ఆధ్యాత్మిక సౌరభం ‘‘ ఆషాఢం’’

     కాలం శక్తివంతమైనది అన్నీ తనలో దాచుకొని సమయం వచ్చినప్పుడు మనకి తన జ్ఞాపకంగా వేడుకలని, ఉత్సవాలని అందిస్తుంది. ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరంగా అడుగులు వేసిన తరువాత, మరలా ఛైత్రం వరకు ఆధ్యాత్మికతని పంచే పండుగలు దర్శనం యిస్తాయి.
‘‘మాసానాం మార్గశీర్షం’’ అని గీతాకారుడు చెప్పిన ప్రతీమాసం భగవంతుని స్మరణలో తరించిపోతుంది. ఆషాఢం నిజంగా అమ్మవారి మాసం. యింకా అమ్మవారే సోదరుడు అయిన శ్రీహరిని సేవిస్తారు. ఈ ఆషాఢంలో ప్రాంతీయ సంస్కృతులు గొప్పతనానికి నిదర్శనంగా సంబరాలు జరుగుతాయి.
 ఆషాఢంలో ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. భాగవతంలో హృదయపూర్వకంగా ధ్యానించే వారు చతుర్మాస దీక్ష అవలంభిస్తారు. కేవలం ఫలాన్ని స్వీకరిస్తారు. ప్రత్యేకమైన వస్త్రధారణ ద్వారా ఈ దీక్షని సంకల్పంగా ఆచరిస్తారు.
‘పవళించు శేషసాయి’ అని ఒక గేయం ఉంది. లోకాన్ని రక్షించే శ్రీహరి యోగ నిద్రలోకి వెడతారు.
 ‘ఆచార్యదేవోభవ’ అని మన సంస్కృతి పలికింది. భారతీయతకి అచ్చమైన సజీవ సాక్ష్యం మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతాలు. భారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన ‘వ్యాసపూర్ణిమ’ నాడు గురుసత్కారం చేస్తారు.
ఇక ‘సర్వం జగన్నాథం’ అని వాఖ్యానం ఉంది. మహాకవి శ్రీశ్రీ వస్తున్నాయి... వస్తున్నాయి జగన్నాధ రథ చక్రాలు అని రాశారు. జగన్నాథ రథయాత్ర అనగానే అందరికి ఒరిస్సా రాష్ట్రంలో పూరీ గుర్తుకి వస్తుంది. లక్షలాది మంది భక్తులు రథయాత్రకి తరలి వెడతారు. అంతేగాదు విశాఖలో జగదాంబ సెంటర్ సమీపాన జగన్నాథ స్వామి ఆలయం ఉంది. అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
 ‘‘గోరింటా పూచింది కొమ్మలేకుండా’’... అని సినీ రచయిత రాశారు. గోరింట ఎంత ఎర్రగా అతివ చేతి మీద పండితే అంతటి అనురాగం పండించే భర్త వస్తారని ఒక నమ్మకం ఉంది. మగువలందరూ గోరింటాకు అందంగా అరచేతుల మీద అలంకరించుకోవడం ఆనవాయితీ.   ఆషాఢం అనగానే తెలంగాణా సంస్కృతి ‘‘బోనాలు’’ స్మరణకి వస్తాయి. సిక్రిందాబాద్ నుంచి తెలంగాణా అంతా బోనాలు సమర్పిస్తారు. ఆషాఢం గుబాళించిన ఆధ్యాత్మిక సంపెంగ సౌరభం. 
   ‘‘ఆషాఢానికి కొసమెరుపు’’ అనిప్రముఖ వస్త్ర సంస్ధలు రాయితీలు అందిస్తాయి.  పలు సంస్ధల షోరూములు వస్త్రాలను కేజీల్లో అమ్ముతూ  స్వాగతం పలుకుతాయి. 

డా. డి.వి.యస్.శర్మ , పరిశోధకులు, సెల్ : 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *