వాన వాన వందనం

చినుకుల చిరునవ్వులు
వాన రాగాల వయ్యారాలు
మెరుపుల వెలుగులు
మేఘాల గర్జనలు
మబ్బుల పరుగులు
నింగి నుంచి పిలుపులు
నేల తల్లికి జడి జల్లులు
ప్రవాహముల పరవళ్ళు
కొండ కోనల వేగాలు
జలపాతాల ఉరకలు
పైరు తల్లికి అభిషేకాలు
పచ్చదనాల ఆలింగనాలు
ప్రకృతి కాంత సౌందర్యాలు
పూల బాలల పరిమళాలు
ఫలాల తీయదనాలు
తనువు కొత్త భాషలు
తన్మయత్వాల తరంగాలు
బాల్యం వెనకకు నడిచిన క్షణాలు
తడిసి ముద్దయిన అనుభవాలు
అక్షరాలకు అందని అనుభూతులు
మట్టి సుగందాల సువాసనలు
చలిగాలులు స్పర్శలు గొడుగుల గుండెలు
వెలుగును మింగిన హోరు జోరులు
రహదారులపై చిత్రంగా పిల్ల కాలువలు
తెరచాపను నిలిపిన వర్షాలు
పసుపును కలిపిన వాన మంత్ర జలాలు
క్షణక్షణానికి చిత్రవిచిత్రపు సవ్వడులు

వాన అంటే ………
జీవుడికి దేవుడి దీవెన!
అంతరంగాన అద్భుత భావన!
సరాగాల వేణు లీల!
అమ్మ పాడిన లాలి జోల!
నింగి నేల ఊరేగే ఊయల!
వసంతం లేకున్నా ఆలపించే చినుకుల కోయిల!
ఎండ వేడిమిని కరిగించే హాయి వెన్నెల !

వర్షం అంటే …..
జ్యేష్టం నుంచి ఆశ్వీజం వరకు పలకరించే
పులకరించే పారవశ్యాల హేళ
అమాయకత్వం గల నిర్మల బాల
రేయి పగలు వికసించే కలువబాల
అందుకే వర్షం పలకరించు
మమ్మల్ని పరవశించు

— డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ, 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *