శ్రీవారి సన్నిధిలో జ్ఞానదీపాలు వెలిగించిన భక్తుల ఉత్సవాలు

తిరుమలలో మనకు తెలియని ఉత్సవాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటి విషయాలను గమనిస్తే ఎంతో నిజైహో నిఘాఢమైన భక్తి రహస్యం దాగి ఉందని అర్ధం అవుతుంది. కలియుగం కంటే ముందు జన్మించిన ముగ్గురు ఆళ్వారుల జయంతి ఈ నెలలోనే వరుసగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి వారు రచించిన కీర్తనలను శ్రీవారి ముందు ఆలపిస్తారు. ఇంతకు వారు ఏ కీర్తనలు రాశారు అర్థం ఏమిటన్నది తెలుసుకుంటే…భగవంతుని దర్శించవచ్చు. భక్తులకు భగవంతుని గురించి తెలియజేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ మొదటి ఆళ్వార్‌ల జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు.
మొదటి ముగ్గురు ఆళ్వారులను ముదలాళ్వారులు అని పిలుస్తారు. వీరు ముగ్గురూ ద్వాపర యుగంలో, సిద్ధార్థి నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం (తమిళంలో ఐప్పసి మాసం) లో వరుసగా మూడు రోజుల్లో వేర్వేరు నక్షత్రాలలో అవతరించారు. ఆళ్వారులు అయోనిజులు. వీరు భక్తిని లోకానికి చాటడానికి తిరుక్కోవలూర్ అనే దివ్యదేశంలో ఒకరినొకరు కలుసుకున్నారు. పోయ్గై ఆళ్వార్, పుదత్త ఆళ్వార్ ఇరువురు తిరుకడల్మల్లై అంటే నేటి మహాబలిపురంలో జన్మించగా పేయ ఆళ్వార్ మయిలాపూర్ చెన్నైలో ఉద్భవించారు.
వీరి భక్తిని లోకానికి చాటడానికి శ్రీమన్నారాయణుడు ఒక లీలను సృష్టించాడు. ఈ విషయంలో విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ముగ్గురు కలయిక ఎలాజరిగిందన్నదాన్ని ఉహాజనితమైన వైభవం సాక్షాత్కారింపజేసారు. వీరి భక్తి వాసనలు ఓకేరకంగా పరిఢవిల్లాయి. ఈ గుణానుభవంపై ప్రచారంలో ఉన్న కథనం ఇలా ఉంది. ప్రాపంచిక బంధాలకు దూరంగా, కేవలం భగవత్ చింతనలోనే ఊళ్లు తిరుగుతూ ఒకసారి వర్షం కురుస్తున్న రాత్రి వేళ తిరుక్కోవలూర్ (తమిళనాడు) అనే దివ్యదేశంలోని ఒక చిన్న ఇంటి రేకుల అరుగు వద్దకు చేరుకున్నారు.
మొదట పొయిగై ఆళ్వార్ వచ్చి ఆ అరుగు మీద పడుకున్నారు. ఇంతలో భూదత్తాళ్వార్ అక్కడికి రాగా, పొయిగై ఆళ్వార్ “ఇక్కడ ఒకరు పడుకోవడానికి, ఇద్దరు కూర్చోవడానికి చోటుంది’ అంటూ లేచి కూర్చున్నారు. కొద్దిసేపటికి పేయాళ్వార్ కూడా అక్కడికి రాగా, మిగిలిన ఇద్దరూ ముగ్గురు నిలబడటానికి వీలుంది అని నిలుచున్నారు, చీకటి దానికి తోడు వర్షంలో ఆ ముగ్గురి మధ్య మరొకరు వచ్చి గట్టిగా నొక్కుతున్నట్లు అనిపించింది. ఆ నాలుగవ వ్యక్తి ఎవరో కాదు, తన భక్తుల కలయికను చూసి మురిసిపోయి వచ్చిన సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు. ఈ సమయం వారిలో వెలిగిన జ్ఞాన జ్యోతివల్ల నాలాయిర దివ్య ప్రబంధానికి నాంది అయింది. పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్ తమ భక్తితో రెండు అద్భుతమైన జ్ఞాన దీపాలను వెలిగించి చూసి వచ్చిన భగవంతుని దర్శించారు. పొయిగై ఆళ్వార్ ప్రకృతిని దీపంగా చేసారు. వారిమాటల్లో “వైయామ్ తగళియా వార్ కడలే నెయ్యగా…” అంటే, ఈ భూమండలాన్నే ప్రమిదగా, సముద్రాన్ని నెయ్యిగా, సూర్యుడిని దీపంగా చేసి భగవంతునికి సమర్పించారు. ఇదే ‘ముదల్ తిరువందాది’ భూదత్తాళ్వార్ అంతఃకరణాన్ని దీపంగా చేసారు. అన్బే తగళియా ఆర్వమే నెయ్యగా…” అంటే, తన భక్తినే ప్రమిదగా, భగవంతునిపై గల ఆరాటాన్ని (ప్రేమను) నెయ్యిగా, తన మనస్సునే వత్తిగా చేసి జ్ఞానదీపాన్ని వెలిగించారు. ఇదే ‘ఇరండ్రమ్ తిరువందాది’ ఆ భక్తి దీపాల వెలుగులో పేయాళ్వార్‌కు సాక్షాత్ లక్ష్మీనారాయణుల దివ్య మంగళ స్వరూపం సాక్షాత్కరించింది. పరమానందంతో ఆయన “తిరుక్కండేన్ పొన్మేని కండేన్…” నేను లక్ష్మీదేవిని చూశాను, ఆ బంగారుమయమైన భగవంతుని రూపాన్ని చూశాను అంటూ మైమరచి పాడారు. ఇదే ‘మూన్రామ్ తిరువందాది’. ఈ ముగ్గురు ఆళ్వారులు చెరి వంద పాశురాల (పద్యాల) చొప్పున మొత్తం 300 పాశురాలను ఆశువుగా పాడి, సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన “నాలాయిర దివ్య ప్రబంధం” (నాలుగు వేల దివ్య ప్రబంధం) ఆవిర్భావానికి మూలకారకులయ్యారు. భగవంతుడిని కేవలం జ్ఞాన వైరాగ్యాలతోనే కాకుండా, పరమ భక్తితో సులభంగా చేరుకోవచ్చని నిరూపించిన మహానుభావులు ముదలాళ్వారులు.
-వొద్దిపర్తి రామచంద్ర మూర్తి (సీనియర్ జర్నలిస్టు)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *