మేము సైతం..

సరదాకి **
***
బొద్దింకల రాజ్యంలో జనతా కాక్రోచ్ పార్టీ పేరుతో బొద్దింకల పార్టీ ఒకటి అవతరించిందని ఇదివరకే చెప్పుకున్నాం కదా! ఆ పార్టీ నాయకుడు
కొలువు తీరి(గ్గా) కూర్చుని సహచర సలహాదారులు, బొద్దింకలతో ముచ్చట్లు పెట్టుకున్నాడు. మాటల్లో బొద్దింకలు, పుస్తకాల రుచి ప్రస్తావన వచ్చింది.
“మేం ఈమధ్య చాలా పుస్తకాలకు పట్టుకున్నాం నాయకా.. వాటి వల్ల మాకు కూడా కాస్తో కూస్తో కవిత్వం అబ్బింది” అని కొన్ని బొద్దింకలు విన్నవించాయి. “అవును నాయకా, మానవ లోకంలో మానవ బొద్దింకల నిరసనలకి తలొగ్గి పదవికి రాజీనామా చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద నేనో పద్యం రాశాను కూడా” చెప్పిందో యువ బొద్దింక.
” ఆ పద్యమేదో చెప్పరా చిట్టి బొద్దింకా!” అన్నాడు నాయకుడు.
యువ బొద్దింక మీసాలతో ఓసారి మూతి తుడుచుకుని మొదలుపెట్టింది. “ధర్మేంద్రుడ నాకేమని బొద్దింకలతో కయ్యమాడి పలుకుట మేలా? బలవంతుడైన కేంద్ర మంత్రి బొద్దింకల చేత చిక్కి పదవిని దిగలేదా?” పద్యం ఆపి సగర్వంగా చుట్టూ చూసింది. మహారాజు, మిగతా బొద్దింకలు రెక్కల టపటపలాడిస్తూ చప్పట్లు కొట్టాయి.
“హయ్యో, మన బొద్దింకల్లో ఇంత టాలెంటు ఉందని నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయాను. నా అజ్ఞానానికి అందరూ క్షమించాలి” అంటూ నాయకుడు కాసేపు పశ్చాత్తాప పడి, లేచి “త్వరలో మనం కవి సమ్మేళనాలు, సాహిత్య కార్యశాలల వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుందాం. బొద్దింకల సాహిత్యాన్ని ప్రోత్సహించుకుందాం” అని ప్రకటించి కళ్లు తుడుచుకున్నాడు.
ఇంతలో జుంయ్ మని రొదలాగా వినిపించింది. అందరూ తలలెత్తి చూశారు. ఓ బొద్దింక రెక్కలూపుకుంటూ ఎగురుకుంటూ వచ్చేస్తోంది.
“అది మన వేగు బొద్దింక. ఏదో కబురు మోసుకొస్తోంది” అన్నాడు నాయకుడు. వేగు బొద్దింక ఎగురుకుంటూ వచ్చి అందరి సమక్షంలో ల్యాండ్ అయింది. ” బ్యూటిఫుల్ బెల్లీ ల్యాండింగ్” అని నాయకుడు మెచ్చుకున్నాడు.
” జయం జయం నాయకా, మీకో వార్త తీసుకువచ్చాను” అంది వేగు బొద్దింక ఆయాసపడుతూ. “చెప్పు బంగారం” అన్నాడు నాయకుడు.
“మానవలోకంలో కాక్రోచ్ జనతా పార్టీ వారు మళ్లీ ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. ఈసారి చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలని వాళ్ల డిమాండ్” చెప్పింది వేగు బొద్దింక.
“కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఆ పార్టీ స్ఫూర్తితోనే మన జనతా కాక్రోచ్ పార్టీ అవతరించింది” అంటూ బొద్దింక నాయకుడు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
” అవును నాయకా.. మన పార్టీ ఏర్పాటుకి కారణమైన ఆ పార్టీ పట్ల కృతజ్ఞతాసూచకంగా వారి ఉద్యమానికి మనం కూడా మద్దతు ఇస్తే బావుంటుంది” అని సూచించాడు ఓ సలహాదారుడు. “అవునవును” అంటూ మిగతా బొద్దింకలు రెక్కలు టపటపలాడించాయి.
“మద్దతు ఇద్దాం సరే, ఏ రకంగా ఇద్దామంటారు?” అడిగాడు బొద్దింక నాయకుడు.
“మనం కూడా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఊరేగింపుగా వెళదాం” అని సూచించాడు మరో సలదారుడు. “అవునవును” అంటూ మిగతా బొద్దింకలు రెక్కలు టపటపలాడించాయి.
“బలే బలే బలే…ఎంచక్కా నేను రీల్సు కూడా చేసుకోవచ్చు” అని గెంతులు వేసిందో పిల్ల బొద్దింక.
“ఛప్, నోర్ముయ్..ఉద్యమం అనేది రీల్సు కోసం కాదే శుంఠా!” అంటూ కసిరాడు నాయకుడు. పిల్ల బొద్దింక అర్జెంటుగా తల్లి బొద్దింక వెనక్కి పోయి దాక్కుంది.
” ఉద్యమం చెయ్యడానికి కొంతమంది విమానం ఎక్కి వెళ్తుండడాన్ని నేను వీడియోలో చూశాను. మనం కూడా అలా విమానం బుక్ చేసుకుని వెళ్దామా?” సరదా పడింది మరో పిల్ల బొద్దింక.
“విమానం బుక్ చేసుకుని వెళ్లడానికి మనమేం అంత డబ్బుతో బలిసిపోయిలేం. నీకంతగా విమాన ప్రయాణం చెయ్యాలని సరదాగా ఉంటే విమానం టాయిలెట్ లోనో, కార్గోలోనో దూరిపోయి వెళ్లు” మళ్లీ కసిరాడు నాయకుడు. దాంతో ఆ పిల్ల బొద్దింక కూడా వాళ్లమ్మ వెనక్కి పోయి దాక్కుంది.
“ఒక ముఖ్య విషయం..” అంటూ ఆగాడు నాయకుడు. అన్ని బొద్దింకలు నిశ్శబ్దం పాటిస్తూ నాయకుడి వైపు ఆసక్తిగా చూశాయి.
నాయకుడు చెప్పడం మొదలుపెట్టాడు. “నేనీ మధ్య ఇదే అంశం మీద కొన్ని మానవ బొద్దింకలు చేసిన ఉద్యమం వీడియోలు చూశాను. అందులో కొందరు ఆడవాళ్లు ఒళ్లు కనిపించేలా పీలికల బట్టలు వేసుకుని ఇంటర్ వ్యూలు ఇచ్చారు. మరి కొందరు ఆడవాళ్లు సగం బట్టలు వేసుకుని ఏవో పబ్బుల్లో డాన్సులు చేసినట్టు నడి రోడ్డు మీద గెంతుతున్నారు. ఉద్యమం పేరుతో వాళ్లు ఇలా చేస్తుంటే జనం దృష్టి వాళ్ల ఉద్యమం మీద ఉంటుందా, వాళ్లు వేస్తున్న వెధవ్వేషాల మీద ఉంటుందా అని నాకు సందేహం వచ్చింది. అందుకని నేనేమంటానంటే, మనం చేసే ఉద్యమం అలా ఉండకూడదంటాను. నలుగురిలో మనం వాళ్లలాగా చులకన కావద్దు”
“అయితే ఏం చేద్దామంటారు నాయకా?” అడిగాయి చుట్టూ ఉన్న బొద్దింకలు.
బొద్దింకల నాయకుడు ఆలోచించి చెప్పాడు.
” అందరిలాగానే మనల్ని కూడా బట్టలు లేకుండానే పుట్టించాడు ఆ దేవుడు. మన లోకంలో మనం బట్టలు లేకుండా తిరగడానికి అలవాటు పడ్డాం. కానీ, ఇప్పుడు మానవలోకంలోకి ధర్నా చెయ్యడానికి వెళ్లినప్పుడు మాత్రం అందరం బట్టలు వేసుకుని వెళ్దాం. మనల్ని చూసయినా ఆ అర్ధ నగ్న మానవ బొద్దింకలకి సిగ్గు రావాలి”
“మంచి ఆలోచన..అలాగే చేద్దాం నాయకా!” అంటూ బొద్దింకలు రెక్కలు టపటపలాడించాయి.
“మానవలోకంలో కూడా ఆడా, మగా మనుషులు ఇళ్లలో నైటీలు, నిక్కర్లతో తిరుగుతారు. కొంతమంది మగాళ్లు బనీన్లు కూడా వేసుకోరు. కానీ, వీధిలోకి వచ్చేటప్పుడు మాత్రం అంగ ప్రదర్శన చెయ్యకుండా పద్ధతిగా, ఒంటి నిండా బట్టలతోనే వస్తారు. ఉద్యమాలు చేసినా అలాగే పద్ధతిగా చేస్తారు. అటువంటి వాళ్లే మనకి ఆదర్శం కావాలి. ఉద్యమాల్లో ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా వెర్రి మొర్రి గంతులు వేసే సైకో బొద్దింకలు మనకి ఆదర్శం కూడదు. గాంధీ మార్గంలోనే మనం ఉద్యమం చెయ్యాలి. గాంధీజీకి జై!” అన్నాడు బొద్దింకల నాయకుడు.
బొద్దింకలన్నీ రెక్కలు ఆడిస్తూ హర్షధ్వానాలు చేశాయి.
“అమ్మా, అమ్మా..నేను ఒంటి నిండా బట్టలు వేసుకోనే.. నాకు ఉక్క పోస్తుందే.. కావాలంటే పైనో పీలిక, కిందో పీలిక కట్టుకుంటానే..” గునిసింది ఓ పిల్ల బొద్దింక.
బొద్దింక వాళ్లమ్మ కళ్లెర్ర చేసింది. “వెధవకానా, మా బొద్దింకల కడుపున చెడబుట్టావే..అట్టే మాట్లాడితే నీ కాళ్లన్నీ విరిచేసి, రెక్కలు తెంపేసి పొయ్యిలోకి తోసేస్తా, జాగ్రత్త! గాంధీ మార్గంలో ఉద్యమం అంటే శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలని అర్ధం. అంతే తప్ప గాంధీ గారిలా సగం సగం బట్టలు వేసుకోవాలని కాదు” అంటూ చెడామడా పిల్ల బొద్దింకని తిట్టిపోసింది.
“మహాత్మా గాంధీకీ జై.. జనతా కాక్రోచ్ పార్టీ జయహో!” అని బొద్దింకలు నినాదాలు చేశాయి.
— మంగు రాజగోపాల్
(లీడర్ దినపత్రిక 08-10-26 సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *