కృష్ణయ్యకు జోలపాట


పాటలు ఎన్ని ఉన్నా జోలపాటలో ఉండే మాధుర్యం చెప్పనలవికాదు. భక్తి పారవశ్యంలో చిన్ని కృష్ణయ్యను తలుచుకుంటూ వాగ్గేయకారులు పాడిన జోల పాట జనం మదిని దోచుకుంది. భాష ఏదైనా భక్తి భావం హృదయాలకు హత్తుకుంటుంది. జోలపాట పాడుతుంటే కలిగే మాధుర్యం, అనుభూతి చెప్పనలవికాదు. మనస్సులో కృష్ణుని తలుచుకుని తాను యశోదమ్మలా తన్మయత్వం చెంది పాడుకునే వారంతా భక్తి మాధుర్యాన్ని గ్రోలి తాదాత్మ్యత చెందుతారు. శ్రీకృష్ణుడికి జోలపాట పాడటం అనేది కేవలం ఒక పాట కాదూ, అది ఒక అలౌకిక అనుభూతి, భక్తి. ఆ సమయంలో భక్తులు తమను తాము యశోదమ్మగా భావించుకుని, సాక్షాత్తు ఆ పరమాత్ముడిని తమ ఒడిలోని చిన్నారిగా తలచుకుని పాడేటప్పుడు కలిగే ఆనందం మాటలకు అందదు. భగవంతుడిని సృష్టికర్తగా కాకుండా, ఒక చిన్న పసిపాపగా భావించి ప్రేమించడం లోనే సగం మధురత్వం దాగి ఉంది. ఆయనకు దిష్టి తగలకుండా చూసుకోవడం, లాలించడం, జోలపాడటంలో భక్తుడి హృదయం కరిగిపోతుంది. మాణిక్కం కట్టి జోలపాట తమిళ సాహిత్యం. ద్వాపరయుగంలో యశోదమ్మ బాలకృష్ణుడిని ఊయలలో పడుకోబెట్టి పాడినట్లుగా పెరియాళ్వార్ (విష్ణుచిత్తుల వారు) కలియుగంలో తనను తాను యశోదగా భావించుకుని పాడిన కీర్తన (పాశురం) “తాలేలో” .
శ్రీవేంకటేశ్వరస్వామిని శ్రీకృష్ణునిగా శ్రీమన్నారాయణునిగా భావిస్తూ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన “జో అచ్యుతానంద జోజో ముకుందా” కీర్తన తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన పరమ పవిత్రమైన జోలపాట. తెలుగులో అన్నమయ్య రాసిన “జో అచ్యుతానంద” కీర్తనకు, తమిళంలో ఆళ్వారులు రాసిన ఈ “తాలేలో” áాాపాశురాల వాత్సల్య భావనలే ముఖ్య ప్రేరణగా నిలిచాయి.
భాష ఏదైనా ఇద్దరు వాగ్గేయకారులు తమ భక్తి భావాన్ని పద్యరూపంలో వ్యక్తం చేసి, దానికి స్వరాన్ని కట్టి, స్వయంగా పాడి ప్రజల హృదయాల్లో భక్తి జ్వాలను రగిలించారు. వారి కీర్తనలు కేవలం సంగీతమే కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. పెరియాళ్వార్ అసలు పేరు విష్ణుచిత్తుడు. వీరు సుమారు 9వ శతాబ్దం నాటివారని తెలుస్తోంది. పెరియాళ్వార్ తిరుమొళి అనే ప్రబందాన్ని రచించారు. ఆయన రచించిన ఈ కీర్తనలు శ్రీకృష్ణుని బాలలీలలు మరియు విష్ణుభక్తితో నిండినవి. వీరి కవిత్వం భక్తి, సాహిత్యం, సంగీతం కలిపిన రూపం. విష్ణుచిత్తుల వారిని వాగ్గేయకారులుగా పరిగణించవచ్చు. ఎందుకంటే వారు స్వయంగా రచించి, వాటిని స్వరపరచి, భక్తి గీతాలుగా పాడారు. ఈ కీర్తనలు కేవలం సాహిత్యం కాదు, సంగీత భక్తి యజ్ఞం. వారు పాడిన ప్రతి పద్యం దివ్యప్రబంధంలో భాగమై, ఆలయాల్లో నిత్యసేవలో వినిపించబడుతుంది. అందువల్ల, పెరియాళ్వార్ వంటి ఆళ్వారులు వాగ్గేయకారులుగా, భక్తి సంగీతకారులుగా గుర్తింపు పొందారు. పెరియాళ్వార్ మాతృహృదయం, కృష్ణుని బాలలీలలు. అన్నమయ్య వెంకటేశ్వరుడు, భక్తి, శృంగారం, ఊయల పాటలు.
అన్నమయ్య (అన్నమాచార్య) 15వ శతాబ్దం, ఆంధ్రప్రదేశ్ సంకీర్తనలు 32,000 తెలుగు కీర్తనలు, భక్తి, శృంగారం, ఊయల పాటలు, రాసలీలలు. వెంకటేశ్వర స్వామిపై అపార భక్తి.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామినే శ్రీకృష్ణునిగా భావిస్తూ “జో అచ్యుతానంద జోజో ముకుందా…” లేదా “లాలి లాలి..బీ ” వంటి జోలపాటలు పాడుతుంటే, చుట్టూ ఉన్న ప్రపంచం మాయమైపోతుంది. మనస్సంతా ఆ నీలమేఘ శ్యాముని రూపమే నిండిపోతుంది. యశోదమ్మ స్థానంలో తనను తాను ఊహించుకున్నప్పుడు భక్తుడి మనస్సులోని లౌకిక చింతలన్నీ తొలగిపోయి, అమాయకమైన, పవిత్రమైన ప్రేమ మాత్రమే మిగులుతుంది. కృష్ణ భక్తిలోని ఈ వాత్సల్య రసం మానసిక ప్రశాంతతను, పరమానందాన్ని ఇస్తుంది. అందుకే తరతరాలుగా ఈ జోలపాటలు భక్తుల హృదయాలను రంజింపజేస్తూనే ఉన్నాయి. సాధారణంగా తల్లులు తమ బిడ్డలను నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడుతారు. అన్నమయ్య, సకల చరాచర సృష్టికి మూలకారకుడైన ఆ వేంకటేశ్వరస్వామిని (బాలకృష్ణుడిగా భావించి) నిద్రపుచ్చడానికి ఈ పాటను పాడటం విశేషం.
ఈ కీర్తనను సాంప్రదాయకంగా ‘నవరోజు’ లేదా ‘కాపి’ రాగంలో పాడుతారు. ఈ రాగాలు మనస్సుకు అమితమైన ప్రశాంతతను చేకూర్చి, పసిపిల్లలను త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. ఈ పాటలో అన్నమయ్య కృష్ణుడి పుట్టుక (వసుదేవుడికి జన్మించడం), నందుడి ఇంట్లో పెరగడం, గోవర్ధన గిరిని ఎత్తడం, కంస వధ వంటి కృష్ణ లీలలన్నింటినీ చాలా చక్కగా ఒకే మాలగా గుచ్చారు. భగవంతుడిని అత్యంత ఆత్మీయుడిగా భావించే ‘మధుర భక్తి’ ఈ పాటలో కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి ఇంట్లోనూ తల్లులు తమ పిల్లలను నిద్రపుచ్చడానికి పాడే మొదటి పాట ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణుడిని నిద్రపుచ్చడానికి యశోదమ్మ పాడినట్లుగా భావించే ప్రసిద్ధమైన జోల పాటలు మరియు లాలి పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. కానీ అన్నమయ్య పాడిన జోలాపాటకే అధికప్రాధాన్యం కనిపిస్తుంది. అదేవిధంగా మాణిక్యం కట్టి పెరియాళ్వార్ పాడిన పాశురం (పాట) అన్ని శ్రీవైష్ణవ ఆలయాలలో స్వామి పవళింపు సేవలో, ఉజ్వంలసేవలో పాడటం ఆచారంగా వస్తోంది.
శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధమైన శ్రీకృష్ణుడి జోలపాట (తాళాట్టు పాశురం) “మాణిక్కం కట్టి వయిరమిడై కట్టి”. దీనిని ద్వాపరయుగంలో యశోదా దేవి బాలకృష్ణుడిని ఊయలలో పడుకోబెట్టి పాడినట్లుగా, పెరియాళ్వార్ (విష్ణుచిత్తులు) అనుగ్రహించిన “పెరియాళ్వార్ తిరుమొళి” (నాలాయిర దివ్య ప్రబంధం) లోని మొదటి పత్తులో మూడవ తిరుమొళిగా ఈ పాశురాలు ఉన్నాయి. శ్రీవైష్ణవాలయాలలో మరియు ఇళ్లలో కూడా బ్రహ్మోత్సవాలు, ఊంజల్ (ఊయల) సేవ సమయాల్లో భగవంతునికి నిద్ర సేవ (పవళింపు సేవ) చేసేటప్పుడు ఈ పాటను తప్పక పాడతారు. తెలుగు లిపిలో ఈ జోలపాట (పాశురాల) పూర్తి సాహిత్యం మరియు వాటి సరళమైన అర్థం పరిశీలిస్తే భావస్పూర్తి హృదయానికి హత్తుకుంటుంది.
మొదటి పాశురంలో బ్రహ్మ దేవుడు పంపిన ఊయల “మాణిక్కంకట్టి వయిరమిడైకట్టి
ఆణిప్పొన్నాల్ శైయ్ ద వణ్ణ చ్చిరు త్తొట్టిల్
పేణిఉనక్కు । పిరమన్ విడుతన్దాన్
మాణిక్కురళనేతాలేలో । వైయమళన్దానే తాలేలో॥”
తమిళంలో మాణిక్కంకట్టి పాశురాలు పది. మాణిక్కంకట్టి యావత్ భారత దేశంలోని దివ్య దేశాలలో ఉంజ్వల అంటే ఉయ్యాల సేవ సందర్భంగా పాడటం కనిపిస్తుంది. మొదట అర్ధం పరిశీలిస్తే “మాణిక్యాలను చెక్కి, మధ్యమధ్యలో వజ్రాలను పొదిగి, మేలిమి బంగారంతో చేసిన అందమైన చిన్న ఊయలను బ్రహ్మదేవుడు నీకోసం ఎంతో ప్రీతితో పంపించాడు. వామనుడి రూపంలో వచ్చి, త్రివిక్రముడవై విశ్వమంతా కొలిచిన ఓ కృష్ణా! జోలాలి… జోలాలి… అని నిద్రపోమ్మని కీర్తిస్తారు. వరుసగా పది పాశురాలు ఒక్కో అర్థాన్ని పరమార్థాన్ని సూచిస్తాయి. వాటిభావం ఇలా ఉంటుంది. శివుడు పంపిన కిలకిల లాడే ఆభరణం ఎద్దును వాహనంగా చేసుకున్న ఆ కపాలధారియైన శివుడు (ఈశ్వరడు) నీకోసం విలువైన రత్నాలతో, దానిమ్మ మొగ్గల వంటి పూసలతో కూర్చిన అందమైన మొలతాడును (కిలకిలలాడే ఆభరణాన్ని) పంపించాడు. లోకేశ్వరా! ఏడవకమ్మా, జోలాలి… జోలాలి…
నా స్వామి, శ్రీమహాలక్ష్మి నివసించే అందమైన వక్షస్థలము కలవాడు, తామరల వంటి పాదములు కలవాడైన ఆ కృష్ణుడి కోసం ఇంద్రుడు తానే స్వయంగా వచ్చి, కిలకిలలాడే మువ్వల పట్టీలను (కింకిణి) కానుకగా ఇచ్చి సంతోషంతో నిలబడ్డాడు. పద్మాక్షా! జోలాలి… జోలాలి…
ఆకాశంలో ఉండే దేవతలంతా నీకోసం కుడిచేతి శంఖం (వలంపురి శంఖం), పాదాలకు మువ్వలు, చేతులకు గాజులు, మొలతాడు, ఆభరణాలను తెచ్చి సమర్పించారు. ఎర్రటి కన్నులు కలిగి, నల్లటి మేఘంలా మెరిసిపోయే ఓ దేవకీ సింహమా! జోలాలి… జోలాలి…
భూదేవి (అవనియాళ్) తానే స్వయంగా వచ్చి, అచ్యుతుడైన నీకోసం బంగారు కత్తులు, బంగారు గాజులు, తలపై ధరించే ముత్యాల పాపిడిబొట్టు (చుట్టి), పాదాలకు బంగారు పూల పట్టీలను సమర్పించింది. పూతన అనే రాక్షసి విషపు పాలు తాగిన ఓ నారాయణా! ఏడవకు, జోలాలి… జోలాలి… ఈ విధంగా లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలందరూ శ్రీకృష్ణుడి వైభవాన్ని చూసి మురిసిపోతూ పంపిన కానుకలను వివరిస్తూ యశోదమ్మ పాడే అద్భుతమైన లాలిపాట ఇది. బాలకృష్ణుడి లీలలను అమితమైన వాత్సల్యంతో వర్ణించారు. ఆయన రాసిన “నాలాయిర దివ్య ప్రబంధం” లోని మొదటి పత్తులో (మొదటి భాగం) శ్రీకృష్ణుడి ఊయల పాటగా ఈ “తాలేలో” కీర్తన వస్తుంది. ఈ జోలపాటలో యశోదమ్మ (పెరియాళ్వార్) కృష్ణుడి కోసం ముక్కోటి దేవతలు తెచ్చిన కానుకలను వర్ణిస్తారు. బ్రహ్మ దేవుడు బంగారు గొలుసు, శివుడు దివ్యమైన ఆభరణం, ఇంద్రుడు ముత్యాల హారం, కుబేరుడు సుందరమైన పంచాయుధాలను బాలకృష్ణుడికి కానుకలుగా సమర్పించి, ఆయన ఎదుట చేతులు జోడించి నిలబడ్డారని ఇందులో వర్ణించబడింది. ప్రతి చరణం చివరన “తాలేలో” లేదా “అళేల్ అళేల్ తాలేలో” అంటే… ఏడవకు కన్నా, జోలపాడుతా నిద్రపో అని స్వామిని బుజ్జగిస్తూ సాగుతుంది. ఈ పాట వినడానికి ఎంతో మధురంగా, ప్రశాంతంగా ఉంటుంది.
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన “జో అచ్యుతానంద జోజో ముకుందా” కీర్తన తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన పరమ పవిత్రమైన జోలపాట. పెరియాళ్వార్ రచించిన “మాణిక్యం కట్టి” కూడా బహుళ ప్రాచుర్యం పొందినదే. కృష్ణయ్యకు జోలపాట పాడిన వాగ్గేయకారులు వేరువేరు శతాబ్ధాలు అయినా వాటి మాధుర్యం జనం (భక్తుల) మనస్సు దోచుకునే ఆధ్యాత్మిక మధురగీతాలు.

–వొద్దిపర్తి రామచంద్రమూర్తి , సీనియర్ జర్నలిస్టు

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *