మర్చిపోతున్నావు.

వెంక: సరే, ఆ విషయం అలా ఉణ్ణీండి.. విశాఖలో ఏ మూల నుంచయినా భోగాపురం వెళ్లాలంటే కనీసం రెండు మూడు వేలు టాక్సీ ఎదాన పొయ్యాల్సిందే. ఆ పైన టిక్కెట్టు చార్జీలతో పాటు ఎక్కడా లేనంత ఎక్కువగా ఏర్ పోర్టు వాడకం చార్జీలు పెట్టారు. మొత్తం ప్రయాణం ఖరీదు తడిసి మోపెడు. ఇదివరకు గోపాల పట్నం దగ్గర విమానాశ్రయం ఉన్నప్పుడు విజయవాడక్కూడా విమానంలో వెళ్లిపోయేవారు. ఇప్పుడు భోగాపురం వెళ్లి విమానం ఎక్కేకంటే రైల్వే స్టేషనుకి వెళ్లి వందే భారత్ ఎక్కడం మేలని జనాలు అనుకుంటున్నారు.

గిరీ: నాన్సెన్స్..నేను మొదటి నుంచీ అనుమానిస్తూనే ఉన్నాను నువ్వు మారిపోతావని.

వెంక : నేనేవీ మారలేదు. విశాఖ జనాలు అనుకుంటున్నదే చెప్పేను. పేపర్లో పని చేస్తున్నాను కాబట్టి  ప్రజల అభిప్రాయం మాకు తెలిసిపోతూ ఉంటుంది.

గిరీ: సరే, విశాఖ ప్రజలకి కాస్త ఉపశమనంగా ఉండాలంటే రెండు మార్గాలున్నాయి. చెప్పమంటావా?

వెంక: ఏవిటో శెలవివ్వండి.

గిరీ: మొదటిది, భోగాపురాన్ని తీసుకెళ్లి విశాఖ జిల్లాలో కలిపెయ్యడం. అలా చేస్తే విమానాశ్రయం మన జిల్లాలోనే ఉందని విశాఖ వారికి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.

వెంక: అందుకు విజయనగరం ప్రజలు చచ్చినా ఒప్పుకోరు. గొడవ చేస్తారు.

గిరీ: మరయితే మరో దారి ఉంది. విమానాశ్రయం బయట అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలతో రాసేరు కదా..దాని కింద విశాఖపట్నం అని రాసేస్తే సరి. అక్కడికి అది విశాఖపట్నం ఎయిర్ పోర్టు అయిపోతుంది. విశాఖపట్నానికి విమానాశ్రయం లేదన్న చింత తీరిపోతుంది.

వెంక: ఈ ఆలోచన దివ్యంగా, తల్లీ బిడ్డా న్యాయంగా ఉంది. మరయితే చంద్రబాబు గారికి ఉత్తరం రాసెయ్యండి.

గిరీ: చంద్రబాబుకి కాదు, లోకేష్ బాబుకి రాస్తాను. ఆయన ఒప్పుకుంటే పని సానుకూలమవుతుంది. దేవుడు వరమివ్వాలంటే ముందుగా గణపతి పూజ చెయ్యాలి కదా!

వెం: సరే, పదండి. మీరడిగిన మిఠాయి కొనుక్కుందాం.

   — మంగు రాజగోపాల్,  సీనియర్ జర్నలిస్టు — (‘లీడర్’ పత్రిక (6-08-26) సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *