భారత భారతికి వందనం

హిమగిరి సొగసులు మా రక్షణ కవచాలు,
కైలాసగిరి నుంచి కదిలిన గంగాజలాలు
పుడమిపై మంత్రపుష్ప అభిషేకాలు,
నేలతల్లికి నిత్య ఉద్వేగాలు,
ఎగిసిపడే సాగరతీర అలలు.

గనుల నుంచి ఎన్నో సంపదలు,
కోహినూర్ వజ్ర వైడూర్యాలు,
స్వర్ణ వెండి కాంతులు
నీ సిగలో మెరిసే ఆభరణాలు.

కూచిపూడి, భరతనాట్య అందెల సవ్వడులు,
నటరాజుకు నృత్య నీరాజనాలు.
వాల్మీకి, వ్యాసుడు, సిరివెన్నెల
భావ సుగంధాలు
సరస్వతీమాతకు అక్షర చందనాలు.

సరిగమ పదనిసలు
మహమ్మద్ రఫీ, ఘంటసాల, బాలు, చిత్ర
మధురగానాలు,
సంగీత లక్ష్మికి స్వర నైవేద్యాలు.

తిరువనంతపురం, శ్రీహరికోట
అంతరిక్ష కేంద్రాలు,
సైన్సు విజయానికి ఆవిష్కరణలు.

కాంచీ, ధర్మవరం, బండారులంక చేనేత చీరలు,
దారాలు, రంగులు జతగా నడిచిన
సృజనకు సాక్ష్యాలు.

భాక్రా నంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు
నిత్య సుభిక్షమైన జలసిరులు.

గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్,
ఎన్టీఆర్, ఇందిరా, రాజీవ్‌లు
జనహృదయ నేతలు.

ఊటీ, కాశ్మీర్, అరకు అందాలు
ప్రకృతి పారవశ్య చిరునామాలు.
పచ్చని చేలు, విరబూసిన పూలవనాలు,
గలగల ప్రవహించే జలపాతాలు
సౌందర్యాల సంతకాలు.

కాశీ అన్నపూర్ణ, డొక్కా సీతమ్మలు
సహృదయ ఆతిథ్యాలు.

వందేమాతరం, జనగణమన
ప్రార్థనా గీతాలు.
ఎనిమిది పదులు దాటిన
స్వేచ్ఛాపతాక ఆనందహేల!

త్రివర్ణ పతాకం పలకరిస్తుంటే
తనువు సంబరపడుతుంది,
తన్మయత్వంతో తరిస్తుంది.

ఆగస్టు 15
ఎప్పటికీ తరాలు దాటినా
అది జాతికి అంజలి ఘటిస్తుంది.

— డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
అధ్యాపకులు, సెల్ : 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *