వరప్రదాయిని వరలక్ష్మి

– శ్రావణ శుక్రవారం వ్రతం

  శ్రావణం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. అమ్మవారి హృదయం కరుణా రససింధువు. ఆమె కేవలం సిరిసంపదలను ప్రసాదించడమే కాకుండా, సహృదయతను, సంస్కారాన్ని, సౌభాగ్యాన్ని అందిస్తుందని మన విశ్వాసం. శ్రావణమాసం అనగానే పసిడి, స్వర్ణకాంతులతో మెరిసే నగలు గుర్తుకురావడం సహజం. పార్వతీదేవి సౌభాగ్యప్రదాయిని. పసుపు, కుంకుమలతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే మగువలను నిత్యసుమంగళులుగా ఆశీర్వదిస్తుందని పెద్దల నమ్మకం.

     పండుగలు, పర్వదినాలు మన సంస్కృతికి లభించిన గొప్ప వరాలు. మన ఇతిహాసాలు, పురాణాలు తరతరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి సజీవ వారసత్వంగా సంక్రమిస్తూ వచ్చాయి. సాక్షాత్తూ శివపరమాత్మ సైతం అమ్మవారి సలహా మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారని నానుడి ఉంది. శ్రావణమాసమంతా శుభకార్యాలతో, పచ్చతోరణాలతో, మంగళవాయిద్యాలతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో లక్ష్మీ ఆరాధన చేయడం విశేషం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.

కలశంలో కొలువుదీరే అమ్మవారు

 మన సంప్రదాయంలో కలశం ఎంతో పవిత్రమైనది. అది శుభసంకేతంగా భావిస్తారు. విశిష్ట అతిథులు ఇంటికి వచ్చినప్పుడు కలశంతో స్వాగతం పలకడం మన సంస్కృతిలోని ఆత్మీయతకు ప్రతీక. వెండి కలశానికి పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి, పవిత్ర జలాలతో నింపి, మామిడి ఆకులు, కొబ్బరికాయతో అలంకరిస్తారు. అనంతరం అమ్మలగన్న అమ్మ అయిన వరలక్ష్మీదేవిని కలశంపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు.

    అమ్మవారు అందరిలోనూ అంతర్లీనంగా ఉంటుందని మన విశ్వాసం. పసిపాపల నుంచి వయస్సు పైబడిన పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆమెను భక్తితో కొలుస్తారు. చిన్నారులు అందంగా పట్టుపావడాలు ధరించి సందడిగా తిరుగుతుంటే, కలువబాలల సందర్శనం కలిగించే పారవశ్యం కలుగుతుంది. అందమైన భవిష్యత్తును ఊహించుకునే కన్నెపిల్లలు, కొత్తగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టే నవవధువులు, వయస్సు పైబడిన మగువలు—ఇలా అన్ని వయసుల మహిళలు నిర్మలమైన భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

   భక్తే అమ్మవారికి ప్రీతికరం

    వరలక్ష్మి వ్రతంలో తోరం ధరించడం ఒక ముఖ్యమైన ఆచారం. అది అమ్మవారి ఆశీస్సులకు, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. భక్తులు అమ్మవారికి పండ్లు, పూర్ణంబూరెలు, వివిధ ప్రసాదాలను సమర్పిస్తారు. అయితే పూజలో ప్రధానమైనది ఆర్భాటం కాదు మనస్సు నిండిన మమకారం, నిర్మలమైన భక్తి. శివయ్యకు మారేడు దళం, శ్రీహరికి తులసిదళం, అమ్మవారికి పసుపు, కుంకుమలను సహృదయంతో సమర్పిస్తే చాలు. మన వైభవాలు, ఆర్భాటాలు, అట్టహాసాలు అమ్మవారికి సైతం నచ్చవు. మట్టి బొమ్మ అయినా సరే, అందులో మనస్ఫూర్తిగా మమతను నింపితే అదే భక్తికి ప్రతిరూపమవుతుంది.

  అందరినీ ఆకట్టుకోవాలన్న తపన, తాపత్రయం సమంజసం కాదు. పెద్దగా అమ్మవారిని అలంకరించి, పేరంటాలు చేసి, తద్వారా మన గొప్పతనాన్ని వ్యక్తపరచాలనే ఆకాంక్ష కూడా సరైనది కాదు. వ్యక్తుల్లో అహంకారం తగ్గాలి. ఇతరులను కించపరిచే వైఖరి తొలగాలి. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అందరికీ జీవితం వడ్డించిన విస్తరి కాకపోవచ్చు. వారి వారి కర్మఫలానుసారం జీవనం సాగుతుంది. మన ఆధ్యాత్మిక తత్వాలు కూడా మనకు ఇదే విషయాన్ని బోధిస్తాయి.

  లక్ష్మీ అనుగ్రహమే జీవన సౌభాగ్యం
  లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరికీ కీలకం. ఆర్థికంగా ఎదగాలని, అవసరాలు తీరాలని, భవిష్యత్తు బంగారు బాటలో సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సకల సంపదలకు మూలమైన లక్ష్మీ అనుగ్రహం, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ అనుగ్రహం—ఈ రెండూ మన జీవితానికి రెండు నేత్రాల వంటివి. సంపదతో పాటు జ్ఞానం, జ్ఞానంతో పాటు సంస్కారం ఉన్నప్పుడే జీవితం సార్థకమవుతుంది.

  తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం
    వరలక్ష్మి వ్రతం తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పూజా సంప్రదాయం. ఇది లక్ష్మీ స్వరూపమైన పూజ అయినప్పటికీ, పార్వతీదేవిని వరలక్ష్మి రూపంలో పూజించడం విశేషం. అపర వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి సప్తగిరుల చెంత వెలసిన అలివేలు మంగాపురం లోనూ వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ విధానంలో ఈ పూజకు టికెట్లను విక్రయిస్తోంది.   వరలక్ష్మి వ్రతం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు. అది భక్తి, మమకారం, సౌభాగ్యం, సంస్కారం, కుటుంబ ఐక్యతకు ప్రతీక. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, జ్ఞానం, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుందాం.

**మహిళలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు**

–డాక్టర్ దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ , అధ్యాపకులు , 9949039175

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *