ఆయన “యాది” ఎట్ల మరుస్తాం…!?


“నూలు బట్టలు కట్టుకుంటే నేల మీద కూర్చున్నా ఏమనిపించదు. పీతాంబరం కట్టుకుంటేనే పీట అవసరం”... ఇలా చెప్పడమే కాదు బతికున్నన్నాళ్ళూ నూలు బట్టలు కట్టుకున్న ఆ పండితుడ్ని ఎలా మరచిపోతాం. సంగీత, సాహిత్య నిధి సామల సదాశివ గారిని యాది చేసుకోకుండా ఎలా ఉంటాం. సాహిత్యం సరే, సంగీతం గురించి మన బండ బుర్రలకి అర్థం అయ్యేలా చెప్పేవారేరీ ఆయన ముందు కానీ, ఆ తర్వాత కానీ. అందుకే ఈ సామల సదాశివ గారంటే తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రి గారు ప్రాణం పెట్టే వారు. అప్పటికి సదాశివ గారు చిన్న పిల్లాడు కదా... “మా ఊరు అదిలాబాద్ మీ అందరికీ దూరం. అందుకే మీరెవ్వరూ మా ఊరు రారు. ఒక్కసారి రాండ్రి. ఎంత బాగా చూసుకుంటామో తెలుస్తది” అంటూ తల్లావజ్ఝుల వారు, విశ్వనాథలతో పాటు పెద్దల ముందు కాసింత అలక ప్రదర్శించారు. “అది కాదులే నాన్నా. ఈసారి సాహిత్య సమావేశం పెట్టు. మేం వస్తాం” అని సదాశివ గారికి ప్రేమగా హామీ ఇవ్వడమే కాదు వెళ్ళారు కూడా అనేక మంది ప్రముఖులు. తనకు గుర్తున్న సంగతులు, చూసిన, చదివిన, అనుభవించిన అనేక విషయాలన్నీ కలిపి “యాది” అంటూ పుస్తకం వేస్తే ఆ కవర్ పేజీ మీద ఏదో ఆలోచనలో ఉన్న సదాశివ గారి కాళ్ళ దగ్గర ఓ కుర్రాడు చాలా శ్రద్ధగా, వొద్దిగ్గా కూర్చునుంటాడు. ఆయన ఏం చెబుతారో విందామనే ఆరాటం కనిపిస్తుంది ఆ కుర్రాడిలో. ఇంతకీ ఆ కుర్రాడెవరో తెలుసా... తెలుగు పాఠకులే. సంగీతాభిమానులే. సాహిత్య ప్రేమికులే. గజళ్ళకు, ఉర్దూ కవిత్వానికి ఆయన చేసే అనువాదాలు చదువుదామనే ఆశ ఆ కవర్ పేజీ మీద కనిపిస్తుంది. ఈ కవర్ పేజీ బొమ్మ వేసింది ఆర్టిస్టు చంద్రే కాని ఆ బొమ్మనిండా ఆనాటి తెలుగు పాఠకులే ఒక్కరై కూర్చున్నారనిపిస్తుంది. 
కురుక్షేత్రం నాటకంలోనో, రాయబారంలోనో, సత్యహరిశ్చంద్ర కాటి సీనులోనో నటీనటులు పలికే పదాల చివర వచ్చే ఆలాపనలు వినే ఉంటారు కదా.... ఆ రాగాలాపనలకి మÖలం ఉత్తరాది అని... మరీ ముఖ్యంగా మహరాష్ట్ర సంప్రదాయం అని రుజువులతో సహా చెప్పింది ఈ సామల సదాశివ గారే. ఇంతే కాదు... సంగీత కచేరీల్లో పక్క వాయిద్యాల గురించి పెద్దగా చర్చించుకోని సమయంలో వాటి పుట్టుక, జన్మస్థలం ఇదర్రా అని చెప్పింది ఈ మహా పండితుడు సామల సదాశివ గారే. 
గజల్స్ విన్నాం కదా... ఆ ఉర్దూ గజల్స్‌ని తెలుగు వారికి పరిచయం చేసింది తొట్ట తొలుత సదాశివ గారేనని, ఆయన చెప్పే వరకూ ప్రాచీన సంగీతం గురించి పెద్దగా తెలిసిన వారు లేరని నాకు ఆధారాలు చూపిస్తూ వివరించింది మరో పండితుడు బూదరాజు రాధాకృష్ణ గారు. నిజాం నవాబుకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ఉద్యమ సమయంలో బయట ఏం జరుగుతోందో ఉద్యమకారులు తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా రేడియో రూపొందించిన బృందంలో ఉన్నదీ ఈ సామల సదాశివ గారే.
“Dear Friend, తొందర్లో ఏదో రాసినాను. ఏమీ అనుకోకండి” అంటూ సదాశివ గారికి ఓ కార్డు వచ్చింది. ఇలా రాసింది ఎవరో కాదు... విశ్వనాథ సత్యనారాయణ. దీనికి కారణం ఏం లేదు, విశ్వనాథ గారి గురించి రాసిన ఓ వ్యాసానికి ఫొటో పంపమని సదాశివ గారు కార్డు రాస్తే... “మీరు ఏం రాస్తారో.. ఎందులో రాస్తారో... నాకు మాత్రం ఈ ఫొటో పంపడానికి కొంత ఖర్చు అయ్యింది” అంటూ విశ్వనాథ వారు ఆ ఫొటో వెనుక రాసి పంపారు. ఆ జాబుకు సదాశివ గారు చాలా సౌమ్యంగా రాసిన ఉత్తరం, ఆ తదుపరి విశ్వనాథ గురించి రాసిన వ్యాసం చదివి ఇలా “ఏమి అనుకోకండి” అని... పైగా “Dear Friend” అని సంభోదిస్తూ రాసిన ప్రత్యుత్తరం అది. విశ్వనాథగారు రాసిన  “ఆ ఏమి అనుకోకండి” అంటూ రాసిన ఉత్తరం వెనుక ఉన్నది సదాశివ గారి ఎదుగుదలే కాదు... ఆయన వొదుగుదల కూడా. సామల సదాశివ గారిని యాది చేసుకోవడమంటే ఆనాటి తరాన్నే కాదు, అప్పటి అనుబంధాలను గుర్తు చేసుకోవడమే.
  • ముక్కామల చక్రధర్ — సీనియర్ జర్నలిస్టు , 99120 19929

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *