
*ఈ రోజు రా.వి. శాస్త్రి జయంతి*
“ది ఎర్లీ బర్డ్ కాఛెస్ ది వర్మ్” అన్నాడు ఇంగ్లీషు వాడు, పురుగుని పట్టే పిట్ట పొద్దున్నే లేవాలన్నాడు. ఇంగ్లీషు వాడేం తక్కువ వాడు కాదు. ఏం చెప్పినా బాగా ఆలోచించి కాని చెప్పడు. ఏది చేసినా లాభం కోసం తప్ప చేయడు. అందుచేత రోజూ వేగిరం లేచి వేగిరం కోర్టుకి వెళ్ళి, దగ్గరుండి కోర్టు గేట్లు తీయించు. సాయంకాలం ఎంచక్కా కోర్టు తాళాలు వేయించి మరీ ఇంటికి రా. ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండు. వేశ్యలు వీధి గుమ్మాలు కనిపెట్టుకుని ఉంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేళ్ళాడతాయి. సామ్యం బావులేదు కాని మనం చేయవలసింది కూడా అదే”. ఇది మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు మాయ కథలో పెద్ద ప్లీడరు గారు తన జూనియర్‌కి చేసిన ఉపదేశం. ఈ ఉపదేశం ఇంకా చాలానే ఉంది. కాని ఈ నాలుగు లైన్లు చాలు రా.వి.శాస్త్రిగారు అని సాహిత్య లోకం, చాత్రిబాబు అని ఉత్తరాంధ్రలోని పామర జనం పిలుచుకునే మహా రచయిత పదునైన కలం అని చెప్పడానికి. ఈ నెల 30వ తారీఖు నాటికి శాస్త్రి గారికి వందేళ్లు. అంటే చాత్రిబాబు శతజయంతి అన్నమాట. మరో వందేళ్లు, రెండొందలేళ్లయినా ఆ మహా రచయిత రచనలు శాశ్వతం. తెలుగు వారికి నోబుల్ బహుమతి ఇవ్వాలని ఆ నిర్వాహకులకు అనిపిస్తే గురజాడ తర్వాత ఇవ్వాల్సిన ఆ నోబుల్ ప్రైజ్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న మహా రచయిత శ్రీ చాత్రిబాబు. లాయర్ వృత్తిలో ఉండి న్యాయవ్యవస్థ బట్టలూడదీసిన ధీశాలి శాస్త్రిగారు.
లక్ష్మీ అనే కథని శాఖాహార భోజనంతో ప్రారంభిస్తారు శాస్త్రిగారు. ఆ ప్రారంభం చదివిన వారికి అప్పుడే సుష్టుగా భోజనం చేసినా మళ్ళీ ఆకలేస్తుంది. మనం రాస్తున్నది ఏ మంచికి హాని చేస్తుందో… ఏ చెడుకు మేలు చేస్తుందో. తెలుసుకుని రాయాలంటారు ఆయన. అంతే కాదు… రాయాల్సిన వాళ్ళు రాయాల్సినంత రాయకపోవడం వల్ల రాకూడని రాతలొస్తాయని తన భయాన్ని కూడా చెప్పారాయన. రాష్ట్రంలో ఆ మాటకొస్తే దేశంలో ఆ రోజుల్లో దారుణమైన పరిస్థితులున్నాయి. నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ఎవరూలేని తనం వేధిస్తున్న కాలం అది. అప్పుడు ఓ పెద్ద రచయిత మధ్య తరగతి మానవుడి జీవితాన్ని అసమర్థుని జీవితం ఎలా ఉందో చెప్తూ ఓ చిన్న నవల రాశారు. అది సంచలనం. కాని ఆ నవల చదివాక మావన జీవితం అతలాకుతలం అయిపోతుందనిపిస్తుంది. ఈ వెతలకు, కష్టాలకు, కన్నీళ్ళకు చావు ఒక్కటే ముగింపు అని ఆ నవల తేల్చేస్తుంది. అంటే ఒక విధంగా బతుకులో పోరాడడం కంటే దాని ముందు లొంగిపోయి మరణించడమే మేలని చెప్పకనే చెప్తుంది. ఆ నవల గొప్పది కాదనో, తప్పనో చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఆ నవల వచ్చిన సందర్భం, దాని ముగింపు మానవ జీవితాన్ని ఓ భయం చుట్టూ అలముకునేలా చేసాయన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం.
ఈ నవల వచ్చినప్పుడు తెలుగు సాహిత్యలోకం బెంగటిల్లింది. భయపడింది. తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు తల వొంచాలా అని సందేహపడింది. అదిగో అలాంటి సమయంలోనే రా.వి.శాస్త్రిగారు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ప్రేరణగా అల్పజీవి అనే నవల రాశారు. ఈ నవలలో హీరో సుబ్బయ్య పిరికివాడు, భయస్తుడు, జీవితంలో అనేక ఘర్షణలు పడిన వాడు. నవల ప్రారంభంలో పిరికివాడిగా ఉన్న సుబ్బయ్య నవల చివరికి వచ్చేసరికి ఓ ధైర్యవంతుడిలా… పరాక్రమశాలిగా, దేన్నైనా ఎదుర్కొనే పరిపూర్ణ మానపుడిగా మారిపోతాడు. అన్నింటిని ఎదిరిస్తాడు. ఈ ధైర్యం ఆ కాలంలోని యువతకు ఇచ్చింది శాస్త్రిబాబే. అందుకే శ్రీశ్రీ ఓ వ్యాసంలో రా.వి.శాస్త్రిగారి గురించి చెబుతూ ఈయన సాహిత్యంలో రసన ఉంది అంటాడు.
శాస్త్రిగారు ఎంత పెద్ద రచయితో అంత పెద్ద మనసున్న మనిషి, తనకు నచ్చిన రచన కాని, రచయిత కాని తారససపడితే దాన్ని ఆయన భుజాల మీదకు ఎత్తుకుని ఇంటింటికి మోసుకుపోయే వారు. చిన్న సంఘటన. విశాఖపట్నం కోర్టులో వేరేదో కేసు విచారణ జరుగుతోంది. శాస్త్రిగారు కోర్టులోనే ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు సీరియస్‌గా జరుగుతున్నాయి. అలాంటి సమయంలో కోర్టులోనే ఉన్న శాస్త్రిగారు పగలబడి నవ్వారు. జడ్జితో సహా అందరూ అవాక్కయ్యారు. అంతా సైలెంట్ అయిపోయింది. జడ్జిగారు శాస్త్రిగారి వైపు చూశారు. అప్పుడు శాస్త్రిగారు వినమ్రంగా లేచి క్షమించండి. ఈ మధ్యే వచ్చిన ఓ నవలలోని ఓ సీన్ గుర్తొచ్చింది. అందుకే నవ్వాను అన్నారట. దీనికి జడ్జిగారు ఆ నవల నాకు ఇస్తారా అని కోర్టులోనే అడిగారు. శాస్త్రి గారు వెంటనే తన వెంట తెచ్చుకున్న ఆ నవల ఇచ్చారు. అది కె.ఎన్.వై.పతంజలి రాసిన అప్పన్న సర్దార్ నవల. ఇది జరిగిన మర్నాడు లంచ్ విరామంలో జడ్జిగారిని కలిసేందుకు శాస్త్రిగారు ఆయన ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడ భోజనం చేస్తున్న జడ్జి గారు పకపకా నవ్వుతున్నారు. ఎందుకండి అంత నవ్వు అని అడిగితే మీరిచ్చిన నవల చదివాను. అందులో సీన్లు ఇప్పుడు గుర్తుకొచ్చి అని చెప్పారట. ఈ విషయం పతంజలి, నేను శాస్త్రిగారిని కలిసేందుకు వారింటికి వెళ్తే ఆయనే స్వయంగా చెప్పారు. అంత గొప్ప మనసు ఆ పెద్దాయనది.
కేవలం రచయితో, లేక న్యాయవాదో మాత్రమే కాదు శాస్త్రిగారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహా మనిషి, దీనికీ ఇంకో సంఘటన ఉంది. విశాఖ జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీకి చెందిన కొందరు గిరిజనులను ఏదో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. వారికి బెయిల్ ఇప్పించి, వారి ఊర్లు వెళ్ళడానికి డబ్బులు కూడా ఇచ్చారు శాస్త్రిగారు. అక్కడితో అయిపోలేదు. సాయంత్రం బెయిల్ వచ్చిన ఆ గిరిజనులు వారి గ్రామాలకు వెళ్ళేందుకు బన్ స్టేషన్ కు వెళ్ళారు. ఏజెన్సీ కదా… రాత్రి బస్సులు లేవు. తెల్లవారుజామునే బస్సులుంటాయి. దీంతో వారంతా అక్కడే ఉండి పోయారు. అయితే వీరికి బెయిల్ రావడం, వారు ఇళ్ళకు వెళ్ళడం గిట్టని పోలీసు వారు వారిని ఏదో మిషతో మళ్ళీ అరెస్టు చేసేందుకు వెళ్తున్నారని శాస్త్రిగారికి తెలిసింది. తెలియడమేమిటి ఆ పోలీసులందరికీ పెద్ద అయిన అధికారి శాస్త్రిగారి వీరాభిమాని, ఆయనే విషయం శాస్త్రిగారికి చెప్పారు. అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు.. ఆ అర్ధరాత్రి ఉన్నపాటునే బట్టలు మార్చుకుని బస్ స్టేషన్‌కి వెళ్ళిపోయారు శాస్త్రిగారు. తెల్లవార్లు ఆ గిరిజనులతోనే ఉండి ఉదయాన్నే వారిని బస్సు ఎక్కించి మరీ వచ్చారు. బస్ స్టేషన్‌కి వచ్చిన పోలీసులకు శాస్త్రి గారు కనపడడంతో చేసేది లేక వెనక్కి వెళ్ళిపోయారు. ఇదీ యారాడకొండలాంటి రాచకొండ విశ్వనాథ శాస్త్రి అంటే. ఇంకా చాలా చెప్పొచ్చు చాత్రిబాబు గురించి, కాని ఆయన లేరని గుర్తుకొస్తుంది కదా… కళ్ళకు తెలియకుండానే నాలుగు కన్నీళ్లు వచ్చి గుండెల మీద తడితడిగా జారతాయి. అందుకే ఆయనకు నివాళులర్పిస్తూ… ఈ నాలుగు మాటలు.
–ముక్కామల చక్రధర్, సీనియర్ పాత్రికేయుడు. 99120 19929.




