
— ఈ వారం పుస్తకం —
పురోహితులు అంటే ఇన్నాళ్లూ శుభ, అశుభ కృతువులు నిర్వహించే వారే అనుకునే వాణ్ని. అది కూడా ఆయా నగరాలు, పట్టణాలు, గ్రామాలకు మాత్రమే పరిమితం అనుకున్న అమాయకుడ్ని. పౌరుల హితం కోరుకునే వారు కదా… పురోహితులు. వారికి పరిమితులుంటాయని భ్రమించాను. వాళ్లున్న ఊరులోనో, మహా అయితే వారి స్నేహితులు, బంధువులు ఉన్న ఊర్లలోనే వారి ఆశలు, ఆకాంక్షలు, ప్రేమలు, పట్టించుకోవడాలు వంటివి ఉంటాయని తలంచాను. కానీ ఇదిగో ఇప్పుడే… ఈ పుస్తకం చదివిన తర్వాతే… ఈ ఎల్లలు లేని ప్రయాణపు పలకరింతలు చదివిన తర్వాతే పురోహితులంటే లోక కల్యాణమే ధ్యేయంగా ఉంటారని తెలిసొచ్చింది. ఏ లోకంలో అయితే మనగలుగుతున్నామో అ లోకం పట్ల, ఆ లోకుల పట్ల లాలస లేకపోతే ఇలాంటి ప్రయాణాలు తలకెత్తుకోరు. పుల్వామా దాడిని గుర్తు చేసుకుని ఓ సమూహం జతగూడి ఆ ఊరి ప్రధాన ద్వారం దగ్గరో, లేదూ ఆ ఊరు పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ప్రధాన కూడలి దగ్గరో కొన్ని కొవ్వుత్తులు వెలిగించి సంతాపం ప్రకటిస్తారు. లేదూ ఓ సంతాప సభ పెట్టి కన్నీరవ్వరు గానీ ఆ ఘటనను తలంపులోకి తెచ్చుకుంటారు. అయితే, ఈ బ్రదర్ హుడ్ బైక్ జర్నీ చేసిన ఆకొండి పవన్ ఏం చేసారంటే తన స్వగ్రామమైన అమలాపురం నుంచి జిల్లాలోని అనేక పట్టణాలు, కొన్ని నగరాలు తన మోటార్ సైకిల్‌పై తిరిగి విద్యార్ధుల్లో దేశభక్తి విత్తనాలు నాటారు. ఏ ఏడాదైనా ఫిబ్రవరి 14 వచ్చిందంటే ప్రపంచమంతా ప్రేమ మైకంలో తూలుతుంది. అయితే, 2019 ఫిబ్రవరి 14 మాత్రం దేశానికి ఓ కన్నీటి సంద్రమైంది. పుల్వామా దాడి జరిగింది ఆ రోజే…ఆ దాడిలో తమ ప్రాణాలు పణంగా పెట్టి అమరులైన 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల త్యాగాన్ని ఈ పురోహితుడు ఆకొండి పవన్ వేలాది మంది విద్యార్ధులకు వివరించారు. ఈ పనిని ఆకొండి పవన్ చేయనవసరం లేదు. అంతే కాదు… దేశభక్తి గురించి పదే పదే.. అదే అదే చెబుతున్న సంస్ధలు చేయాల్సిన పని. కానీ, ఆకొండి గోపాలకృష్ణమూర్తి గారి పెద్దబ్బాయి ఆకొండి పవన్ చేశారు. ఇక్కడ ఆకొండి గోపాలకృష్ణమూర్తి గారి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తన తనయుడు ఆకొండి పవన్‌లో ఈ దేశభక్తి నారు పోసింది ఆయనే కాబట్టి. తండ్రి నారు పోస్తే తనయుడు ఈ బైక్ జర్నీ పేరుతో నీరు పోస్తూ దేశ యువతను సన్మార్గం పట్టేలా చేస్తున్నారు. ఇంతకీ ఈ జర్నీకి పవన్ పెట్టిన పేరు ” I Stand For Nation- Tribute to Indian Army”. ఈ బైక్ జర్నీ ఎంత స్ఫూర్తి నింపిందంటే దాడి జరిగిన ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు పదహారు వేల మంది విద్యార్ధులు వారి వారి పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ గీతాన్ని ఆలపించారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ ఈ పురోహితుడు ఆకొండి పవన్ నాటిన దేశభక్తి విత్తనానికి వేలాది యువతరం We Stand For the Nation” అని నినదించింది.
మా మాతామహులు కొడమర్తి సర్వేశ్వర శాస్త్రిగారు కాలి నడకన కాశీ వెళ్లారని, అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే తాను పుట్టానని మా అమ్మ చెప్పేది. అందుకే మా అమ్మ పేరు అన్నపూర్ణ అని పెట్టారని కూడా నా తల్లే నాకు చెప్పింది. ఈ కాలి నడక ప్రయాణంలో సౌకర్యలేమి ఉంది. కొండకచో ఒకింత భక్తి ఉంది. ఈనాటి ఆధునిక వ్యవస్ధలో ఉదయాన్నే కాశీ వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకునే సౌకర్యం ఉంది. “i don’t have a time” అని కాసింత గర్వాన్ని ఒలకబోసే అవకాశం ఉంది. కానీ, ఆకొండి పవన్ ఈ కాశీ వెళ్లేందుకు బైక్ జర్నీని ఎందుకు ఎంచుకున్నారు. ఎందుకంటే దీని వెనుక ఓ లక్ష్యం ఉంది. ఓ మానవీయ కోణం ఉంది. మనుషుల పట్ల ప్రేమ ఉంది. ఆ లక్ష్యమే మానవ అక్రమ రవాణా నివారణ. కాశీ బైక్ జర్నీ వెనుక ఉన్నది భక్తే. కాకపోతే అది మానవుల పట్ల ఆకొండి పవన్‌కి ఉన్న మానవ భక్తి. తన స్వస్థలం అమలాపురం నుంచి వేలాది కిలోమీటర్లు, రోజుల తరబడి ప్రయాణించి ఈ మానవ అక్రమ రవాణా జరుగుతున్న తీరు, దాన్ని నిలువరించాల్సిన, నివారించాల్సిన అవసరాన్ని తనకు ఎదురైన ప్రతి పల్లె, పట్టణ, నగరాల్లో వివరించారు ఆకొండి పవన్. ఆయన కాశీ వెళ్లి చెంబుడు గంగ తీర్ధం తీసుకురాలేదు. మానవుల పట్ల గుండెడు ప్రేమను తీసుకొచ్చారు. దాన్నే అందరికీ పంచారు. ఆకొండి వారబ్బాయి పవన్ అన్నట్లు “ఈ బైక్ రైడ్ ఓ హాబీ మాత్రమే కాదు. ఒక సాధన. ఒక తపస్సు”. ఈ ప్రయాణంలో పవన్‌కి రోడ్లు కాదు కనిపించింది… మనుషులు మనస్సులు.
- ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్ — ‘చక్రవాకం’ నుంచి — విశాలాంధ్ర సౌజన్యంతో
( ఆదివారం నాడు అమలాపురంలో ఆకొండి పవన్ కుమార్ రాసిన “ది రైడ్” పుస్తక ఆవిష్కరణ సందర్భంగా…)





