వెండితెరపై ఆత్మీయ అనురాగాల గంగావతరణం


“విశ్వనాథం అండ్ సన్స్”
సినిమా కథలన్నీ కనురెప్పల కింద కలలా కరిగిపోతాయి. జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
కొన్ని కథలు అంతరంగాన్ని చేరి ఆలోచింపజేస్తాయి. దర్శకులు వెంకీ అట్లూరి భావుకత కలిగిన
దర్శకులు. రంగ్ దే చిత్రంలో అమ్మాయి , అబ్బాయి చిలిపితనం , ప్రణయ కలహం
అంతకు మించి అనురాగం, అలకలు , ‘సార్’ చిత్రంలో గురుశిష్యుల అనుబంధం , వాత్సల్యం
అనుబంధం చిగురించాయి. ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో ఆర్థికపరమైన అంశాలు , అనుబంధాలు విశ్వనాథం అండ్
సన్స్ లో బాంధవ్యాలు , ప్రేమ భావోద్వేగాలను కథల దారంలో గుచ్చి పరిమళంలా అందించారు.
ఈ చిత్రం నిండా కుటుంబపరమైన విలువలు కనబడతాయి. సంజయ్ పాత్ర సంపన్నుడి పాత్ర
అయినా మానవత, కరుణ, వాస్తవికత ఆలోచనలు కలిగి ఉంటాయి. సంజయ్ గా సూర్య
తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. దర్శకులు ఆ పాత్రను సహృదయంగా తీర్చిదిద్దారు.
నాలుగు పదులు దాటినా అవివాహితుడిగా ఉన్న కథానాయకు జీవితంలో కీలక సన్నివేశాలు
జరుగుతాయి. ఆవి కథను మలుపు తిప్పాయి. సంజయ్ తల్లిగా రాధిక పాత్ర సినిమా అంతటా
కీలకంగా నిలిచింది. మ్యాడిగా అమిత్ బైజు నటన యువ ప్రేక్షకులకు నచ్చుతుంది. వైద్య విద్యార్థిగా
ఒక సరోగసీ బేబీకి తల్లిగా తెరమీద నటనను బాగా పండించారు. చిత్రం ప్రథమ భాగం సరదాగా
నడుస్తుంది. విశ్రాంతి తరువాత కథ ఊహించని రీతిలో మలుపు తిరుగుతుంది. ముగింపు మాత్రం
సినిమాటిక్ గా ఉంది.
దర్శకులు వెంకీ కథను సంభాషణల బలం ద్వారా ప్రేక్షకులకు చేర్చారు. జీ వి ప్రకాశ్ సంగీతంలో
పాటలు సగటు స్థాయిలోనే ఉన్నాయి. కథానాయకుణ్ణి ఒక పక్క ఉన్నతంగా చూపిస్తూ మరోపక్క
స్త్రీ బలహీనత గల వ్యక్తిగా తీర్చిదిద్దడం సమంజసంగా లేదు. రాధిక పాత్రను అర్ధాంతరంగా
ముగించడం ప్రేక్షకులకు రుచించలేదు. రెండవభాగం కథ నిదానంగా నడుస్తుంది. సీనియర్
నటి రవీనా టాండన్ కథలో అంజలి పాత్రలో మెరిశారు. సినిమా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలాగా
రూపొందించారు. దృశ్యాలు చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకులు వెంకీ సినిమాలో ఇది సాధారణం.
ఇటువంటి ఉత్తమ అభిరుచి కలిగిన చిత్రాన్ని నిర్మాత నాగవంశీ, సౌజన్య త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించారు.
ఈ సారి ఆగస్టు 15కు ఆరు కొత్త సినిమాలు పలకరించాయి. సూర్య ఇమేజ్ వల్ల ప్రేక్షకులు
ఈ సినిమాకే ఓటేస్తారని సినీ విమర్శకుల భావన . దర్శకునికి, చిత్ర బృందానికి అభినందనలు.
— డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , 99490 39175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *