రాజీవ్ గాంధీని కడసారిగా సాగనంపిన విశాఖ ఎయిర్ పోర్టు

  • నేడు రాజీవ్ గాంధీ 82వ జయంతి **
    ***

    దాదాపు యాభయ్ ఏళ్ల కిందట తమ అధీనంలో ఉన్న విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణీకుల విమానాలు నడపవచ్చంటూ ఉదారంగా అనుమతి ఇచ్చిన రక్షణ శాఖ ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసేసుకుంది. దీనితో ప్రయాణీకుల విమానాలకు నేటితో విశాఖ ఎయిర్ పోర్టు తలుపులు మూసుకున్నాయి. ఇకనుంచి ఆ విమానాలు మరి కొన్ని నిమిషాలు గాలిలో ప్రయాణం చేసి కొత్తగా భోగాపురంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతాయి.
    విశాఖ విమానాశ్రయంతో విశాఖవాసులకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఎవరి మాట ఎలా ఉన్నా విశాఖలోని సీనియర్ పాత్రికేయులకు మాత్రం ముప్పయ్ ఐదేళ్ల కిందట జరిగిన ఒక సంఘటన స్మృతి పథం నుంచి చెరిగిపోదు.
    1991 మే నెల 21 వతేదీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు… ఆ రోజు సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత కొద్ది గంటలకే బాంబుదాడిలో కన్ను మూశారు. రాజీవ్ గాంధీ చివరి బహిరంగ సభ జరిగిందీ విశాఖలోనే, చివరిగా సాగనంపిందీ ఈ విశాఖ విమానాశ్రయమే!
    ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజులవి… ఆ రోజు సాయంత్రం పాత బస్టాండ్ వద్ద ఉన్న మునిసిపల్ స్టేడియంలో కిక్కిరిసిన బహిరంగ సభలో ప్రసంగించిన రాజీవ్ గాంధీ అటు నుంచి అటే ఎయిర్ పోర్టుకి వెళ్లవలసి ఉంది. ఆ రాత్రి ఆయన తమిళనాడులోని శ్రీపెరంబుదూరు బహిరంగ సభలో ప్రసంగించవలసి ఉంది. కానీ ఆయన ప్రయాణించబోయే విమానంలో ఏదో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఎయిర్ పోర్టుకి వెళ్లకుండా సర్క్యూట్ హవుస్ (గవర్నర్ బంగళా)కి వెళ్లిపోయారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం తమిళనాడుకి వెళ్లిపోదామనుకున్నారు.
    రాజీవ్ గాంధీ ఒకటి తలిస్తే దేవుడు మరోలా తలచాడు. ఆయన ప్రయాణించబోయే విమానానికి మరమ్మతులు పూర్తయి బయల్దేరడానికి సిద్ధంగా ఉందని ఎయిర్ పోర్టు నుంచి కబురొచ్చింది. అప్పటికి విశాఖ ఎయిర్ పోర్టులో రాత్రి పూట విమానాల రాకపోకలకి అవకాశం లేదు. అప్పటికే చీకటి పడబోతోంది. త్వరగా రమ్మని ఎయిర్ పోర్టు అధికారులు తొందరపెట్టారు. దాంతో ఆయన హడావిడిగా ఎయిర్ పోర్టుకి బయల్దేరారు. దారి పొడుగునా విశాఖ ప్రజలు వీడ్కోలు చెప్పారు. అదే తుది వీడ్కోలు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎయిర్ పోర్టు నుంచి రాజీగాంధీ బయల్దేరిన కొద్ది గంటలకే శ్రీ పెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
    ఆ రోజు ఆ విమానానికి రిపేర్లు పూర్తి కాకుండా ఉంటే..రాత్రికి రాజీవ్ గాంధీ విశాఖ లోనే బస చేసి ఉంటే.. కనీసం ఆ రాత్రికి ఆయనకి గండం తప్పి ఉండేది.
    విశాఖ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకి వెళ్లే తోవలో గోపాలపట్నం ఫ్లయ్ ఓవర్, కాకాని నగర్ దాటేక ఎడమ వైపు ఒక రోడ్డు విశాఖ ఎయిర్ పోర్టు వైపు వెళుతుంది. ఇటు విశాఖ సిటీ నుంచి, ఎదురుగా గాజువాక నుంచీ, ఎడమవైపు ఎయిర్ పోర్టు నుంచీ ట్రాఫిక్ బాగా పెరిగిపోవడంతో కొంత కాలం కిందట అక్కడ ఒక సిగ్నల్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇప్పుడిక విశాఖ ఎయిర్ పోర్టు మూతపడటంతో ఆ సిగ్నల్ ఇక పని చేయకపోవచ్చు. ఎయిర్ పోర్టు లాగే అసలు దాని అవసరం ఇక ఎవరికీ ఉండదు.
  • — మంగు రాజగోపాల్
Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *