
“హాయ్ మమ్మీ.. హౌ ఆర్ యూ. హ్యాపీ టెల్గు డే!” సరస్వతీ విద్యా నికేతన్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న బబ్లూ స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే వాళ్ల అమ్మకి శుభాకాంక్షలు చెప్పాడు.
“అదేంటిరా బబ్లూ నువ్వు ఆడిన మాటల్లో ఒక్క తెలుగు మాట కూడా లేదు. ఇదేం తెలుగురా నాయనా” కుర్చీలో కూర్చుని టీవీలో రేకులపొద ధారావాహిక చూస్తున్న నానమ్మ వర్ధనమ్మ అడిగింది.
“నువ్వుండవే అమ్మా..! వాడెంతో చక్కగా గ్రీటింగ్స్ చెబుతున్నాడో చూడక తెలుగు వెలుగు అంటావు” అంటూ బబ్లూ దగ్గరకి వచ్చి “థాంక్యూ బేబీ” అంటూ వాడి నుదిట మీద ముద్దు పెట్టుకుంది గాయత్రి.
“మమ్మీ వేర్ ఈజ్ డాడీ. నే స్కూల్ నుంచి వచ్చే సమయానికి ప్రతి రోజూ డాడీ నాట్ ఇన్ హౌస్. వెరీ బ్యాడ్ డాడీ” కాస్త కోపంగా అన్నాడు బబ్లూ.
వాడి తెలిగింగ్లీషు మాటలకు మురిసిపోతూ “డాడీకి ఈ రోజు మీటింగ్ ఉందమ్మా. ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కదా..! అక్కడ మీ డాడీ చీఫ్ గెస్ట్. నువ్వు బాత్ చేసి వస్తే మిల్క్ ఇస్తా. తాగేసి వీడియో గేమ్స్ ఆడుకో. ఈలోగా డాడీ ఈజ్ కమింగ్” అంటూ కొడుకు భుజాన ఉన్న పుస్తకాల సంచీని తీసుకుంది గాయత్రి.
“నా శార్ధ్రంలా ఉంది. తండ్రేమో తెలుగు సభలకు వెళ్లడం. ఇక్కడ తల్లీ, కొడుకు తెలుగు భాషని చంపేయడం” అని మనసులోనే అనుకుంది వర్ధనమ్మ.
* * *
గురజాడ సాంస్కృతిక కేంద్రం దగ్గర హడావుడిగా ఉంది. ప్రధాన ద్వారం నుంచి లోపలి వరకూ పూల తోరణాలతో అలంకరించారు. గురజాడ, గిడుగు రామ్మూర్తి పంతులు, శ్రీశ్రీ విగ్రహాలు శుభ్రంగా కడిగి వాటి చుట్టూ చామంతులు, గులాబీ దండలతో అలంకరించారు. మూడు విగ్రహాలకి పక్కనే మూడు పళ్లాల్లో పూల దండలున్నాయి. వాటితో పాటు కాసిన్ని విడి పూలు కూడా ఉంచారు.
గురజాడ సాంస్కృతిక కేంద్రం ప్రధాన ద్వారం పైన “తెలుగు భాషాదినోత్సవ వేడుకలు” అని, దాని కింద ” ALL ARE WELCOME” అని ఇంగ్లీషులో రాసిన తోరణం ఉంది. దాని కింద ఓ మూలగా “మహాకవి సాంస్కృతిక సంస్ధ” అని ఉంది. అంటే ఈ సభను నిర్వహిస్తున్నది ఆ సంస్థ వాళ్లే అని అందరికీ అర్థం కావడం కోసం చేసిన ఏర్పాటు అది.
నిర్వాహకులు అందరూ తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి పంచ, లాల్చీ, భుజం మీద కండువాతో అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు.
అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. అలా వస్తున్న వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్తున్నారు.
ఓ వంద మంది వచ్చాక సభను ప్రారంభించాలనుకున్నారు నిర్వాహకులు. కానీ వాళ్ల అంచనాలు మారాయి. పది గంటలకి సభ అంటే పావు తక్కువ పది గంటలకే ఓ ఎనభై మంది వచ్చారు. ఇంకా వచ్చే వారు ఉన్నారు అని మనసులో అనుకుని వేదిక మీదకు వెళ్లారు నిర్వాహకుల్లో ఒకరు.
“మహాకవి సాంస్కృతిక సంస్థ తరఫున అందరికీ ఆహ్వానం” అంటూ ఆహ్వానం పలికాడు ఓ నడీడు మనిషి. అనంతరం “ఈ రోజు సుదినం. తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. ముందుగా సభ నిర్వహించి అనంతరం కవి సమ్మేళనం నిర్వహించాలనుకున్నాం. అయితే కొత్తగా కవిత్వం రాస్తున్న వారు ఎక్కువ మంది రావడం. ముఖ్య అతిథులు వేరే కార్యక్రమానికి వెళ్లాలని ముందే చెప్పడంతో కార్యక్రమంలో చిన్న ఛేంజ్. అంటే First We Conduct కవి సమ్మేళనం. Next Meeting” అంటూ…
“కవి సమ్మేళనాన్ని ముఖ్య అతిథి, ఇటీవలే కవి కిశోర బిరుదు పొందిన మాన్య కవితశ్రీ గారు తన కవితతో ప్రారంభిస్తారు. కవి కిశోర కవితశ్రీ గారిని డయాస్‌పైకి వెల్కమ్ చేస్తున్నా అని ఆయన కిందకి వచ్చేసారు.
అలా పిలుపు వచ్చిన వెంటనే ముందు వరుసలో కూర్చున్న కవి కిశోర కవితశ్రీ గారు మెల్లిగా లేచి తన లాల్చీని సవరించుకుంటూ చేతిలో కాగితాల కట్టలతో వేదిక ఎక్కారు.
సభా ప్రాంగణంలో ఉన్న వారందరికి నమస్కరించిన కవితశ్రీ గారు గొంతు సవరించుకుని “ఈ రోజు తెలుగు భాషకి ఎంతో సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులుగారి బర్త్ డే. ఈమధ్యనే.. ఈ సభ కోసమే రాసిన కవిత వినిపిస్తా..” అలా అయన అనగానే సభంతా చప్పట్లు.
మైకును తన నోటికి అందేట్లుగా చేసుకున్న కవితశ్రీ కవిత చదవడం ప్రారంభించారు.
“గిడుగు… తెలుగు భాషకి చక్కని గొడుగు” అని చదివి.. ఓ క్షణం ఆపి
“ఐ మీన్ గిడుగు ఈజ్ అంబరిల్లా ఆఫ్ టెల్గు” అంటూ ప్రేక్షకుల వైపు చూసారు. ఓ పది మంది తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోలేదు. అయినా కవితశ్రీ నిరాశ చెందలేదు.
మళ్లీ చదవడం ప్రారంభించారు….
“వ్యవహారిక భాష కోసం ఆయనే వేసారు తొలి అడుగు” అని చదివారు. అంటే.. ఐ మీన్ ఫస్ట్ స్టెప్ అన్నమాట అన్నారు.
మళ్లీ తర్వాత లైను… “గ్రాంథిక భాష నెత్తిపై గిడుగు వేసారు పిడుగు”… అని మళ్లీ కాసేపు ఆగి… గిడుగు రామ్మూర్తి పంతులు గారు “Thunderbolt” అన్నమాట అన్నారు కవితశ్రీ.
సభలో వెనుక లైనుల్లో ఏదో కలకలం ప్రారంభమైంది. కవితశ్రీ గారికి ఏదో అనుమానం వచ్చి సభాప్రాంగణంలో ఉన్న తలుపుల వైపు చూసారు. ప్రేక్షకుల్లో చాలా మంది లేచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు.
సరిగ్గా అప్పుడే కవితశ్రీ గారి చరవాణికి ఓ సందేశం వచ్చింది. ముందు అది చూసి ఆ తర్వాత మిగిలిన కవిత చదువుదామని సందేశం చూసారు. అందులో ఇలా ఉంది…
“డాడీ కమ్ టు హోం ఇమ్మీడియట్లీ. గ్రాండ్ మా ఫైర్ ఆన్ యువర్ టెల్గు” అని ఉంది.
అప్పుడు గుర్తొచ్చింది కవితశ్రీ గారికి ఈ కార్యక్రమం మహాకవి సాంస్కృతిక సంస్థ వారు ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తామని చెప్పిన మాట.
అంతే.. చేతులెత్తి అందరికీ దండం పెట్టి వేదిక దిగి ఇంటి దారి పట్టారు కవితశ్రీ గారు.
– ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్టు. 99120 19929
**విశాలాంధ్ర దినపత్రిక ‘చక్రవాకం’ సౌజన్యంతో**







