వెలుగులు అంథకారాన్ని నివారించి మనకు మంచి దారి అందిస్తాయి. నిత్యం మానవళిని చైతన్యపరిచేవి ఉషస్సులు. ఉషస్సులని సమర్పించేది దినకరుడు. నవగ్రహాలలో ఒక గ్రహంగా ఉన్న సూర్యనారాయణుడు స్పర్శ ప్రపంచాన్ని మేల్కొలుపుతుంది. ఎందరు దేవతలు ఉన్నా వారందరూ ఆలయాల్లో ఉత్సవమూర్తులుగా సందర్శనం ఇస్తారు, కానీ వెలుగులని మనకు నిత్యం వరంగా ఇచ్చే సూర్యచంద్రులు నిజంగా ప్రత్యక్ష దైవాలు. సూర్యుని వెలుగులు మనకు ప్రపంచాన్ని సందర్శింపచేస్తాయి. చంద్రుడి వెన్నెల అనుభూతిని, సూర్యుడు ఉషస్సు ఒక అనుభవాన్ని కలిగిస్తాయి. మనకు నిత్యం తన పలకరింపు ద్వారా పారవశ్యాన్ని అందించే ఆలయం మన తెలుగునాట నెలవై ఉండడం ఒక అద్భుత అనుభూతిని మిగులుస్తుంది. మనకి కనబడే సూర్యనారాయణుడి ఆలయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఒరిస్సాలో కోణార్కు లోను, ఉత్తరాంధ్రలో నాగావళి నది ప్రవహించిన నేలపై అరసవిల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభని, చారిత్రక సాంస్కృతిక గుర్తులని అందించడం ఒక విశేషం. తరతరాలుగా యావత్ భారతావనికి ఒక సూర్యక్షేత్రంగా అలరిస్తుంది. ప్రతీ దేవాలయానికి ఒక ఆధ్యాత్మిక నేపధ్యం దాగి ఉంటుంది.

నాగలిని ఒక ఆయుధంగా కలిగియున్న శ్రీహరి నీడ ఆదిశేషువు బలరాముడిగా అవతరించి నాగావళి నదిని ఆవిర్భవింపచేసి రుద్ర కోటేశ్వర ఆలయం ప్రతిష్టింపచేసారు. ఇది అందరు దేవతలు సందర్శించారు గానీ దేవతల అధిపతి ఇంద్రుడు ఆలస్యంగా రావడం నందీశ్వరుని ఆగ్రహం వలన శివయ్య దర్శనం కాలేదు. అదే సమయంలో ఇంద్రుడు విసిరివేయబడి అరసవిల్లి సమీపంలో సూర్యనారాయణుడిని ప్రతిష్టింపచేసారు. ఈ క్షేత్ర సందర్శనం ఆరోగ్య ప్రధాతగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు. వ్యాధులు వచ్చిన వారు స్వామి అనుగ్రహం వలన మంచి ఆరోగ్యం పొందుతారు అని విశ్వాసం. స్వామి దర్శనం ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. చారిత్రకంగా ఏడవ దశాబ్దంలో కళింగరాజు దేవేంద్ర వర్మ నిర్మించారు. పచ్చని ప్రకృతి, అద్భుత శిల్ప సౌందర్యం, నిత్యం వేద పండితుల మంత్రపుష్పాలతో సూర్యనారాయణ స్వామి ఆలయం కళకళలాడుతుంది. మాఘమాసంలో సూర్యకిరణాలు సూర్యనారాయణుని విగ్రహాన్ని తాకుతాయి. ఇది భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ప్రతీ దేవాలయ సందర్శనం మనకు ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలగజేస్తుంది. కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు కొలువైన అరసవిల్లి క్షేత్రం మనకి ఆజన్మాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగులుతుంది. అసరవిల్లి క్షేత్రానికి సమీపంలోనే కూర్మనాధుడు నెలకొనిఉన్న శ్రీకూర్మ క్షేత్రం కూడా ఉంది. నాగావళి నది నుంచి మనం వెలుతున్నప్పుడు మన మనస్సు అరసవిల్లి సూర్యనారాయణుడిని దర్శించాలనే ఆకాంక్ష మది నిండా దాగి ఉంటుంది. ఒక్కసారి సూర్యనారాయణ స్వామిని సందర్శించినప్పుడు మన హృదయం ఎంతగానో సంబరపడుతుంది. ఆ జ్ఞాపకాలని మన మనస్సు దాచుకుంటుంది. నిత్యం మనకి కనబడే సూర్యనారాయణ స్వామిని సందర్శించినప్పుడు ప్రతీవారి మనస్సు అప్రయత్నంగా అరసవిల్లి దేవాలయం వైపు వెలుతుంది. అసరవిల్లి ఆధ్యాత్మిక ఆనందాల కల్పవల్లి.





