

ప్రేమ కథలు ఎప్పుడూ మనస్సుకు హాయైన స్పర్శను అందిస్తాయి. అంతేకాదు వేదనను, ఆనందాన్ని విచిత్రంగా సమర్పిస్తాయి. ప్రేమ అనే భావన ప్రతిక్షణం కొత్తగా జనిస్తూ పరవశింప జేస్తుంది. ప్రేమ కథలు
భావ సంపెంగలు.
గురువారం ప్రీమియర్ షోగా విడుదలైన "చెన్నై లవ్ స్టోరీ".పైన ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. బేబీ దర్శకుడు
సాయి రాజేష్ ప్రేమకథకు అధ్బుతాన్ని జతచేశారు. ప్రేమించే వ్యక్తి మరణించవచ్చుకానీ ప్రేమ ఎప్పుడూ చిరాయువుగా నిలుస్తుందనే సందేశం ఇచ్చారు. కథనిండా ప్రేమ దాగి ఉంది. చిత్రకథ ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ముగింపు రావడం విశేషం. ఈ కథను వెండితెరపైనే చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది. విఫలమైన ప్రేమ కథకు సినిమాల మీద ఆరాధనకు సాన్నిహిత్యం కలిపారు.
కథ చెన్నై కేంద్రంగా మొదలైంది. పెళ్లివరకు వచ్చి ఆగిపోయిన ప్రేమ కథానాయిక నిధి రచయితగా ఎదగాలన్న
ఆశ, కథానాయకుడు స్టీవెన్ శంకర్ వీరిద్దరి మధ్య వచ్చే దృశ్యాలు అందమైన భావుకత కలిగి అందరికీ నచ్చేలాగా
దర్శకులు రవి నంబూరి తన సృజనంతా ఉపయోగించి చిత్రీకరించారు. చిత్రం అనుభూతిని పంచుతుంది. పాటలు
ఆర్ద్రతగా అనిపిస్తాయి. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందరికీ నచ్చింది.
విశ్రాంతికి ముందు కథ కీలకమైన మలుపు తిరుగుతుంది. తరువాత కథ నెమ్మదిగా నడిచి ప్రేక్షకులకు కొంత
నిరాశ కలిగిస్తుంది. ముగింపు మాత్రం హృదయాన్ని తడిపేస్తుంది. చిత్రంలో అందరికీ చాలాకాలం గుర్తుండిపోయే పాత్ర శ్రీ గౌరీప్రియది. వర్ధమాన తార అయినా భావోద్వేగాలను తెరమీద బాగా పండించారు. అందరీకీ ఆమె అభినయం నచ్చింది. అబ్బవరం కిరణ్ సహజంగా నటించారు. చిత్రంలో ప్రేమ, విషాదం , కోపం భావోద్వేగాలు కథను నడిపించాయి. విశ్రాంతి తరువాత స్క్రీన్ ప్లే మీద కొంచం శ్రద్ధ వహిస్తే బాగుండేది. టెలివిజన్ నటుడు శ్రీనివాస రెడ్డి కథను పరిచయం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు. హీరోయిన్ గౌరీప్రియ తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మంచి నటి దొరికిందనే భావనను ప్రేక్షకులకు కలిగించింది.
— డాక్టర్ డి.వి.ఎస్. ఎస్. శర్మ , సినీ పరిశోధకులు , 99490 39175




