
మన నాగరికత చాలావరకు నదీ తీరాలలో ఉదయించింది దేశంలో గొప్ప నగరాలన్నీ నదులు వద్ద నడకలు నడిచాయి గంగా తీరాన వారణాసి పట్టణం విద్యా కేంద్రంగా ఆధ్యాత్మిక ధామంగా వికసించింది నదులు వ్యవసాయానికే కాదు సాంస్కృతిక పునర్జీవనానికి పునాదులు వేశాయి గోదావరి కృష్ణ పేరు చెప్పగానే తెలుగువారి మనసులు పులకరించి పోతాయి. కృష్ణమ్మ పేరు విన్నప్పుడు రచయితల కలాలు అందంగా స్పందించాయి. డాక్టర్ సినారే భావసంపద నాగార్జున సాగరంలో కనపడింది. కృష్ణవేణి చిత్రంలోని అన్ని పాటలలో కృష్ణమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరించారు ఎన్టీఆర్‌ని ఏఎన్ఆర్ని శోభన్ బాబుని వెండి ధరకి అపురూపంగా అందించింది. ఇక పత్రికా రంగం కన్నులు తెరిచింది అక్కడే . విజయవాడ నగరం నుంచి పలు పత్రికలు అక్షర వెలుగులని ప్రపంచానికి అందించడం విశేషం ఆకాశవాణి విజయవాడ కేంద్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇవన్నీ సాహిత్య వేదికలుగా ప్రతిధ్వనించాయి వేటూరి నుంచి ఇంద్రగంటి వారి వరకు ఇక్కడి వారే. కృష్ణా తీరం ఆధ్యాత్మిక సౌందర్య సీమ. ఇంద్రకీలాద్రి , మంగళగిరి, అమరావతి , వేదాద్రి, మోపిదేవి , బందరు పాండురంగడి గుడి భక్తులందరికీ కొంగు బంగారాలు. దసరా పర్వదినాల్లో కృష్ణాతీరం కొత్త కాంతులతో మురిసిపోతోంది. దేవీ నవరాత్రుల సంబరాలకి పసిడికాంతులలో కనకదుర్గ అందంగా ముస్తాబై లక్షలాది మందిని సాదరంగా ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది. అమ్మవారి దర్శనంతో పాటు ప్రజాదరణ కలిగిన నేతలు తరలిరావడం గొప్ప అనుభూతి. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ వేడుకలకి వచ్చారు . కృష్ణా తీరాన ఆధ్యాత్మికత ఒక్కటే కాకుండా విజయవాడ ఉత్సవం అట్టహాసంగా జరుగుతోంది పున్నమి ఘాట్ వద్ద మాకినేని ఆడిటోరియంలో సాంస్కృతిక సంబరాలన్నీ అద్భుతంగా పలకరిస్తున్నాయి. ప్రదర్శనలు లక్షలాదిమందికి సాయంకాల సమయాన ఒక గొప్ప జ్ఞాపకంగా మిగులుస్తున్నాయి ఈనెల 11 నుంచి 20వ తారీకు వరకు జరిగే పలు ప్రదర్శనలు మనసులో ఒక అనుభూతిగా, అద్భుత కావ్యంగా మిగిలిపోతాయి.
--- డాక్టర్ దువ్వూరి శర్మ , పరిశోధకులు, 99490 39175





