హిరణ్యాక్ష హోమం

   ” ఓం హిరణ్యాక్షాయ నమః… ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు” 

     స్వామీజీ తదేక దీక్షగా హోమాన్ని చూస్తూ గంభీర స్వరంతో మంత్రం పఠిస్తున్నారు. చుట్టూ జనం అక్షరం పొల్లు పోకుండా ఆ మంత్రాన్ని వల్లె వేస్తున్నారు.

     ఎవరీ స్వాములవారు? ఏమిటా మంత్రం? ఎందుకా హోమం?

     ఈ వివరాలు తెలియాలంటే కళ్ల ముందు ఫ్లాష్ బ్యాక్ చక్రాలు తిరగాల్సిందే!

         ***********

         వారం రోజుల కిందట..

      భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు గారు ప్రెస్ మీట్ పెట్టి విశాఖ ప్రజల మనసులు శాంతించేలా ఓ చల్లని మాట చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టును గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో కలపాలని ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని, నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కూడా మాట్లాడుతున్నామని ప్రకటించారు. అసలే విశాఖపట్నంకి ఎయిర్ పోర్టు లేకుండా పోయిందని భగ్గు భగ్గుమంటున్న విశాఖ జనాలకి ఎల్ నినో ఎండల మధ్య కాసిన్ని చినుకులు పడి వాతావరణం చల్లబడిన ఫీలింగొచ్చింది.

             ************

       ” ఎంతయినా మా బాసు గంటా శీనువాసు గొప్పోడ్రా బాబూ… ఓ పెద్ద సమస్యకి చిటికెలో పరిష్కారం చూపించీసేడు..” ఆనందంగా అన్నాడు అప్పలకొండ.

        పైడితల్లి అప్పలకొండ వైపు జాలిగా చూశాడు. ” నేనోమాట అడుగుతా, సెప్మీ! ఇప్పుడు మనం జగదాంబ జంక్షను కాడున్నాం..ఇక్కడ నుంచి బోగాపురం ఏర్ పోర్టు ఎంత దూరం ఉన్నాదంటావ్? “

          ” ఓ నలభయ్ అయిదు, యాభయ్ కిలో మీటర్లు ఉండదూ?”

           ” మరి ఎల్లడానికి ఎంతసేపు పట్టుద్దంటావ్?”

            ” ఓ గంటన్నర పట్టదూ?”

            పైడితల్లి ఫెళ్లున నవ్వేడు. “ఓరి ససవా? మీ బాసు చెప్పినట్టు పర్ సపోజ్, ఏర్ పోర్టుని మన కార్పరేసనులో కలిపీసుకున్నాం అనుక్కో..ఆ దూరం తగ్గిపోద్దా? ఆ ప్రయాణం టైము తగ్గిపోద్దా? తగ్గేదే లే!” 

          అప్పలకొండ ఉడుక్కున్నాడు. ” అవి తగ్గిపోతాయని నేనన్నానేటి! ఏర్ పోర్టుని మన కార్పరేసనులో కలిపేత్తే అది మన అండరులోనే ఉంటాదని అదో తుత్తి. అంతే!” 

           పైడితల్లి ఆలోచనలో పడ్డాడు. ” నిజంగానే ఆ దూరం తగ్గిపోతే.. “నిజంగానే ఆ ప్రయాణం టైము కూడా తగ్గిపోతే..అసలా ఊహే ఎంత బాగుందో!” బ్రహ్మానందంలా లోపల అనుకుంటూ పైకే అనేశాడు.

          అప్పలకొండ కళ్లు మిలమిల మెరిశాయి. ” నిజం పైడితల్లీ..అలా జరిగితే ఎంత బాగుంటాదో…మన విశాఖ జనాలు ఎంతగా సంతోషిస్తారో కదా!” అన్నాడు ఆశగా.

         “అలా జరగాలంటే ఏదో అద్భుతం జరగాలి. లేదా విఠలాచారి సిన్మాలో లాగా ఏదో మాయో మంత్రమో చెయ్యాలి” అంటూ కళ్లు మూసుకుని ఆలోచనలో పడ్డాడు పైడితల్లి.

           పైడితల్లి సీరియస్ గానే ఆలోచిస్తున్నాడని అప్పలకొండకి అర్ధమైంది. చటుక్కున కళ్లు తెరిచి అన్నాడు పైడితల్లి. ” ఒరే అప్పలకొండా..సీతమ్మదార కొండ దగ్గిర ఎవరో సాములారు వచ్చి పూజలు చేస్తున్నారట. ఆయన కాడ చాలా మహత్తెం ఉందట. మా యప్ప చెప్తుంటే విన్నాను. ఓ సారి ఆయన కాడికి వెళ్లొద్దమేటి? మన ఏర్ పోర్టు సమస్యకి ఆయన ఏటన్నా పరిష్కారం చెప్తాడేమో అడుగుదాం” అన్నాడు.

          “సరే, పదా..ఇప్పుడే పోదాం” అన్నాడు అప్పలకొండ.

                 ******

           స్వామీజీ ఆశ్రమం భక్తులతో కిటకిటలాడుతోంది. గంట సేపు క్యూలో నిలబడ్డ తర్వాత పైడితల్లి, అప్పలకొండ వంతు వచ్చింది. 

           ” చెప్పండి నాయనలారా, మీ సమస్య ఏమిటో?” లాలనగా అడిగారు స్వామీజీ.

           “ఇది మా సొంత సమస్య కాదు సామీ..జనం సమస్య ” జమిలిగా అన్నారు పైడితల్లి, అప్పలకొండ.

          “సొంత పని మీద కాకుండా జనం పని మీద వచ్చామన్నారు కాబట్టి మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను. చెప్పండి ఆ పనేమిటో?” అన్నారు స్వామీజీ.

          మొత్తం ఏర్ పోర్టు కథ, దూరాభారం పెరిగి జనం పడుతున్న అగచాట్ల గురించి వంతులువారీగా ఏకరువు పెట్టారు పైడితల్లి, అప్పలకొండ. స్వామీజీ సానుభూతిగా తలాడించి “ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?” అని అడిగారు. 

        “మరేట్నేదు సామీ.. తవరే ఏదో మాయ చేసి మా వొయిజాగుకీ, బోగాపురంకీ మధ్య దూరం తగ్గించీయాల..” అన్నాడు పైడితల్లి. “అంతేగా, అంతేగా” అని వంత పాడేడు అప్పలకొండ.

          స్వామిజీ ధ్యానముద్ర పట్టారు. కాసేపయాక ధ్యానం నుంచి తేరుకుని, ” మీరు అడిగింది నేను చెయ్యలేను గాని ఆ పని చేసేవాడొకడున్నాడు. వాడిని రప్పించి ఆ పని పూర్తి చేయిస్తా” అన్నారు. 

         “తవరు ఆ మాట అనడమే మహా బాగ్గెం..ఇంతకీ ఎవురు సామీ ఆయన?” అడిగాడు అప్పలకొండ.

      స్వామీజీ చిరునవ్వు నవ్వి చెప్పారు. ” పూర్వం పురాణాల్లో హిరణ్యాక్షుడని ఓ రాక్షసుడు ఉండేవాడు. లోకాలని పీడించడమే వాడి పని. వాడోసారి భూమిని చాపచుట్టగా చుట్టేసి సముద్రంలో దాక్కున్నాడు. జనం గగ్గోలెత్తిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అవతారమెత్తి, వాడిని చావగొట్టి, భూమిని రక్షించాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, భూమిని మడతపెట్టే విద్య హిరణ్యాక్షుడికి మాత్రమే తెలుసు కాబట్టి వాడిని పిలిచి సాయం చెయ్యమని అడుగుదాం”

     ” అయ్యబాబోయ్, వాడు మళ్లీ బూవిని చుట్టీసి, దాచిస్తే పెపంచకం తలకిందలయిపోదా? వద్దు సామీ వద్దు” గాభరాగా అన్నాడు పైడితల్లి.

       ” అబ్బే, మొత్తం భూమిని చుట్టమని మనమెందుకు అడుగుతాం? మనకి కావల్సిన ఓ నలభయ్ కిలోమీటర్ల మేర భూమిని మడత పెట్టి, విశాఖకీ భోగాపురంకీ మధ్య దూరాన్ని తగ్గించమని అడుగుతాం” అన్నారు స్వామీజీ.

        ” ఈ ఆలోచన బాగుంది సామీ..కొమ్మాది, మారిక వలస దాటంగానే బోగాపురం ఏర్ పోర్టు వచ్చీయాలి” అన్నారిద్దరూ.

        ” సరే, రేపు హోమం వేసి హిరణ్యాక్షుణ్ణి రప్పిద్దాం. మీరు మళ్లీ రేపు ఈ సమయానికే ఇక్కడికి రండి” అన్నారు స్వామీజీ.

             **********

         మర్నాడు పైడితల్లి, అప్పలకొండతోపాటు చాలామంది జనం పోగయ్యారు. స్వామీజీ హోమం వేసి ” ఇప్పుడు నేనో మంత్రం జపిస్తాను. అందరూ అక్షరం పొల్లుపోకుండా ఆ మంత్రాన్ని తిరిగి జపించండి ” అన్నారు. అందరూ సరేనన్నారు.

        “ఓం హిరణ్యాక్షాయ నమః… ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు” 

       స్వాములవారు  గంభీర స్వరంతో మంత్రం జపిస్తున్నారు. చుట్టూ జనం అక్షరం పొల్లు పోకుండా ఆ మంత్రాన్ని వల్లె వేస్తున్నారు. కాసేపయాక హోమంలో అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ఆ జ్వాలల నుంచి హిరణ్యాక్షుడు ఉద్భవించాడు. జనం హాహాకారాలు చేశారు.

          “స్వాములవారూ, ఏమిటి మీ ఆన?” చేతులు కట్టుకుని అడిగాడు హిరణ్యాక్షుడు.

           స్వామీజీ అతడికి కర్తవ్యబోధ చేశాడు. హిరణ్యాక్షుడు తల ఊపి ” అలాగే స్వామీ, రేపు తెల్లారేకల్లా మీరు అడిగినంత మేరా భూమిని మడత పెట్టేసి, ఊరికీ, ఏర్ పోర్టుకీ మధ్య దూరాన్ని తగ్గించేస్తాను” అని మాయమై పోయాడు. జనం కేరింతలు కొట్టారు.

              *********

       తెల్లారింది. పైడితల్లి, అప్పలకొండ స్వామీజీ దగ్గరికి గాభరాగా పరిగెత్తుకొచ్చారు. ” సామీ.. ఆ రాచ్చసుడు మనల్ని మోసం చేసీసేడు. అన్నీ మామూలుగానే ఉన్నాయి. బోగాపురం అక్కడే ఉంది. దూరం అలాగే ఉంది. ఏమీ మారలేదు” అని గోల గోల పెట్టేరు. 

       స్వామీజీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. “ఓరీ హిరణ్యాక్షా..ఇయం ముహుర్తే సాక్షాత్కారం కురు కురు ” అని దిక్కులు పిక్కటిల్లేలా గావుకేక పెట్టాడు.

       హిరణ్యాక్షుడు చేతులు నలుపుకుంటూ ప్రత్యక్షమయ్యాడు. ” స్వామీ, మీరు మళ్లీ పిలుస్తారనే అనుకున్నాను. దయచేసి ఆగ్రహించకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి” అన్నాడు.

       స్వామీజీ కోపాన్ని అణుచుకుని “ఇచ్చిన మాట ఎందుకు తప్పావో చెప్పు” అన్నారు.

        హిరణ్యాక్షుడు చెప్పడం మొదలుపెట్టాడు. “స్వామీ, ఇక్కడినుంచి వెళ్లాక మొత్తం ఈ ప్రాంతాన్నంతా అణువణువూ క్షుణ్ణంగా పరిశోధించాను. ఆశ్చర్యంగా నాకు గజానికో హిరణ్యాక్షుడు కనిపించారు. రైతుల దగ్గర తక్కువ రేటుకి కొనేసి భూముల్ని మడత పెట్టేసి లే అవుట్లు వేసినవారు, ప్రభుత్వం కళ్లుగప్పి కొండల్ని కూడా కబ్జా చేసిన వారు.. ఇలా ఎంతోమందిలో నా అంశ నాకే కనిపించి భలే ముచ్చట వేసింది. నేను లేకపోయినా నాలాగే భూముల్ని మడతపెట్టగలిగి కాజేసేవాళ్లు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నందుకు నాకు చెప్పరానంత సంతోషం కలిగింది. మీరు చెప్పినట్టు ఆ కాస్త మేరా భూమిని మడతపెట్టి దూరాన్ని తగ్గించానే అనుకోండి..నాలాంటి హిరణ్యాక్షులు ఎంతోమంది నష్టపోతారు. పాపం, వాళ్లు కూడా నాలాంటి రాక్షసులే కదా అని జాలి వేసి మీకిచ్చిన మాట తప్పాను. సాటి రాక్షసులని కనికరించడం నేను చేసిన తప్పా స్వామీ” గద్గద కంఠంతో అన్నాడు హిరణ్యాక్షుడు.

      హిరణ్యాక్షుడి దీనగాధ విన్న పైడికొండ, అప్పలకొండ కడుపులు తరుక్కుపోయాయి. స్వామీజీ కళ్లు తుడుచుకున్నారు. “ఎంతయినా మీరూ మీరూ రాక్షసులు. ఆ మాత్రం బంధుప్రీతి ఉండడంలో తప్పు లేదు. ఇక వెళ్లు. ఇయం ముహుర్తే అంతర్ధానం కురు కురు” అన్నారు.

          హిరణ్యాక్షుడు చటుక్కున మాయమై పోయాడు.

          — మంగు రాజగోపాల్

(సరదాకి.. 3-9-26 లీడర్ దినపత్రికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *