ప్రముఖ ప్రాత్రికేయులు మంగు రాజగోపాల్ గారికి సినీ ఓం హెరాల్డ్, ఈనాడు, ఆంధ్ర ప్రభ, ఆంద్ర భూమి, సూర్య భూమి, లీడర్, ఆంధ్ర జ్యోతి పత్రికలలో యాభై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రాజగోపాల్ ప్రస్తుతం సాయంకాలం నుంచి ఉదయం ఎడిషన్ గా మారిన లీడర్ లో ‘సరదాకి’ అనే శీర్షికను నిర్వహిస్తున్నారు. ‘సిటీజనం’ పాఠకులతో తమ శీర్షికను పంచుకోవడానికి ఆయన అంగీకరించారు. ఆయనకు ధన్యవాదాలు . అదే సమయంలో శీర్షికను మన వెబ్ సైట్ లో ప్రచురించడానికి అనుమతించిన లీడర్ పత్రిక ఎడిటర్ రమణమూర్తికి కూడా ‘సిటీజనం’ ధన్యవాదాలు.

ప్రధానమంత్రి కార్యాలయం, ఢిల్లీ.
ప్రధాని నరేంద్ర మోదీ తన సీటులో కూర్చుని ఏవో ఫైళ్లు తిరగేస్తూ ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు మాటి మాటికీ వాచీ చూసుకుంటున్నారు.
ఆయన ఎదురుచూస్తున్న అమిత్ షా రానే వచ్చారు.
“నమస్కార్ అమిత్ జీ.. మీ కోసమే చూస్తున్నాను. కూర్చోంది, కూర్చోండి” చిరునవ్వుతో పలకరించారు ప్రధాని.
“నమస్కార్, నమస్కార్ మోదీజీ.. ఎలా ఉన్నారు, బావున్నారా? నన్ను కలవాలని రమ్మన్నారట. ఏమిటి విషయం?” కూర్చుంటూ అడిగారు అమిత్ షా.
” మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి గురించి అందరూ తలుచుకునే విషయం ఏమిటి?” అడిగారు ప్రధాని.
“సరిపోయింది. ఇది అడగడానికా నన్ను రమ్మన్నదీ?” అని మనసులోనే విసుక్కుని ” ఏముంది? మితభాషి, ఎవరు ఏం చెప్పినా మౌనంగా ఉంటారు” అని అందరూ అనుకుంటారు” అన్నారు అమిత్ షా.
” అది కాకుండా ఇంకొకటి?”
” దేశంలో ఆర్ధిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు అని కూడా తలుచుకుంటారు”
“అది సరే, ఇంకో గొప్ప విషయం కూడా ఉంది” చిరునవ్వుతో అన్నారు మోదీ.
” నాకు తట్టడం లేదు. మీరే చెప్పండి.”
“పీవీజీ కి పధ్నాలుగు భాషలు వచ్చు. ఆ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం కూడా చేస్తారట!”
“అవునట. నేనూ విన్నాను. ఇంతకీ పీవీజీ భాషాప్రావీణ్యానికీ, నన్ను పిలవడానికీ సంబంధం ఏమిటి మహాశయా?”
” అమిత్ జీ, నేరుగా విషయానికి వచ్చేస్తాను. పీవీజీ లాగా పధ్నాలుగు భాషలు కాకపోయినా నాకు తెలుగు భాష మాత్రం నేర్చుకోవాలని ఉంది. అయితే ఈ విషయం బయట ఎక్కడా ప్రచారం కాకూడదు. ఎలాగో చెప్పండి” తగ్గు స్వరంతో అన్నారు మోదీ.
అమిత్ షా కొన్ని క్షణాలు ఆలోచించారు. ” ట్యూటర్ ని పెట్టుకుంటే బయటికి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. మీ అంతట మీరు నేర్చుకుంటానంటే ‘ముప్పయ్ రోజుల్లో తెలుగు భాష’ అనే పుస్తకం మార్కెట్ లో దొరుకుతుంది. అది తెప్పిద్దాం” అని ఆగి “ఇంతకీ మీకు తెలుగు నేర్చుకోవాలనే కోరిక ఇంత సడెన్ గా ఎందుకు పుట్టింది?” అడిగారు.
” చెబుతాను. మళ్లీ మీరు ఎవరితోనూ అనకండి.”
అమిత్ షా ముక్కు మీద వేలు వేసుకుని “ఎంతమాట..నేను ఎవ్వరికీ ఏమీ చెప్పను” అన్నారు.
ప్రధాని చెప్పడం మొదలు పెట్టారు.
” ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, మనం కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో మన దోస్తీ బాగా పెరిగిపోయింది. చాలా తరుచుగా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి అక్కడ బహిరంగ సభల్లో వారితోపాటు ప్రసంగాలు చెయ్యవలసి వస్తోంది.”
అమిత్ షా ఆసక్తిగా వింటున్నారు. ప్రధాని కొనసాగించారు.
” ఈ మధ్య భోగాపురం ఎయిర్ పోర్టుని ప్రారంభించడాని వెళ్లి వచ్చాను కదా.. అక్కడ వాళ్లిద్దరూ తెలుగులో మాట్లాడిన మాటల్లో ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు. మధ్యలో ఇంగ్లీషులో మాట్లాడిన మాటలు, భారత్ మాతాకీ జై తప్ప మిగతా దాంట్లో ఒక్క ముక్క కూడా బోధపడలేదు”
అమిత్ షా కలగజేసుకుంటూ ” వాళ్లేం మాట్లాడేరో ఆ తర్వాత వాళ్లే చెప్పి ఉంటారు కదా..అలా కాకపోయినా మన ఇంటలిజెన్స్ రిపోర్టులు ఉండనే ఉంటాయి” అన్నారు.
” నిజమే అనుకోండి. కానీ ఆ తర్వాతెప్పుడో తెలియడం వేరు, ఆ క్షణంలోనే తెలియడం వేరు కదా! అదే నాకు తెలుగు తెలిసి ఉంటే మరోలా ఉండేదని అనిపించింది” విచారంగా అన్నారు ప్రధాని.
” ఎలా ఉండేది?” కుతూహలంగా అడిగారు అమిత్ షా.
” అసలు పవన్ కల్యాణ్ మాట్లాడ్డం మొదలుపెడుతూనే ఏడుపు గొంతుతో మొదలుపెట్టేడు. తన చెయ్యికి జరిగిన ప్రమాదం గురించీ, సర్జరీ గురించీ చెబుతున్నాడేమో అని అనుకున్నాను. కానీ కాదని తర్వాత తెలిసింది. జంతర్ మంతర్ ధర్నాలో విద్యార్ధులు నన్ను నానా మాటలు అంటుంటే పవన్ కల్యాణ్ కి కన్నీళ్లొచ్చాయట.గుండె కదిలిపోయిందిట. నన్ను కొట్టే నాయకుడే దేశంలో లేడంట. ఇలా ఆయన చెబుతుంటే ఏం చెబుతున్నాడో అర్ధం కాక నేను బ్లాంక్ ఫేసు పెట్టుకుని కూర్చున్నాను. అదే నాకు తెలుగు తెలిసి ఉంటే..” ఆగారు ప్రధాని.
“తెలిసి ఉంటే ఏం చేసేవారు?”
” వెంటనే నేను కళ్లు తుడుచుకునే వాణ్ణి. చేతులెత్తి పవన్ కల్యాణ్ కీ, జనాలకీ దండం పెట్టేవాణ్ణి. వేదిక మీదే పవన్ కల్యాణ్ ని కావలించుకుని, వీపు మీద తట్టి ఓదార్చేవాణ్ణి. అప్పుడు జనంలో నా ఇమేజీ మరింత పెరిగేది కదా!”
“అవునవును” అంటూ తలాడించారు అమిత్ షా.
” అదలా ఉంచితే, అక్కడ చంద్రబాబు ప్రసంగం ఇంకో హైలైటు. నన్ను ఆకాశానికి ఎత్తుతూ గొంతెత్తి పొగిడేశారు. ఒకప్పుడు నన్ను నానా మాటలు అన్న చంద్రబాబేనా ఇప్పుడు నాకు ఇలా బ్రహ్మ రథం పడుతున్నారు అని నేనే ఆశ్చర్యపోయేలా ఉపన్యాసం దంచికొట్టారు. స్టీల్ ప్లాంట్ కి నిధులిచ్చింది ఎవరు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కి ఆక్సిజెన్ ని ఇచ్చిందెవరు ఎవరు ఎవరు అని గొంతు చించుకుని అరుస్తూ ప్రజల చేతే మోదీ, మోదీ అని నినాదాలు చేయించారు. నాకే గనక తెలుగు తెలిసి ఉంటే లేచి నిలబడి చేతులెత్తి అందరికీ దండం పెట్టేవాణ్ణి. కనీసం చిరునవ్వులు చిందించేవాణ్ణి. అప్పుడు జనంలో మనకి మరింత మైలేజీ పెరిగేది. తెలుగు తెలియకపోవడం వల్ల ఈ విన్యాసాలు చెయ్యలేకపోయానని అసలు విషయం తెలిసిన తర్వాత తెగ బాధపడ్డాను అమిత్ జీ!” అని ఆగి మంచి నీళ్లు తాగారు ప్రధాని.
” మీరు చెప్పినదంతా కరెక్టే గాని ఇప్పటికిప్పుడు తెలుగు నేర్చుకోవాలంటే కష్టమేమో మోదీజీ” అంటూ ఆలోచనలో పడ్డారు అమిత్ షా.
“మరేం చేద్దాం అమిత్ జీ?” నిరాశగా అన్నారు ప్రధాని.
” ఒక పని చెయ్యొచ్చనుకుంటా మోదీజీ.. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సుల్లో హెడ్ ఫోన్లు ఉంటాయి చూడండి.. వక్త ప్రసంగాన్ని ఏ భాష వాళ్లు ఆ భాషలో వినే ఏర్పాటు ఆ హెడ్ ఫోన్లలో ఉంటుంది. అలాంటి హెడ్ ఫోన్ మీ కోసం తెప్పిద్దాం ” అని సూచించారు అమిత్ షా.
.” అయిడియా బాగానే ఉంది గాని ఆ ఏర్పాటు క్లోజుడు రూముల్లో తప్ప బహిరంగ సభల్లో వర్కౌట్ కాకపోవచ్చు” సందేహంగా అన్నారు ప్రధాని.
..” ఎందుకు కాదు? ఈ ఏఐ యుగంలో అసాధ్యం అన్నది లేనే లేదు. ఇక నేను వెళ్లనా మరి” అంటూ లేచారు అమిత్ షా.
” థాంక్యూ అమిత్ జీ” అని షేక్ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని.
–**–
–(‘లీడర్’ (13-08-26) దినపత్రిక సౌజన్యంతో




