
ఇక్కడందరూ క్షామం. అక్కడే కాదు.. దేశమంతటా క్షామమని తలుస్తాను. ఆకాశం ఎర్రగానే ఉంది. సూర్యుడు కోపంగా ఉన్నాడు. రాత్రి రావాల్సిన రహస్యపు వాన జాడ కూడా లేదు. చినుకు రాలడం లేదు కాని కళ్లు వర్షిస్తున్నాయి. ఖరీఫ్‌ని చూడాలనుకుంటే గరీబు జీవితాలే కనిపిస్తున్నాయి. కాలువలు నిండుకున్నాయి. బావులు బావురుమంటున్నాయి. చెరువులు చేదుగా ఉన్నాయి. అంతటా నెర్రలు వారిన పొలాలు. రైతుల నెత్తిమీద ఉండాల్సిన తలపాగా నిరంతరం కళ్లనే తుడుస్తోంది. ఎప్పుడూ చేతిలో ఉండే పొడవాటి కర్ర నడుం విరిగి వొంగిపోయింది. అల్పపీడనాల ప్రకటనలు వస్తున్నాయి. వర్షపు జాడే కాన రావడం లేదు. నగరాలు బర్గర్‌లవుతున్నాయి. పట్టణాలు పిజ్జాలు తింటున్నాయి. పల్లెలు వరికంకుల కోసం ఎదురుచూస్తున్నాయి. చద్దన్నం మాట దేవుడెరుగు… మధ్యాహ్న భోజనం మాటేమిటంటున్నాయి రైతు కుటుంబాలు.
ఓయ్..
నిన్నే…వింటున్నావా. మూడంతస్తుల మేడ సరిపోదని ఆరు అంతస్తులు చేసావు. అందుకు అడ్డంగా ఉన్న ఆ మర్రిమాను తల నరికేసావు. నీ చుట్టూ ఉన్న వృక్షసంపదకు నిప్పు పెట్టి నీళ్ల కోసం ఆకాశం వైపు చూస్తున్నావు. నీకు డబ్బు చేసింది. నువ్వు గుర్తించడం లేదు అంతే. జబ్బులొస్తే డబ్బులతో తగ్గుతాయి. మరి డబ్బులొస్తే..! నీకేం కాదు. ఇనపెట్టెలు నిండుతాయి. లాకర్లకి వొళ్లు చేస్తుంది. కానీ ప్రకృతికే కోపం వస్తుంది. అప్పుడేం జరుగుతుంది. ఏం జరుగుతుందంటావా..! ప్రకృతే సమాధానం చెబుతుంది. కాలాలు అకాలంగా మారతాయి. ఏటికి ఏడాదంతా వేసవి కాలమే అవుతుంది. అప్పుడు నువ్వు కాలాతీత వ్యక్తిగా మారతావు. ఏసీలకి కూడా చెమట పడుతుందని నీకు అప్పుడే తెలుస్తుంది. చెట్టు కోసం నగరమంతా… నీడ కోసం పట్టణమంతా… గాలి కోసం గ్రామమంతా వెతుకుతావు. నువ్వు వెతికిన ప్రతీచోటా నీకు కత్తులు, కొడవళ్లు కనిపిస్తాయి. అవి నువ్వు చెట్లను నరికేందుకు ఉపయోగించిన కానుకలు.
జాతీయ రహదారి విస్తరిస్తున్నామంటుంది ఏలిక. నీకు ప్రయాణం సులభతరం అవుతుందని పత్రికల తొలి పేజీల్లో ప్రకటనలు వస్తాయి. నీ ప్రయాణం సులభమే కాని, కనుచూపు మేర నీకు చెట్ల స్థానంలో ఎండమావులు కనిపిస్తాయి. అసలు నీ బతుకే ఎండమావిగా మారిందని ఆ జాతీయ రహదారి చెప్పే వరకూ నీకు తెలియదు.
నువ్వు నిత్యం పఠించే రామాయణ, భారతాల్లో పర్యావరణ సృహ నిండుగా ఉన్నా ఆ పేజీలను గబగబా తిప్పేసి నీకు కావాల్సిన భక్తి పేజీలనే ప్రతి క్షణం పఠిస్తావు. నీకు పుణ్యం వచ్చేసిందని, నేరుగా స్వర్గప్రాప్తి లభిస్తుందని కలల మీద కలలు కంటావు. ఇదంతా నువ్వు మరణించిన తర్వాత జరిగే క్రియరా నాయనా అని నీకు ప్రకృతే చెబుతుంది. నీ చెవులు పని చేయడం మానేసి దశాబ్దాలు గడిచింది కదా… అందుకని ఎప్పుడో వచ్చే స్వర్గం కోసం ఇప్పటి నీ జీవితాన్ని నరకం చేసుకుంటావు.
నీది ప్లాస్టిక్ జీవితం కదా…! తాగే నీళ్లు… తినే మెతుకులు… పీల్చే గాలి… సమస్తం ప్లాస్టిక్ మయం కదా…! ప్లాస్టిక్ గ్లాసులో తాగే కాఫీ ఎందుకో ప్లాస్టిక్ వాసనే వేస్తుంది. నువ్వు తాగి, వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమీ తెలియని ఆవులు, గేదెలు నములుతాయి. చిత్రంగా అవి ఇచ్చే పాలు కూడా ప్లాస్టిక్ వాసనే వేస్తాయి. నువ్వు నిరంతరం తలమునకలయ్యే సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. మరణించిన ఆవు కడుపులో టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలు. ఆ వార్తని నువ్వు కూడా వందలాది మందికి ఫార్వర్డ్ చేసి ఓ గొప్ప ఘనకార్యం చేసానని అనుకుంటావు. అప్పుడు కూడా నీ ముందున్న టీపాయి మీద ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నవ్వుతూంటూంది. తన చుట్టూ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో నేల దిగాలవుతుంది. అంతకు ముందు వేలుగా, లక్షలాదిగా భూమి పొరలపై తిరుగాడే వానపాములు, నత్తగుల్లలు కానరాక భూమంతా సారం కోల్పోయిన మానవుడిలా నిర్జీవంగా మిగిలిపోతుంది.
ఇంత విధ్వంసం చేసిన నీకు వర్షం కోసం ఎదురుచూసే అవకాశం లేదని ఆకాశం చెబుతుంది. అయినా సరే, మానవుడు ఆశాజీవి కదా అంటూ ఆకాశాన్ని చూస్తూనే నీ చేతులతో ఇంత విధ్వంసాన్ని తిరిగి తిరిగి చేస్తూంటావు. చినుకు క్షమించాలంటే నీ ధ్వంసరచన ఆపాల్సిందే. అంతవరకూ మెడలు పైకెత్తి ఆకాశం వైపు ఎంత చూసినా ఫలితం ఉండదు. ప్రకృతికి నీ మెడలు వంచడం నువ్వు పుట్టక ముందు నుంచే తెలుసు..!
- ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్, 99120 19929 (‘చక్రవాకం’ ఫీచర్ సౌజన్యంతో)





