నేనే రాజు…నాదే ప్రైజు!

సరదాకి….
***
“ఎవరి కోసం, ఎవరి కోసం..ఈ శ్వేత మందిరం, ఈ శూన్య నందనం.. ఈ భగ్న హృదయం, ఈ అగ్ని గుండం..ఎవరి కోసం, ఎవరి కోసం..”
వైట్ హవుస్ లో ప్రెసిడెంట్ ట్రంపు గొంతు చించుకుని పాడుతున్నాడు. అశాంతిగా పచార్లు చేస్తున్నాడు. మధ్య మధ్యలో కల్లు తాగి, నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేస్తున్నాడు. ఆయనకి ఏమయిందో అర్ధం కాక వ్యక్తిగత సిబ్బంది వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కి కబురు పెట్టారు.
జేడీవాన్స్ తన అర్ధాంగి, మన ఆంధ్రా తెలుగు మూలాలు ఉన్న ఆడపడుచు ఉషా చిలుకూరి సమేతంగా కంగారుపడుతూ, ఆగమేఘాల మీద వచ్చేశాడు. “సారు పాడుతున్న పాట మీ భాషలాగా ఉందే.. నీకు అర్ధమయిందా?” అడిగాడు వాన్స్ వాళ్లావిడని. ఉషా చిలుకూరి విని “అవునండీ, ఇది మా తెలుగు సినిమా పాటే..కానీ ఎందుకు పాడుతున్నాడో అర్ధం కావడం లేదు” అని చెప్పింది.
ట్రంపు వీళ్ల వైపు విషాదంగా చూసి పాటని కంటిన్యూ చేశాడు.
“సమరాలను ఆపాను, శాంతి జపం చేశాను..సిగ్గు విడిచి, నోరు తెరిచి పీసు ప్రైజు అడిగాను.. మీకు ట్రంపంటే లెక్క లేదు.. ప్రైజు ఇచ్చేందుకు మనసు రాదు.. పరువు పోయి మిగిలాను, బ్రతుకు బరువు చేశారు..”
ఉషా చిలుకూరికి అంతా అర్ధమైంది. భర్త వైపు తిరిగి “అదండీ సంగతి.. ఈ ఏడాది కూడా తనకి నోబెల్ శాంతి బహుమతి రాలేదని అన్నయ్య గారు ఏడుపు పాటలు పాడుతున్నారు” అని చెప్పింది.
“అది సరే, సారుకి మీ తెలుగు పాటలు ఎలా వచ్చాయ్” అడిగాడు వాన్స్ కుతూహలంగా.
“ఆ మధ్య ఇరాన్ కాన్సులేట్ వాళ్లు బాహుబలి, భగవంత్ కేసరి తెలుగు సినిమాల క్లిప్పింగుల్ని మన మీద వదిలారు కదండీ.. వాటికి తెలుగు సినిమాలతోనే కౌంటరు ఇద్దామని అన్నయ్య గారు నన్ను అడిగారండీ.. నేను వెతికి ఇచ్చేలోపు అన్నయ్య గారు తెలుగు సినిమాలు వెతికేసి, తన సందర్భానికి తగ్గట్టు ఈ పాటని పట్టుకున్నారేమోనండీ” చెప్పిందా ఇల్లాలు.
భార్యాభర్తల ముచ్చట్లు ఇలా కొనసాగుతుంటే ట్రంపు అక్కడ ఒక కుర్చీలో కూలబడి, పాట ఆపేసి, కుమిలిపోతూ దుర్యోధన ఏకపాత్రాభినయం మొదలుపెట్టాడు.
” కడుపులో విస్కీ కదలకుండా కూర్చున్న నేనేల ఆ దేశాల జోలికి పోవలె? పోయితినిపో, వాటి మధ్య యుద్ధాలలో నేనేల తల దూర్చవలె? దూర్చితినిపో, పెద్ద పోటుగాడి వలే ఆ యుద్ధాలను నేనేల ఆపవలె? ఆపితినిపో, ఆ యుద్ధాలను నేనే ఆపేశానహో అని ప్రపంచమంతా నేనేల టముకు వేయవలె? వేసితినిపో, అందుకు ప్రతిఫలంగా నేనేల నోబెల్ శాంతి బహుమతిని ఆశించవలె? ఆశించితినిపో, నవ రంధ్రాలు మూసుకుని ఉండక ‘ఆ ప్రైజు నాకే రావాలీ, ఆ కీర్తీ నాకే దక్కాలీ’ అని పాడుకుంటూ పబ్లిగ్గా గప్పాలు ఏల కొట్టవలె? అగ్రరాజ్యాధినేతనయిన నన్నే పక్కన బెట్టి వేరొకరికి నోబెల్ శాంతి బహుమతిని కట్టబెట్టుటయా? హతవిధీ.. అవమానము, దుర్భర అవమానము”
ట్రంపుని చూస్తే వాన్స్ దంపతులకి జాలేసింది. వాన్స్ అతడి బుజం తడుతూ ధైర్యం చెప్పాడు. ” మీరే ఇలా అయిపోతే ఎలా సార్.. ఎప్పటికయినా నోబెల్ పీస్ ప్రైజు మీకు వచ్చి తీరుతుంది” అన్నాడు.
” మీకు పీస్ ప్రైజు రావాలంటే నా దగ్గర ఒక అయిడియా ఉంది. చెప్పమంటారా అన్నయ్య గారూ!” అడిగింది ఉషా చిలుకూరి.
ట్రంపు తలెత్తి ఆశగా చూశాడు. “చెప్పమ్మా, చెప్పు చెప్పు” అన్నాడు.
ఉషా చిలుకూరి గొంతు సవరించుకుని చెప్పడం మొదలు పెట్టింది. ” కొన్నేళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో వచ్చిన కేరక్టర్ కథ ఇది. అతడి పేరు బద్దం భాస్కర్.. ఓ సంపన్నుల ఇంట్లో మేనేజరుగా పని చేసేవాడు. వన్ ఫైన్ మార్నింగ్, ఆ ఇంట్లోంచి రెండు లక్షలు కొట్టేసి ఉగాండాకి చెక్కేశాడు. అక్కడ పదెకరాల పొలం కొని దున్నేడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకి వాడి దశ తిరిగిపోయింది. అయిదేళ్లలో దాదాపు యాభైవేల కోట్లు సంపాదించాడు.”
“వెరీ ఇంట్రస్టింగ్.. చెప్పు, చెప్పు” అన్నాడు ట్రంప్.
ఉషా చిలుకూరి మళ్లీ మొదలు పెట్టింది. ” ఈ బద్దం భాస్కర్ కి ఆస్కార్ అవార్డు అందుకోవాలని మహా కోరిగ్గా ఉండేది. ఆ అవార్డు చచ్చినా వాడికి రాదని తెలిసి వాడే భాస్కర్ అవార్డు అని ఓ పేరు పెట్టుకున్నాడు. అరవై డైమండ్లు అమ్మేసి, గ్లాడియేటర్ ఇన్ స్పిరేషన్ తో రేడియేటర్ అని సినిమా తీశాడు. ఆ సినిమాకి వాడే డైరెక్టరు, వాడే హీరో..ఇంకా దరిద్రం ఏమిటంటే, వాడే హీరోయిన్ కూడా. ముందు అనుకున్న ప్రకారం వాడి పేరుతో పెట్టిన అవార్డుని వాడి సినిమాకి వాడే ఇచ్చుకున్నాడు. మొత్తానికి ఆస్కార్ రాకపోయినా భాస్కర్ అవార్డు సాధించాడు”
“సూపర్..అందుకే మీ తెలుగువాళ్లంటే నాకు ఇష్టం. గట్టిగా అనుకుంటే చాలు, ఏదయినా, ఎలాగయినా సాధిస్తారు. ఇంతకీ నీ అయిడియా ఏమిటి?” అడిగాడు ట్రంపు.
“ఇంకా అర్ధం కాలేదా సారూ.. మా ఆవిడ అయిడియా ఇదే. మనం కూడా ఒక శాంతి బహుమతిని ఏర్పాటు చేసి, అది మీకే ప్రకటిస్తామన్నమాట” విడమర్చి చెప్పాడు వాన్స్.
“అవును అన్నయ్యగారూ.. నోబెల్ పీస్ ప్రైజ్ లాగా దీనికి మనం గ్లోబల్ పీస్ ప్రైజ్ అని పేరు పెడదాం.
నోబెల్ వాళ్లు మన లెక్కలో దాదాపు 12 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తారు. మనం అంతకు రెట్టింపు అంటే ఓ పాతిక లక్షలు డాలర్లు పీస్ ప్రైజ్ అవార్డు కింద ఇచ్చేద్దాం.. మీరు ఈ చేత్తో ఇస్తారు, ఆ చేత్తో పుచ్చుకుంటారు. మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది” నవ్వుతూ చెప్పింది ఉషా చిలుకూరి.
ఆ సన్నివేశాన్ని కలర్ ఫుల్ గా ఊహించుకునేసరికి ట్రంపు కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, నీ రుణం తప్పక తీర్చుకుంటనే చెల్లెమ్మా” అని పాడడం మొదలుపెట్టాడు.
— మంగు రాజగోపాల్
(లీడర్ దినపత్రిక 15-10-26 సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *