జీవన విధానానికి అద్దంపట్టే పోలా అమావాస్య

***సెప్టెంబర్ 11 అమావాస్య—
సంప్రదాయ పండుగలు మన జీవన విధానానికి అద్దం పడతాయి. ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో రైతులు, గృహిణులు జరుపుకునే పండగ పోలా అమావాస్య లేదా పొలాల అమావాస్య, దీనిని కాడెద్దుల లేదా బసవన్నల పండుగ అని ఎడ్ల పండుగ అని పోలాల పండుగ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నా పరమార్థం ఒక్కటే! వ్యవసాయానికి తోడ్పడే పశువులను (ఎడ్లను) పూజించేందుకు మన పెద్దలు ఏర్పాటు చేసిన వేడుక అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రలో మరాఠ సాంప్రదాయాలతో పోలాల అమావాస్యను పూరణ్ పోలీ పండుగగా వ్యవహరిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జిల్లాలలో ఈ పండుగ చేసుకోవడం ఎక్కువ కనిపిస్తుంది. అమావాస్య అరిష్టం కాదు కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అపమృత్యు భయం తొలగేలా గృహిణులు తమ ఇలవేల్పును పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. శ్రావణ మాస ముగింపు నాడు పూజలు, కైంకర్యాలతో ఇలవేల్పులకు మొక్కుతూ అమావాస్యను మరింత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పూజా మండపాలలో మట్టితో చేసిన ఎడ్లను, కందమొక్కను కూడా ఉంచి పూజిస్తారు. అన్ని కాలాల్లో వ్యవసాయ పనులకు అండగా నిలిస్తున్న ఎద్దుల రుణాన్ని తీర్చుకోవడానికి రైతులు ఏడాదికి ఓసారి ముచ్చటగా జరుపుకునే పండుగ పొలాల అమావాస్య. శ్రావణ అమావాస్య నాడు ఈ పండుగను ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు వారు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తెల్లవారు జామునే లేచి కాడెద్దులను గ్రామ సమీపంలోని వాగుకు, లేదా చెరువుకు, కుంటలకు వేదా సమీపంలోని నదికి తీసుకు వెళ్లి చక్కగా స్నానం చేయిస్తారు. అందమైన రంగులతో బొట్లతో అలంకరించి, నూతన వస్త్రాలను వాటిపై వేసి నందీశ్వరుడిగా, బసవేశ్వరుడిగా భావిస్తూ కొమ్ములకు రంగులు వేస్తారు. పూలగుత్తులతో వాటిని అలంకరించి రైతులు పూజిస్తారు. వాటికి ఇష్టమైన పదార్థాలను ప్రేమగా తినిపిస్తారు. అన్నదాతకు నిత్య స్నేహితుడిగా నడిచే ఎద్దులను అపురూపంగా చూసుకుంటారు. రంగురంగుల బట్టలతో అలంకరించి అందంగా తీర్చి దిద్ది ముస్తాబు చేస్తారు. గ్రామంలోని వీధివీధికి, గ్రామంలోని ఆలయాలకు, ఇంటిటికీ ఊరేగింపు తీస్తారు. ఈ సమయంలో ముత్తయిదువలు వాటికి కుంకుమ తిలకం దిద్ది హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు.
కుటుంబంలో అందరి ఆయురారోగ్యాల కోసం, సంతాన వృద్ధి కోసం మంగళగౌరిని లేదా గ్రామదేవతను, లేదా ఇలవేల్పును కంద మొక్కతో పూజిస్తారు. ముఖ్యంగా ఈసాంప్రదాయం తెలంగాణా, మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో కూడా కనిపిస్తుంది. కర్ణాటకలోని ధన్వంతరీ క్షేత్రంలో ధన్వంతరి స్వామికి కందగడ్డ కానుకగా సమర్పించి పూజించడంకనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు కోలుకోవాలని స్వామికి కంద గడ్డను సమర్పిస్తారు. ఇదే రకమైన కంద మొక్కలను గృహిణులు తమ ఇంటిలో పూజామంటపం వద్ద ఉంచుకుని, కుంకుమ, పసుపుతో అలంకరించి ఇలవేల్పును పూజిస్తారు. అదేవిధంగా తమ ఇంటి ఆవరణలో ఈ మొక్క పెంచుకోవడం ఆనవాయితి. వాటికి అక్కడే పొలాల అమావాస్య రోజు పూజచేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కంద గ్రామీణ ప్రాంతాలలో లభిస్తుంది. దీనిని దురద కంద అని కూడా అంటారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అన్న సామెత ఈ కంద నుంచే వచ్చిందేమో!? ఈ కందను చేలగట్ల వెంట పెంచుకుంటారు. ఇది తమ పంటలను పరిరక్షిస్తుందని రైతులు బలంగా నమ్ముతారు. అదేవిధంగా ఈ కందను విష్ణుమూర్తి అవతారంగా భావించే ధన్వంతరి స్వామికి సమర్పిస్తారు. ఈ ఆచారం కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుంది. దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నవారు కర్ణాటకలోని అరుదైన ధన్వంతరి స్వామి ఆలయాలు దర్శించుకుంటారు. కోనందూర్ ఆలయం శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి కోనందూర్, శ్రీ వైద్యనాథేశ్వర విష్ణుమూర్తి ఆలయం కొక్కాడ, దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి, మారుకేరి (భట్కల్)లోని హూత్కళలో ఉన్న శ్రీ ధన్వంతరి ఆలయాలు సందర్శించినవారికి ఈ కందను సమర్పించడం కనిపిస్తుంది.

–వొద్దిపర్తి రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్టు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *