
నవవధువు మనస్సు తెరిచినప్పుడు జ్ఞాపకాల సంగతులు
సుముహూర్తం సమయం దాటినప్పుడు
అంతరంగం నిండా చిత్ర విచిత్ర భావనలు
అమ్మనాన్న అనుబంధాలకి బాల్యం నడిచిన నడకలకి
పుట్టి పెరిగిన పారవశ్యాలకి పెళ్ళి వేడుక గాగానే
దూరంగా సుదూరంగా
వరుడి చిటికెన వేలుతో
కొత్త ప్రపంచంలో అడుగులు
వందఏళ్ళ కలల జీవితానికి స్వాగతాలు
అరుదైన కొత్త అనుభూతులు
ఆనందం, ఆర్ధ్రత నిండిన క్షణాలు
వాహనం ఏదయినా
అమ్మనాన్న అందరూ తోడుగా కలిసి వచ్చిన
నవవధువు కుడికాలుతో శ్రీలక్ష్మిగా అడుగులు వేసిన
మదిలో యింకిపోని గంథంలా
మాంగల్య బంధం అందించిన కొత్త బంధాలు
మనస్సు నీడలో అమ్మ ఇంటి తీపి గుర్తులు
ఒక్కక్షణం
కొత్త కోడలని చిన్నారిలా లాలించిన
ఆనందంగా ఆత్మీయంగా పాలించినా
గుండెల నిండా అమ్మచేతి గోరుముద్దులు
నాన్న గారంగా నడిరేయి తినిపించిన హిమక్రీములు
సోదరుడితో చిలిపి తగాదాలు
ఇంటిపై పెంచుకున్న మమకారాలు
మొక్కలు పంచిన పరిమిళ వరాలు
మాధుర్యాల ఊయలలు బాల్యం వరాలు
ఇవన్నీ నవవధువు హృదయంలో స్మరణలు
మనస్సు రాల్చిన కన్నీరులు
అందుకే
ఏదైనా పండుగ కోసం పుట్టింటికి తిరిగి వెళ్ళే క్షణాలు కోసం నిరీక్షిస్తుంది
చెంగు చెంగున లేగదూడలా గంతులు వేస్తుంది.
అమ్మనాన్నల చెంత వాలిపోతుంది
తన ప్రపంచాన్ని వీక్షించి మురిసిపోతుంది.
— దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
అధ్యాపకులు – పరిశోధకులు
సెల్ : 9949039175


