తల్లీ… నిను దలంచి…

పాటైతే పరవశిస్తాం. దేవగానమైతే ఓ ప్రపంచానికి రెప్ప మూసి.. మరో ప్రపంచానికి రెక్క విప్పుతాం. దైవారాధనను వ్యతిరేకిస్తాం కానీ… భజ గోవిందం… భజ గోవిందం… గోవిందం భజ మూఢమతే అని తెల తెలవారుతూండగా చెవుల్లో అమృతం బొట్లు బొట్లుగా రాలుతున్న వేళ కళ్లు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుంటూ ఆ తల్లిని స్మరించుకుంటాం. మూడు దశాబ్దాల క్రితం ఆ సికింద్రాబాద్‌ హరిహరా కళాభవన్‌లో దేవగానాన్ని ప్రత్యక్షంగా వింటూ వృత్తిలో భాగంగా వార్త రాసివ్వాలన్నా ధ్యాస కూడా లేకుండా పెరేడ్‌ గ్రౌండ్‌లో మగతగా దొర్లాం. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి. నూట పదేళ్ల క్రితం నూట పది కోట్ల మంది ఏ కొంచెమో చేసుకున్న పుణ్యఫలం ఆ జననం.
హెలెన్‌ కెల్లర్‌ తెలుసు కదా.. అమెరికాలో హక్కుల కార్యకర్త. పుట్టు గుడ్డి. పుట్టు చెవుడు. ఓసారి భారతదేశానికి వచ్చినప్పుడు సుబ్బులక్ష్మి కచేరీకి వెళ్లారు. వినపడని.. కనపడని హెలెన్‌ కెల్లర్‌ సుబ్బులక్ష్మి గాత్రానికి పరవశించిపోయారు. ఎలా అంటే ఎం.ఎస్‌ గాత్రాన్ని ఆమె తన కుడిచేతి వేళ్లతో విన్నారు. సుబ్బులక్ష్మి కచేరి ప్రారంభం కాగానే కెల్లర్‌ తన కుడి చేతి వేళ్లని గొంతు దగ్గర పెట్టుకుని ఆ తరంగాలను బట్టి ఎం.ఎస్‌ గాత్రాన్ని ఊహించుకున్నారు. కచేరి అనంతరం హెలెన్‌ కెల్లర్‌ “మీరు పాడే దేవత” అన్నారు సుబ్బులక్ష్మితో.
పాటంటే పెదవుల మీంచి వచ్చే చప్పుడు కాదు… పాటంటే చెకుముకి రాళ్లు చేతులెత్తి చప్పట్లు కొట్టడం. పాటంటే గొంతు ముడి విప్పి గానామృతాన్ని చిలకరించడం.
ఇప్పుడెందుకు ఆ సుబ్బులక్ష్మిని తలచుకోవడం? ఇప్పుడెందుకు ఆ సుబ్బులక్ష్మిని స్మరించుకోవడం? ఎందుకంటే రెండు రోజుల క్రితమే ఆ తల్లికి నూట పదేళ్లు వచ్చాయని దేశమంతటా సంబరాలు జరుపుకుంటోంది కాబట్టి. జీవ ధర్మాన్ని అనుసరించి ఆ తల్లి వెళ్లిపోయారు కానీ సూర్యుడితో పాటే ప్రతి ఉదయం మనల్ని తన గాత్రంతో నిద్ర లేపుతారు కాబట్టి. దేవదాసి కులంలో పుట్టిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మనల్ని ఆ దేవత దాసులుగా చేసుకుందుకు కాబట్టి. “విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం..
పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్‌..” ఈ సుభాషితం పుట్టింది బహుశా ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి వంటి వారి కోసమేనేమో అనిపిస్తుంది. విద్య వల్ల సుబ్బులక్ష్మి వినయాన్ని సంపాదించుకున్నారు. ఆ వినయమే ఆమెకు అనేకానేక అవకాశాలు వచ్చేలా చేసింది. తన కచేరీల ద్వారా వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా ఆ తల్లి ఇంటికి తీసుకువెళ్లే వారు కాదు. కచేరి జరిగిన ఊరులోనే ఏ అనాథ శరణాలయానికో… లేదూ ఏ వృద్ధాశ్రమానికో… విరాళంగా ఇచ్చేసి తన గాత్రంతోనే ఇంటికి మరలిపోయే వారు.
దేశం గర్వించే భారతరత్న ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి ఆర్థికంగా చాలా దారుణమైన స్థితిలో ఉన్నారని వింటే తట్టుకోగలమా…! కానీ సుబ్బులక్ష్మి ఆ కటిక దరిద్రాన్ని అనుభవించారు. ఆ విషయం తెలుసుకున్న కంచి కామకోటి పీఠాధిపతే స్వయంగా ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారి పి.వీ.ఆర్‌.కే. ప్రసాద్‌కి చెప్పి అన్నమాచార్య కీర్తనలు ఆలపించేలా చేశారు. ఆ రూపంలో వచ్చిన ఆర్థిక సాయమే కొన్నాళ్ల పాటు ఆ కుటుంబాన్ని ఆదుకుంది.
ఐక్యరాజ్య సమితిని తన గాత్రంతో పావనం చేసిన తొట్ట తొలి భారతీయ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.
భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎదుట ఆ తల్లి తన గానం వినిపిస్తే “నేను ఈ దేశానికే ప్రధానిని. మీరు సంగీత సామ్రాజ్యానికే రాణి. మీరు సంగీత సామ్రాజ్ఞి” అన్నారు. మహా విధ్వాంసులు చెంబై వైద్యనాథ్‌ భాగవతార్‌, మహరాజపురం సంతానం వంటి వారి కచేరీలకు వెళ్లి తొలి వరుసలు కూర్చుని తాళం వేస్తూ ఆ గానాలను ఆస్వాదించిన సుబ్బులక్ష్మి ఆ తర్వాత కాలంలో ఆ విద్వాంసులకే అభిమాన గాయనీమణిగా మారారు. ఆమె గాత్రానికి వారు దాసోహమన్నారు. తల్లీ నిను దలంచి… అంటూ ఇప్పటికీ తెలవారుతోందంటే సుబ్బులక్ష్మి పుట్టుక దైవ పుట్టుక కాక ఇంకేమనుకుంటాం…!

  • ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, 99120 19929
  • *** విశాలాంధ్ర దినపత్రిక (19-09-2026) ‘చక్రవాకం’ నుంచి
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *