

తెలుగుదేశం మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు గారిది శ్రీకాకుళం జిల్లా. వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ గారిది విజయనగరం జిల్లా. ఇరుగుపొరుగు జిల్లాలకి చెందిన ఈ ఇద్దరు నాయకుల మధ్య శాసన మండలిలో జరిగిన వాగ్యుద్ధంతో సభ దద్దరిల్లిపోయింది.
మెగా డిఎస్సీ అంశం మీద చర్చ జరుగుతుండగా మంత్రి అచ్చంనాయుడు ప్రతిపక్షనాయకుడు బొత్స సత్యనారాయణని ఉద్దేశించి "దద్దమ్మ, దద్దమ్మ" అని పునరుద్ఘాటించారు. దాంతో బొత్స సత్యనారాయణకి కోపం వచ్చి "ఎద్దులా ఉన్నావు" అంటూ ఆంగిక విన్యాసం చేసి చూపించారు. ఇద్దరూ ఒకరిని ఒకరు "ఎద్దు" అనీ "దద్దమ్మ" అని ఆడిపోసుకుంటుంటే అశేషాంధ్ర ప్రజానీకం టీవీల్లో కళ్లారా తిలకించి తరించారు. మర్నాడు పేపర్లలో "దద్దమ్మ..ఎద్దు" అనే హెడ్డింగులతో వార్తలు చదివి ధన్యులయ్యారు.
కట్ చేస్తే ...
బుచ్చినాయుడని ఒక చోటా లీడర్. మంత్రి అచ్చెంనాయుడికి వీరాభిమాని. ఇతగాడిది కూడా శ్రీకాకుళం జిల్లాయే. అలాగే బొత్స సత్యనారాయణకి కూడా విజయనగరం జిల్లాలో ఒక వీర భక్తుడు ఉన్నాడు. అతగాడి పేరు చిట్టినాయుడు. విశేషం ఏమిటంటే వీళ్లిద్దరూ చెడ్డీ దోస్తులు. వాళ్ల నాయకులు వైరి పార్టీల్లో ఉన్నా వీరిద్దరు మాత్రం "యే దోసుతీ, హమ్ నహీ చోడేంగే" టైపు. పైగా దూరపు చుట్టరికం కూడా ఉంది. 'ఏరా బావా' అంటే 'ఒరే బావా' అనుకుంటూ ఉంటారు.
వీళ్ల నాయకుల మధ్య కౌన్సిల్ లో గొడవయిన రోజు సాయంత్రం వీళ్లిద్దరూ ఒక బార్ లోకి దూరారు.
" ఒరే బావా, నేనీమధ్య అస్సలు తీసుకోడం లేదురా.. ఎప్పుడో నీలాంటి ఫ్రెండు కనిపిస్తే తప్ప...అది కూడా మహా అయితే ఒక పెగ్గు..అంతేరోయ్" అన్నాడు చిట్టి నాయుడు.
" నేనూ అంతే బావా..నేను ఎంత గట్టిగా అనుకున్నా అలాంటి ఫ్రెండ్సు రోజుకొకడు తగులుతున్నాడు, ఇప్పుడు నీలాగ" అన్నాడు బుచ్చినాయుడు.
చిట్టినాయుడు "ఒరే అప్పిగా!" అంటూ బాయ్ ని పిలిచి "మన బ్రాండ్ తెలుసుగా, రెండు లార్జ్, వాటర్ బాటిల్, ఉడకపెట్టిన పల్లీలు పట్టుకురా!" అని పురమాయించాడు. అప్పిగాడు చిటికెలో తెచ్చి, గ్లాసుల్లో మందు, వాటరు కలిపి ఇచ్చాడు.
మొదటి రౌండు
ఇద్దరూ గ్లాసులెత్తి చెరో గుటక వేశారు. బుచ్చినాయుడు నాలుగు పల్లీలు నోట్లో వేసుకుని నవులుతూ "ఒరే బావా, నువ్వెన్ని చెప్పు. మీవోడు మావోడిని అలా అనడం తప్పురా!" అంటూ మొదలెట్టాడు.
"ఏమన్నాడు బావా?" వెంటనే గుర్తుకురాక అడిగాడు చిట్టినాయుడు.
" అదేనో, "ఎద్దు..ఎద్దు" అని అనలా? ఒక మంత్రిని పట్టుకుని ఎంత మాటనీసేడు బావా మీ వోడు?" - బుచ్చినాయుడు.
" మరి మీవోడు తక్కువ తిన్నాడేటి? సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడని కూడా చూడకుండా మావోడిని "దద్దమ్మ, దద్దమ్మ" అనలేదేటి" - చిట్టినాయుడు.
ఇద్దరూ గ్లాసులు ఖాళీ చేసి, మరో రెండు లార్జ్ లు ఆర్డర్ చేశారు. అప్పిగాడు తేగానే సిప్ చేస్తూ మొదలెట్టారు.
రెండో రౌండు
ఇద్దరికీ కొంచెం ఎక్కింది. "బొత్స సత్యనారాయణ అంటే ఏటనుకుంటన్నావు? మీవోడికన్నా సీనియర్ తెల్సా? అలాంటాయన్ని పట్టుకుని 'దద్దమ్మ' అంటాడా మీవోడు?" చిట్టినాయుడి స్వరం పెరిగింది.
"మా శీకాకోళం జిల్లాకే కింగులాంటి అచ్చెంనాయుడు గోరిని 'ఎద్దు' అని మీవోడు తిట్టలేదేటి మరి?" బుచ్చినాయుడు కూడా గొంతు పెంచాడు.
చుట్టుపక్కల టేబిళ్లవాళ్ల తలలు తిప్పి వీళ్లని ఆసక్తిగా చూశారు. అప్పిగాడు ఉత్సాహంగా మరో రెండు లార్జిలు తెచ్చిపోశాడు.
మూడో రౌండు
నాయుడు బావలిద్దరూ గుటుక్ గుటుక్ తాగేశారు. ఇద్దరికీ నిషా తలకెక్కింది.
"ఏం మాట్లాడుతున్నావురా బోసిడీకే.. దేవుడులాంటి మా అచ్చెంనాయుడు గోరిని ఎద్దు అంటే రెండు కళ్లు పోతాయ్!" అరిచాడు బుచ్చినాయుడు.
"పోరా బాడుకావ్..కౌన్సిల్ లో పార్టీని ఎంతో బాగా నడిపిస్తున్న మా బొత్స సత్తిబాబు గోరిని దద్దమ్మ అంటే మూతిపళ్లు రాలిపోతాయ్!" మరింత గట్టిగా అరిచాడు చిట్టినాయుడు.
వీళ్ల అరుపులు, కేకలకి చుట్టుపక్కల టేబిళ్ల వారు పరిగెత్తుకువచ్చారు, "ఏటండీ..ఏటయినాది" అంటూ.
బుచ్చినాయుడు తన గ్లాసు పూర్తి చేసి, "ఇవాళ పొద్దున్న టీవీలో మీరెవవరూ చూడలేదా?" అని అడిగాడు. "లేదు, లేదు" అన్నారంతా.
బుచ్చినాయుడు అందరికీ కనబడేలాగా, అందరికీ వినబడేలాగా కుర్చీ ఎక్కి మొదలుపెడుతుండగా ఓ కుర్రాడు దూసుకొచ్చాడు. "సార్, సార్.. ఆగండి.. నేను రీల్స్ చేసుకుంటా!" అంటూ సెల్ ఫోన్ ఎత్తిపట్టుకుని ప్రాధేయపడ్డాడు. "చేసుకో పో" అంటూ ఉదారంగా పెర్మిషన్ ఇచ్చేసి మళ్లీ మొదలుపెట్టాడు బుచ్చినాయుడు.
"మహా జనులారా.. వినండి.. అసలేటయినాదంటే, ఇవాళ కౌన్సిల్ లో పెద్ద గొడవ అయిపోనాది. మన మంత్రి అచ్చెంనాయుడి గోరిని పట్టుకుని బొత్స సత్యనారాయణ గోరు "ఎద్దు..ఎద్దు" అనీసినాడండి..అంత పెద్ద మనిషిని పట్టుకుని అంత మాట అనీవచ్చునాండి? న్యాయం తమరే చెప్పండి".
చిట్టినాయుడు గ్లాసు ఖాళీ చేసి, తను కూడా కుర్చీ ఎక్కి నిలబడ్డాడు. రీల్స్ కుర్రాడు తన సెల్ ఫోన్ ని అటువైపు తిప్పాడు. చిట్టినాయుడు ఎఫెక్టు కోసం కళ్లు తుడుచుకుని " ప్రజలారా, మావోడు సగమే చెప్పేడు. అసలు మొదలు పెట్టిందే అచ్చంనాయుడు గోరు. మొదట ఆయనే మా బొత్స సత్తిబాబుని "దద్దమ్మ, దద్దమ్మ" అని గట్టిగా అరిచి మరీ చెప్పినాడండీ..ఇప్పుడు మీరే చెప్పండి, తప్పెవరిదో?" ఊగిపోతూ అన్నాడు.
అందరూ రెండు గ్రూపులుగా విడిపోయి, అసలు "ఎద్దు..దద్దమ్మ" అనే పదాలు తిట్ల కేటగిరీలోకి వస్తాయా రావా అని తర్కించుకోసాగారు.
ఇలా బార్ లో గొడవ అవుతున్న సంగతి లోకల్ టీవీ రిపోర్టరుకి తెలిసి, "ఇవాళ నా పంట పండింది" అని ఎగిరి గంతేసుకుంటూ లోపలికి వచ్చాడు.
"సార్లూ..ఇలా మీరు తాగి దెబ్బలాడుకోడానికి ఈ చెత్త బారు కన్నా మా టీవీ చానెలే కరెక్టు ప్లేసు..పక్కనే మా ఆఫీసు ఉంది. అక్కడ ఫ్రెష్షుగా మళ్లీ డిస్కషను పెట్టుకుందాం. కావాలంటే అక్కడ మీకు మరో లార్జి ఇప్పిస్తాను" అంటూ బయటికి దారి తీశాదు. బావలిద్దరూ తూలుకుంటూ అతడి వెనకే వెళ్లారు.
నాలుగో రౌండు
బుచ్చినాయుడు, చిట్టినాయుడు లోకల్ టీవీ చానెల్ లో నాలుగో రౌండు పూర్తి చేసి డిస్కషనుకి కూర్చున్నారు.
"మీ లీడరు దద్దమ్మ కాబట్టే అల్లప్పుడు వోక్స్ వేగను కార్ల కంపెనీ పేరు చెప్పి, మీవోడికి ఆడెవడో బురిడీ ఏసి కోట్లకి కోట్లు ప్రజా ధనం దొబ్బుకుపోయాడు. సొమ్ములు పోనాయి, మరేటి సేత్తాం అనడం తప్ప మీ వోడు ఇంకేటి చెయ్యలేకపోయాడు -- బుచ్చినాయుడు
"ఎల్లెల్లవో.. మీ లీడరు పార్టీ ప్రెసిడెంటు అయి ఉండి కూడా పార్టీ లేదు, బొక్కా లేదు అని పార్టీని వెంట్రుక ముక్కలా తీసేసినందుకు పార్టీ వోళ్లు తిట్టిపోసినా ఎద్దుచర్మం మందం కాబట్టి దులుపుకుపోయాడు" -- చిట్టినాయుడు.
ఇక ఇద్దరూ బూతులు కూడా తిట్టుకుంటారని టీవీ రిపోర్టరు వాళ్ల వాక్ప్రవాహానికి అడ్డుపడి "ఈ తగువు ఇవాళ తెమలదు గాని మనం ఆడియెన్స్ పోల్ పెట్టుకుందాం. జనం ఏంటంటారో చూద్దాం" అని పరిష్కారం చూపాడు. సరేనని ఇద్దరూ ఒప్పుకున్నారు.
ఆడియెన్స్ పోల్ అంటే ఏమిటో రిపోర్టరు వాళ్లకి ఇలా వివరించాడు. " చిట్టినాయుడు గారూ! మీ లీడర్ బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని మంత్రి అచ్చెంనాయుడు గారు అన్నారు కదా.. బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ అవునా, కాదా అన్నది వీక్షకుల్ని అడుగుదాం. అవును, కాదు, తెలియదు అని మూడు ఆప్షన్లు ఇద్దాం"
చిట్టినాయుడు ఒప్పుకున్నాడు.
"ఇప్పుడు బుచ్చినాయుడు గారూ, మీ లీడర్ అచ్చెంనాయుడిని ఎద్దు అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు కదా..అచ్చెంనాయుడు ఎద్దు అవునా, కాదా అన్నది వీక్షకుల్ని అడుగుదాం. అవును, కాదు, తెలియదు అను మూడు ఆప్షన్లు ఇద్దాం. వీక్షకులకి అయిదు నిమిషాలు టైమ్ ఇద్దాం. అయిదు నిమిషాల తర్వాత ఫలితాలు చూదాం. ఇప్పుడు పోలింగ్ స్టార్టవుతుంది" అన్నాడు రిపోర్టరు.
చిట్టినాయుడు, బుచ్చినాయుడు ఊపిరి బిగపెట్టి చూస్తున్నారు. అయిదు నిమిషాలు భారం గడిచాయి. ఫలితాలు వెలువడ్డాయి. వాటిని చూసేసరికి నాయుడు బావలిద్దరికీ తాగిందంతా దిగిపోయింది. రెండు ప్రశ్నలకీ వీక్షకులు గంపగుత్తగా ఎంచుకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏమిటంటే..
"తెలియదు"సీనియర్ జర్నలిస్టు
-- మంగు రాజగోపాల్,
(లీడర్ దినపత్రిక 27-08-26 సంచికలో ప్రచురితం)







