గణపతి బప్పా.. గోలయా..!

వినాయకుడు చిరాగ్గా ఉన్నాడు. చాలా అసహనంగా ఉన్నాడు. కాసింత కంటే చాలా ఎక్కువ కోపంగా కూడా ఉన్నాడు. ఆయన చిరాకుకి… అసహనానికి… కోపానికి కారణం తెలియక వినాయకుడి వాహనం మూషికం కూడా మూతి మూసుకుని కూర్చుంది. వాళ్లిద్దరూ అలా కూర్చుని దాదాపు నెల రోజులు దాటింది.
పుట్టినరోజుకు బట్టలు కొనుక్కోమని పార్వతీ దేవి డబ్బులు కూడా ఇచ్చింది. తండ్రి శివుడు కూడా తల్లికి తెలియకుండా వేరేగా డబ్బులిచ్చారు. తమ్ముడు సుబ్రహ్మణ్యం కేకు తానే కొనాలని, తన సమక్షంలోనే కట్‌ చేయించి వేడుక జరపాలని ప్లానుల మీద ప్లానులు వేస్తున్నాడు. ఇదంతా ఆ ఇంట్లో నెల రోజుల నుంచే జరుగుతోంది. ఇంత జరుగుతున్నా వినాయకుడు ఎలియాస్‌ గణపతి మాత్రం ఆనందంగా లేడు.
తన పుట్టినరోజు పట్ల తలిదండ్రులు, సోదరుడు ఆనందంగా ఉన్నా తనకి మాత్రం లోలోపల భయంగా ఉండడాన్ని గణపతి జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజం చెప్పాలంటే తన పుట్టినరోజు జరుపుకునే నవ రాత్రుల కంటే ఇతర అన్ని రాత్రుళ్లు, పగళ్లు గణపతికి చాలా ఆనందంగా గడుస్తున్నాయి. ఇతర మాసాల్లో వచ్చే చవితి తిథి కూడా చాలా అంటే చాలా బాగుందనిపిస్తోంది. కానీ ఇదిగో ఈ భాద్రపద శుద్ధ చవితి వస్తోందంటేనే రెండు దశాబ్దాల నుంచి వినాయకుడికి ఉన్న ఆనందం కాస్తా ఆవిరైపోతోంది.
“తాను ఈ దైవలోకంలోకి ఎలా వచ్చాను… అ.. ఎలా వచ్చానూ” అనుకుంటూనే “తన పుట్టకని కూడా ఈ భూలోకులు మరిచిపోతున్నారా” అని బాధపడుతున్నారు.
తన తల్లి నలుగుపిండితో తయారుచేస్తే ఏనుగు తలకాయ అమర్చి తండ్రి ప్రాణ ప్రతిష్ట చేశారు కదా. మధ్యలో ఈ భూలోకులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తనను తయారు చేసి శరీరమంతా గాయాల పాలు చేసే హక్కు వీళ్లకి ఎవరిచ్చారు అసలు అని కూడా అనుకుంటున్నారు గణపతి. పైగా ఈ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ కారణంగా తన శరీరం పాడైపోతుందని వీళ్లు గ్రహించరేంటని కూడా గణపతి దిగులు పడుతున్నారు.
ఇక నా పేరుతో ఆంధ్రాలో అయితే వీధికొకటి, తెలంగాణాలో అయితే గల్లీకి ఒకటి చొప్పున్న లక్షలాది వివిధ రూపాలతో ప్రతిష్టిస్తూండడం కూడా తనకు నచ్చదని తెలియదా..! అని తనలో తానే అనుకుంటున్నారు విఘ్నూధిపతి.
ఆ మంటపాలలో లౌడ్‌ స్పీకర్ల గోల. ఈ మధ్య అయితే డీజే అంటూ కొత్త కొత్త సాంకేతిక స్పీకర్లు. అందులోంచి వచ్చే పాటలైతే మరీనూ. ఉదయం ఏ పదింటి వరకో నా గురించిన భక్తి పాటలు. ఇక అ తర్వాత నుంచి “అదేదో మడతపెట్టి” అని ఓ పాట… “నాటు నాటు.. ఘాటు ఘాటు” అని ఇంకో పాట వినిపిస్తున్నారు. ఏనుగు తలకాయ కదా.. అందుకని చెవులు కూడా అంత పెద్దవే. ఈ పాటలు, పెద్ద పెద్ద సౌండ్ల కారణం ఆ పాటలు విని విని చెవులు మరీ మరీ పెద్దవైపోతున్నాయి. “అర్థం చేసుకోరూ” అని కూడా వినాయకుడు తనలో తానే మదన పడి పోతున్నారు.
అన్నట్లు ఇంకోటి.. ప్రతి వినాయక మంటపం దగ్గరా ఓ పోలీసో, ఇద్దరో కాపాలా. మంటపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాపం పోలీస్‌ శాఖ చేసిన ఏర్పాటు అది. మంచి నిర్ణయమే. కానీ నాకైతే మాత్రం జైలులో పెట్టినట్లుగా ఉంది అని కూడా వినాయకుడు ఇదై పోతున్నారు.
ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప అని ప్రచారం ఒకటి. నా పుట్టినరోజు నాడు విఘ్నాధిపతిని కదా భక్తి ఉండాలి కాని ఈ పెద్ద విగ్రహాల గోలేంటి… గొప్పేంటి అని తమ్ముడు సుబ్రహ్మణ్యానికి చెప్పాలని నిర్ణయించుకున్నారు గణపతి.
నాకు ఉండ్రాళ్లంటే ఇష్టం కదా… కానీ ప్రతి పందిరిలోనూ లడ్డూ పెడుతున్నారు. అది కూడా పది రోజుల పాటు నా పక్కనే పెడుతున్నారు. దాని మీద ఈగలు వాలడం.. లడ్డూ చుట్టూ చీమలు తిరగడం తనకు చాలా కష్టంగా ఉందని కూడా తల్లి పార్వతికి చెప్పాలని ఉంది వినాయకుడికి.
మరో విషయం… ఆ పది రోజులు అలా ఉంచిన లడ్డూకి వేలంవెర్రి కాకపోతే వేలం పాటలేంటి. అది కూడా పోటీ పడి మరీ లక్షల్లో పాడి దక్కించుకోవడం ఏమిటి..! ఇదేమైనా బాగుందా అని కూడా పుట్టినరోజు పూట ఈ పరమ భక్తులను అడగాలనుంది గణపతికి.
అన్ని లక్షలు పెట్టి వేలంలో ఆ లడ్డూని కొనడం కంటే ఆ లక్షలతో పేదవారికెవరికైనా చదువుకో, పెళ్లిళ్లకో పదుగురికి ఇస్తే నేను ఆనందిస్తాను కదా అని తండ్రి శివుడితో చెప్పాలనుంది. ఇన్నాళ్లూ ఇలా చెప్పాలని ఉండడమే తప్ప చెప్పకపోవడం తప్పని తెలిసి ఈసారి చెప్పేయాలని కూడా నిర్ఱయించుకున్నారని దైవలోకం నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం.
లాస్ట్‌… బట్‌ నాట్‌ లీస్ట్‌ అన్నట్లు… ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలతో పర్యావరణాన్ని పాడు చేయడం మానడం లేదు. చివరికి తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకకుండా చేస్తున్నారు భక్తి పేరుతో అని విఘ్నేశ్వరుడికి అరవాలనుంది. నిమజ్జనం పేరుతో ఎక్కడ నీళ్లుంటే అక్కడ విగ్రహాలని వాటిల్లో వదిలేస్తున్నారు. మీ వినాశనాన్ని మీ చేతులతో మీరే కొని తెచ్చుకుంటున్నారని కూడా వినాయకుడు బాధ పడుతున్నారని ఆ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అకాలం కాకపోతే తాను పుట్టిన భాద్రపద మాసం ఎంత హాయిగా, చల్లగా, వర్షాలతో కళకళలాడుతూ ఉండాలి. ఎండలు ఎంత మండిస్తున్నాయో చూసుకోవడం లేదని కూడా గణపతి తెగ ఫీలైపోతున్నారు. పైగా దీనికి “సెకండ్‌ సమ్మర్‌” అని కొత్త పేరు పెట్టుకుని ఆనందపడడం వినాయకుడికి సుతారాము ఇష్టం లేదంటే నమ్మండి.
నిజానికి ఒక్క వినాయకుడికే కాదు సమస్త దేవుళ్లు, దేవతలు అందరూ ఈ విషయంపైనే తల్లడిల్లుతున్నారన్న సంగతి భోలోక వాసులకే తెలియడం లేదు.
దైవలోకం నుంచి అన్నీ చూస్తున్నారు. చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఓపిక పడుతున్నారంతే… దేవుళ్లు, దేవతలకి కనుక కోపం పెరిగిందా మానవుల పని ఓసారి చూడమని ప్రకృతికి చెబుతారు. ఇక మిగిలిన సంగతి ఆ ప్రకృతే చూసుకుంటుంది. నేపాల్‌లో చూసుకోలేదు. మానవులు తమ మతి మార్చుకోకుంటే… “సమయం మించిపోయింది మిత్రమా” అని ప్రకృతి పిలుపునిస్తుంది. ఇది ఖాయం. మారాల్సింది మానవులే. మారండర్రా అంటున్నది దేవుళ్లే.
వినాయక చవితి శుభాకాంక్షలతో…

-ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, 99120 19929 @ విశాలాంధ్ర ‘చక్రవాకం’ కాలమ్ నుంచి *

–చిత్రం – శ్రీరామ్

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *