
********
"హలో యుగంధర్, బాగున్నారా!"
డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు ఐజీ స్వరాజ్యరావు.
" హలో, వాటే సడెన్ సర్ప్రయిజ్.. రండి, కూర్చోండి.. ఏమిటి ఇలా వచ్చారు?" అన్నాడు యుగంధర్.
"ఏమీ లేదు. చాలా రోజులయింది మిమ్మల్ని కలుసుకుని. అందుకని వచ్చాను" కూర్చుంటూ అన్నాడు స్వరాజ్యరావు.
" ఊరక రారు మహాత్ములు.. ఏదో పని ఉండే వచ్చారు. నన్ను మళ్లీ పాకిస్తాన్ కి పంపిస్తారా ఏమిటి?" నవ్వుతూ అన్నాడు యుగంధర్.
స్వరాజ్యరావు కూడా నవ్వి "అలాంటి చిన్న పనులకి యుగంధర్ ఎందుకు, దురంధర్ ఉండగా!" అన్నాడు.
యుగంధర్ సిగరెట్టు ముట్టించి గాఢంగా పొగ పీల్చి వదులుతూ "చెప్పండి" అన్నాడు.
స్వరాజ్యరావు తీక్షణంగా చూసి "నేనో సమస్యలో ఇరుక్కున్నాను యుగంధర్ గారూ" అన్నాడు.
సరిగ్గా అప్పుడే అసిస్టెంట్స్ రాజు, కాత్యా లోపలికి వచ్చారు. నోట్స్ తీసుకోమన్నట్టు సైగ చేశాడు యుగంధర్. తల ఊపాడు రాజు. స్వరాజ్యరావు చిన్నగా దగ్గి చెప్పడం మొదలు పెట్టాడు.
" ఇదొక విచిత్రమైన పరిస్థితి యుగంధర్ గారూ..ఇదివరకెప్పుడూ ఇలా జరగలేదు. మన రాష్ట్రంలో వేరు వేరు జిల్లాల నుంచి నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు తమని జైల్లో పెట్టమని పోలీసు వారిని రిక్వస్ట్ చేస్తూ ఒకేసారి అప్లికేషన్ పెట్టుకున్నారు. వీరిలో ప్రత్యర్ధులపై దాడులు, హత్యానేరం, యాక్సిడెంట్లు, ఫోర్జరీలు.. ఇలా రకరకాల కేసులపై అరెస్టయి బెయిలు మీద విడుదలయినవారు, మరి కొందరు ముందస్తు బెయిలు పొందినవారు ఉన్నారు.అందరూ కూడా ప్రత్యర్ధుల వల్ల తమకి ప్రాణహాని ఉందనీ కారణం చెబుతున్నారు."
యుగంధర్ తల ఊపి " రుజువులుంటే జైల్లో పెట్టవచ్చుగా? ఇందులో ప్రాబ్లం ఏమిటి?" అన్నాడు.
" జైళ్లు హౌస్ ఫుల్ అయి ఉండవచ్చు. లేదా పోలీసు సిబ్బంది కొరత అయి ఉండవచ్చు" నవ్వుతూ అన్నాడు రాజు.
స్వరాజ్యరావు రాజు వైపు చురుగ్గా చూశాడు. " రాజు చెప్పింది కొంత వరకూ కరెక్టే గాని అందరూ ఒకటే కారణం చెప్పడం చూస్తుంటే ఇందులో ఏదయినా కుట్ర ఉందేమో అని అనుమానంగా ఉంది" గొంతు తగ్గించి అన్నాడు.
"ఏమిటా కుట్ర?" ఆసక్తిగా అడిగాడు యుగంధర్.
"వీళ్లు జైలులో ఉన్న తమ విరోధుల్ని హతమార్చడానికి పన్నిన పన్నాగం అయివుండవచ్చు. లేదా జైళ్లలో ఏదో నెపం మీద అలజడి సృష్టించడం అనే దురుద్దేశం కూడా కావచ్చు."
" ఇంతకీ ఇందులో నేను చేయగలిగింది ఏమిటి?" సూటిగా అడిగాడు యుగంధర్.
"వాళ్ల పిటిషన్ విషయంలో చట్టప్రకారం మేము ఏం చెయ్యాలో అది చేస్తాం. కానీ వాళ్లు ఎందుకు అలా అడుగుతున్నారో, వారి ఆంతర్యమేమిటో మీరు కనిపెట్టగలిగితే దానిని బట్టి మేము నిర్ణయించుకుంటాం" చెప్పాడు స్వరాజ్యరావు.
యుగంధర్ కాసేపు దీర్ఘంగా ఆలోచించి " వీరిలో కామన్ పాయింట్ ఏదయినా ఉందా స్వరాజ్యరావు గారూ? " అడిగాడు.
స్వరాజ్యరావు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. " ఇది ఈపాటికే మీరు ఊహించి ఉంటారనుకున్నాను" అంటూ ముందుకి వంగి ఒక రాజకీయ పార్టీ పేరు చెప్పి "వీరంతా ఆ రాజకీయ పార్టీ వారే. అందుకే ఇందులో కుట్ర కోణం ఉందేమో అని నాకు అనిపిస్తోంది" అన్నాడు.
యుగంధర్, రాజు, కాత్యా ముగ్గురూ అవునన్నట్టు తలాడించారు.
" మీ అనుమానంలో ఒక పాయింటు లేకపోలేదు మిస్టర్ స్వరాజ్యరావు.. సరే, నాకో మూడు రోజులు గడువు ఇవ్వండి. జైల్లో పెట్టమంటున్నవారి పేర్లు, చిరునామాలు నాకు వాట్సాప్ లో పంపండి. నా ప్రయత్నం నేను చేస్తాను" అంటూ లేచాడు యుగంధర్.
స్వరాజ్యరావు మొహం వికసించింది. "థాంక్యూ యుగంధర్..మీరు అన్నారంటే తప్పకుండా కనిపెడతారు. మూడు రోజుల తర్వాత మళ్లీ కలుద్దాం" యుగంధర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి నిష్క్రమించాడు స్వరాజ్యరావు.
యుగంధర్ రాజు, కాత్యాల వైపు తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు.
**
మూడు రోజుల తర్వాత బూట్సు టకటకలాడిస్తూ మళ్లీ వచ్చాడు స్వరాజ్యరావు. యుగంధర్ నవ్వుతూ చూశాడు.
"డోంట్ వర్రీ స్వరాజ్యరావ్..మీరు భయపడుతున్నట్టు ఇందులో ఏ కుట్ర లేదు. మీరు నిశ్చింతగా మీరు చేయదలుచుకుంది చేయవచ్చు"
"అసలు వాళ్లు ఎందుకు అలా పిటిషన్లు పెట్టుకున్నారు యుగంధర్? ఇంతకీ మీరెలా కనిపెట్టారు?
యుగంధర్ చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టాడు.
" జైలులో ఉంటే వాళ్ల నాయకుడు వచ్చి వాళ్లని పరామర్శిస్తాడని, ఆయన దృష్టిలో పడితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు రాకపోదా అని వారి ఆశ. రాజు, కాత్యా మారు వేషాలు వేసుకుని వాళ్ల పనివాళ్లని మచ్చిక చేసుకుని అసలు విషయం రాబట్టారు. పాపం, వారి ఆశల మీద మీరెందుకు నీళ్లు పొయ్యడం? వెంటనే అరెస్టులు చేసి జైళ్లలో పెట్టేయండి"
స్వరాజ్యరావు తల పట్టుకున్నాడు. " ఇదెక్కడి పితలాటకం యుగంధర్? ప్రతి జిల్లాకీ వాళ్ల నాయకుడు రావడం, నిషేధాజ్ఞలు ధిక్కరించి కార్యకర్తలు పోగవడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడం, నానా గొడవ చెయ్యడం మామూలయిపోతోంది. ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు" విసుగ్గా అన్నాడు.
యుగంధర్ చిటికె వేసి " మీ సమస్యకి పరిష్కారం ఒకటుంది" అన్నాడు.
స్వరాజ్యరావుకి ప్రాణం లేచివచ్చినట్టయింది. "చెప్పండి యుగంధర్, ప్లీజ్!" అన్నాడు.
"మరేం లేదు. వాళ్లందర్నీ వేరు వేరు జైళ్లలో కాకుండా ఒకే జైలులో పెట్టండి. వాళ్ల నాయకుడు వచ్చినప్పుడు పెరేడ్ లో పోలీసుల్లా ఒకే వరసలో నిలబెట్టండి. వాళ్ల నాయకుడు వరసగా ఒక్కొక్కరినీ పరామర్శించి వెళ్లిపోతాడు. నిజానికి ఆ నాయకుడు కూడా లోపల్లోపల సంతోషిస్తాడు హెలికాప్టర్ ఖర్చులు తగ్గి ఒకే ట్రిప్పుతో పుణ్యం పురుషార్ధం రెండూ కలిసొచ్చాయని" అని ముగించాడు యుగంధర్.
" ఈ అయిడియా బావుంది యుగంధర్..హోం మంత్రి గారితో మాట్లాడతాను. వన్స్ అగైన్ థాంక్యూ" అని స్వరాజ్యరావు వెళ్లిపోయాడు.
--- మంగు రాజగోపాల్
- నా అభిమాన రచయిత కొమ్మూరి సాంబశివరావు గారికి నమస్కారాలతో..
(లీడర్ 20-08-26 సంచికలో ప్రచురితం)







