
సరదాకి…
**
అది ఏ జిల్లా అయినా కావచ్చు. ఆ జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువు, చోటా మోటా లీడర్లందరికీ పెద్ద తలకాయ్ అయిన పెద్దాయన ఆరుబయట కొలువు తీరి కూర్చున్నాడు. ఆయన గారి బంధు,బంధు,బంధు గణమంతా చుట్టూ మూగారు.
“ఒరే పెద్దోడా, చిన్నోడా” అంటూ కొడుకులిద్దర్నీ ఆప్యాంగా పిలిచాడు పెద్దాయన. కొడుకులిద్దరూ దగ్గరికి వచ్చారు.
“ఏరా, మనోళ్లందరూ వచ్చినట్టేనా? మామయ్యలూ, బాబాయిలూ, అన్నలూ, తమ్ముళ్లూ, బావలూ, అమ్మలూ, చిన్నమ్మలూ, పెద్దమ్మలూ, అక్కలూ, చెల్లెళ్లూ, అత్తలూ, వదినలూ..మొత్తం చుట్టాలందరూ ఏ ఒక్కరూ మిస్సవకుండా అందరూ వచ్చారు కదా?” అడిగాడు పెద్దాయన.
“వచ్చారు నాన్నగారూ..స్పెషల్ బస్సులు వేసి మరీ అందర్నీ తీసుకొచ్చాం” తడుముకోకుండా చెప్పారు సుపుత్రులు.
పెద్దాయన నిట్టూర్చి అన్నాడు. ” ఒకేసారి కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాల్టీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముంచుకు వచ్చేసరికి ఎంత కంగారు పడిపోయార్రా మనోళ్లు పాపం.. ఏదయినా మనం ధైర్యం చెప్పేసరికి అందరూ బలేగా రంగంలోకి దూకేశార్రా..అదీ, అలాగ ఉండాలి.. అదిగో అక్కడ మనోళ్లని చూడు.. ప్రతివోడూ ‘పెద్దాయనా, నన్ను గెలిపించు’ అని ఎలా మొక్కుతున్నారో! అసలు పార్టీలన్నీ మంచివేరా..అందుకే ప్రతి పార్టీలో మనోళ్లు మందలు మందలుగా ఉండాలి. మనకి ఇలా మొక్కుతూ ఉండాలి”
సుపుత్రులు తల ఊపారు. పెద్దాయన కొనసాగించాడు. ” అవన్నీ నటనలు అనుకుంటున్నారా? నటనలు కాదెహే.. ఏవిచ్చాన్రా మీ అందరికీ నేను? ఆస్తులిచ్చానా, ఏదయినా ఇచ్చానా? కాస్తో కూస్తో డబ్బులిచ్చాను. కులాభిమానాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోశాను. ఇక మీకు మీరే సంపాదించుకోండి, పోండ్రా అని మిమ్మల్నందర్నీ రాజకీయాల్లోకి తోలేశాను. కులాభిమానం కి మించింది ఏదయినా ఉందట్రా ఈ సమాజంలో?”
“అవును నాన్నగారూ..మీ ముందు చూపు వల్లే నేనూ, చిన్నోడూ రాజకీయాల్లోకి వెళ్లాం, వేరు వేరు పార్టీల్లో చేరాం” అన్నాడు పెద్దోడు. “అంతో ఇంతో సంపాదించుకున్నాం. మీరు చెప్పినట్టే మన బంధువులందర్నీ రాజకీయాల్లోకి తెచ్చాం.. వేరు వేరు పార్టీల్లో పెట్టాం” అంటూ వంతపాడేడు చిన్నోడు.
“శభాష్.. నేను కోరుకున్నదీ ఇదేరా.. పార్టీ ఏదయినా కానీ మనవాళ్లలో కుటుంబానికి కనీసం ఒకరు చొప్పున ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి. మనలో మనం పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి. అదే నా థీరీ ” అని ఆగి, ” అవును గానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పటాలమంతా మన చుట్టపక్కాలే కదా! చాలా మందిని చూసి ఉండను కూడా..” అన్నాడు పెద్దాయన.
” అందరూ మనవాళ్లే నాన్న గారూ, మీకు ఆ డౌటు అక్కర్లేదు. నామినేషన్లు వేసి మీ ఆశీర్వాదం కోసం వచ్చారు. ఇప్పుడు మీకు అందరి గురించి చెప్పేసరికి తెల్లారిపోతుంది గానీ కొందరిని పరిచయం చేస్తా..”అంటూ చిన్నోడు ఇద్దరు మహిళల్ని ముందుకు రమ్మని పిలిచాడు.
” ఆ పెద్దావిడ మా ఆవిడ పినమావగారి బావగారి చిన్నల్లుడి మేనకోడలు. తన పక్కనే ఉన్న అమ్మాయి ఈ మేనకోడలికి సొంత కోడలు. విశేషమేమిటంటే ఈ అత్తా కోడళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. మన సలహా మీద వేరు వేరు పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు”
పెద్దాయన మురిసిపోయాడు. “నీకు ఆలి వంక చుట్టమంటే మనకు ఆప్త బంధువులే మరి. వీళ్లిద్దరిలో ఎవరు గెలిచినా అధికారం ఆ ఇంట్లోనే ఉంటుంది” అన్నాడు.
“నాన్న గారూ, మీకు అలాంటి కుటుంబం ఇంకోటుంది. వాళ్లని పరిచయం చేస్తాను” అంటూ పెద్దోడు ఓ నలుగుర్ని పిలిచాడు. ” నాన్నగారూ.. ఆ పెద్దావిడని మీరు గుర్తు పట్టలేదు. ఆవిడ స్వయానా బామ్మ గారి నాలుగో చెల్లెలి మూడో కూతురి అల్లుడి అక్క గారు.. నా పెళ్లికి కూడా వీళ్లు వచ్చారు. ఆ పెద్దావిడ, ఆవిడ అబ్బాయి, కోడలు, ఆవిడ మరిది మొత్తం నలుగురూ వేరు వేరు చోట్ల నుంచి వేరు వేరు పార్టీల తరఫున నామినేషన్లు వేశారు.”
పెద్దాయన కళ్లు చెమర్చాయి. “అన్ని రాజకీయ పార్టీలు ఇలా మనోళ్లతో, వాళ్ల ఫ్యూచర్ జెనరేషన్స్ తో ఇలా కళ కళలాడిపోవాలి” గద్గదికంగా అన్నాడు.
“అందరూ ఏదో ఒక రకంగా మనకు దూరపు బంధువులే నాన్నగారూ!”
” పిచ్చివాడా..దగ్గర, దూరం అనేది కిలో మీటర్ల లెక్కలో గానీ బంధుత్వంలో కాదు. బంధువంటే బంధువే, మనోడంటే మనోడే. బీరకాయలో ఎన్ని పీచులు ఉన్నా అన్నీ ఒక కాయలోనే పెనవేసుకుని ఉంటాయి. అందుకే అంటారు బీరకాయ పీచు బంధుత్వమని” ధర్మ సూక్ష్మం విడమర్చి చెప్పాడు పెద్దాయన.
” ఇప్పుడు నన్ను నేను పెద్దాయన గారికి పరిచయం చేసుకుంటాను” అంటూ ఒకాయన ముందుకొచ్చాడు. “ఎవరు నువ్వు” అన్నట్టు చూశాడు పెద్దాయన.
“నేను పెద్దాయనా వెంకుబాబుని.. నేను మీ అమ్మమ్మ ఆడపడుచు తోడికోడలి మనవడికి స్వయానా మేనమామని..
” నువ్వు కూడా నేను చెప్పిన పీచులో వాడివేనన్నమాట.. నీ సంగతి చెప్పు” అన్నాడు పెద్దాయన.
వెంకు బాబు గొంతు సవరించుకుని మొదలు పెట్టాడు. ” మా ఫ్యామిలీ స్టోరీ సింపుల్ గా చెబుతాను. ఇది నా రెండో భార్య. మొదటి భార్యకి సాయంగా ఉంటుందని దీన్ని చేసుకున్నాను. విషయమేమిటంటే దీనికి నేను రెండో మొగుడిని. మా పెళ్లికి దీని మొదటి మొగుడు వచ్చి, నా మొదటి భార్యని చూసి మోజు పడి చేసుకుంటానన్నాడు. సరేలే అని మా జంట పక్కనే రెండు పీటలు వేయించి వాళ్లకి కూడా పెళ్లి జరిపించేశాం. చెప్పొచ్చేదేమిటంటే నలుగురం కలిసి మెలిసి జీవిస్తున్నాం. మా నలుగురికీ పార్టీ టిక్కెట్లు వచ్చాయి. మీ ఆశీస్సుల కోసం వచ్చాం పెద్దాయనా!”
పెద్దాయన కళ్లు తుడుచుకుని “విజయోస్తు..శ్రీఘ్రమేవ అధికారప్రాప్తిరస్తు” అని దీవించాడు. తర్వాత అందరి వైపు తిరిగి చెప్పాడు.
“ఇది కదా ఆదర్శ కుటుంబం అంటే.. ఇది కదా అచ్చమైన రాజకీయ కుటుంబం అంటే.. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ రాజకీయాల్లో ఉండాలి. వేరు వేరు పార్టీల్లో ఉండాలి. ఇవాళ వాడు గెలుస్తాడు. రేపు మరోడు గెలుస్తాడు. ఎవరు గెలిచినా ఆ అధికార ఫలాలని కుటుంబంలో అందరూ పంచుకోవాలి. వాడికి కావల్సిన పనులు వీడు చెయ్యాలి. వీడికి కావల్సిన పనులు వాడు చెయ్యాలి.”
” అవును, అవును” అంటూ చుట్టూ జనాలు అరిచారు.
పెద్దాయన గర్వంగా అందర్నీ చూసి అన్నాడు. “అసలు రాజకీయ కుటుంబం అంటేనే బియ్యం పరవాణ్ణంలాంటిది. బియ్యం, పంచదార, యాలకులు, జీడిపప్పులు, కిశిమీశులు అన్నీ వేరు వేరు పార్టీలలాగా విడివిడిగా ఉన్నా అధికారం అనే చిక్కటి పాలతో కలిపి చేస్తేనే అది చూడ్డానికీ, తినడానికీ బావుంటుంది.”
” పెద్దాయనకీ జై!” అంటూ బంధు బలగం నినాదాలు చేసింది.
— మంగు రాజగోపాల్
****
(లీడర్ దినపత్రిక 29-10-26 సంచికలో ప్రచురితం)





