కృష్ణం వన్డే జగద్గురుమ్

—-కృష్ణ తత్త్వం—

అష్టమి అనగానే శ్రావణంలో వచ్చే గోకులాష్టమి స్మరణకు వస్తుంది. గోపాల బాలుడు జన్మించిన శుభదినం. ప్రతి హృదయం బృందావనంగా మారి భక్తితో మారి పులకిస్తుంది. అంతేగాదు కృష్ణయ్యను ఒక చిలిపి కన్నయ్యగా కాకుండా వెన్న దొంగగా కాకుండా ప్రపంచానికి సందేశం అందించిన గీతకారుడిగా , కాలాలు, యుగాలు మారినా కర్తవ్యం సమర్పించే కర్మవీరుడిగా భగవద్గీత నిలిచింది రేపల్లెలో లీలలు గోకులంలో పాటలు కురుక్షేత్రంలో కదనరంగ పద్ధతులు చివరికి చిత్రవిచిత్రంగా ఒక బోయవాడి బాణానికి జీవితం ముగింపు కావడం విషాదమైనా విధివిలాసం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. చాలామంది భావించిన విధంగా గత జన్మ శాపం కాదు విధిరాత ఎలా అడుగులు వేస్తే అలా జీవితం ప్రయాణిస్తుంది. శ్రీకృష్ణ జననం ఒక విధంగా అద్భుతం జననం నుంచి లీలలు ప్రారంభమై యమునా తీరం దాటి రేపల్లె వెళ్ళిన చిన్నారి బాల్యమంతా ఊహకందని రీతిలో ఉంటుంది. అమ్మకు తన నోటిలో
సమస్త భువనాల్ని సందర్శింపజేశారు. కాళింది తీరాన నాగుల గర్వభంగం, గోవర్ధనగిరిని కిందకు దించడం ఇవన్నీ వ్యక్తులలో పెరిగిన అహంభావ ధోరణికి ఆనకట్టవేయడం . ఒకరకంగా అందరిలాగా బాల్యం కొనసాగలేదు. యవ్వనంలో బంధాలకు, అనుబంధాలకి ధర్మాన్ని పరిరక్షించడం విశేషం . ధర్మ పరిరక్షణకే మేనమామ కంసుని వధించారు. గురువుగారి పుత్ర శోకం తీర్చడానికి కాలయముణ్ణి ఎదిరించారు శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తే అయినా అవసరమైనప్పుడు ఆత్మీయులను పరిరక్షించే విషయంలో భగవంతుడుగా తన మహిమను ప్రదర్శించారు. పాండవుల వెంట ధర్మం ఉందని తలచి వారి వెంట నీడలా నిలిచారు. లక్క గృహంలో ఉన్న వారిని కాపాడారు ద్రౌపది గౌరవం కాపాడారు. జరాసంధుడిని, కర్ణుడిని వధించే సమయంలో తనదైన చతురతను పాండవులకు అందించారు. పాండవులకు అండ, దండ ఆయనే. శ్రీకృష్ణుడి ప్రేమ తత్త్వం అపారమైనది. ఒకరకంగా గోపికల సాహచర్యం ప్రేమతత్వాన్ని ప్రతిబింబిస్తోంది. కేవలం మనుషులే కాదు మూగజీవులైన గోవులు కూడా ప్రేమ రసవాహినిలో ఓలలాడాయి.
కృష్ణాష్టమి సందర్బంగా అందరికీ శుభాకాంక్షలు.

–డాక్టర్ దువ్వూరి శర్మ , అధ్యాపకులు , 99490 39175.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *