జాతీయ స్పూర్తి కలిగించే వినాయక ఉత్సవాలు

పూనా హల్వాయి గణపతి

** పరిఢవిల్లుతున్న భక్తి ` ఆధ్యాత్మికత**

దేశంలో పండుగ వాతావరణం అలుముకుంది. ఊరూ వాడా ఒక్కటై అన్ని ప్రాంతాలలో గణనాధుడు కొలువుతీరడానికి ఏర్మాట్లు వైభవంగా చేస్తున్నారు. భారతదేశం అంతటా గణేశ చతుర్థిని ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు, కానీ మహారాష్ట్రలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ గణపతి బాప్పా ఆగమనాన్ని ఇళ్లలోనూ, బహిరంగ ప్రదేశాలలోనూ వేడుకగా జరుపుకుంటారు. పది రోజుల పాటు సాగే ఈ గణేశోత్సవం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథినాడు ప్రారంభమవుతుంది. సాధారణంగా గృహాలలో ఉదయం గణేశ చతుర్థిని జరుపుకుంటారు. గణేశుని జననం మధ్యాహ్న వేళ జరిగిందని పురాణ ప్రవచనం. ఈ క్రమంలో అంటే రోజులో మధ్య భాగంలో గణేశ విగ్రహ ప్రతిష్ఠ చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అనంత చతుర్దశి నాడు గణపతి నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. నిమజ్జన ఉత్సవాలు 1, 3, 5,7,10 రోజులలో చివర అనంత చతుర్ధి రోజున జరుగుతాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలోనే గణేశ్ ఉత్సవాలు మొదటిసారిగా ఒక సామూహిక ప్రజా ఉత్సవంగా ప్రారంభమయ్యాయి. ప్రజలలో ఐక్యతను, సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించడానికి 17వ శతాబ్దంలో (1600లలో) పూణేలో ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. వినాయకుడు పేష్వాల కులదైవం కావడంతో వారి కాలంలో కూడా ఇది మరింత వైభవంగా సాగింది. బ్రిటిష్ వారి కాలంలో ఈ సంప్రదాయం కాస్త మరుగైంది. ఆ తర్వాత, స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడానికి 1893లో ఈ గణేశ్ ఉత్సవాలను “సార్వజనిక్ గణేశోత్సవం” (బహిరంగ ఉత్సవాలు) గా మార్చి, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పునఃప్రారంభించారు. అదేవిధంగా తిలక్ గారే 1894-1895లో శివాజీ మహారాజ్ జ్ఞాపకార్థం “శివాజీ ఉత్సవాన్ని” కూడా ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు రాజకీయంగా ఒకచోట చేరడాన్ని, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించింది. దీనిని అధిగమించడానికి కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితమైన వినాయక చవితి పూజలను, 1893లో పూణేలో వీధుల్లోకి తెచ్చి “సార్వజనిక్ గణేశోత్సవం” (బహిరంగ ఉత్సవాలు)గా మార్చారు. ఈ పది రోజుల ఉత్సవాల్లో కేవలం పూజలే కాకుండా దేశభక్తి గీతాలు ఆలపించడం, నాటకాలు వేయడం మరియు స్వాతంత్య్ర కాంక్షను రగిల్చే ప్రసంగాలు చేయడం వంటివి జరిగేవి.ఈ ఉత్సవాల ద్వారా దేశంలో జాతీయవాదం పెల్లుబికింది. వినాయక ఉత్సవాల్లో కూడా స్వదేశీ మట్టి విగ్రహాలనే వాడాలని ప్రోత్సహించారు. నాటి స్పూర్తి నేటికీ కొనగుతున్నది. వివిధ రకాలైన కెమికల్స్, ఇతర పదార్థాలతో తయారవుతున్న వినాయక విగ్రహాలు చూపుకు ఆకర్షణీయంగా కనిపించినా అవి చెరువులు, కుంటలు, నదులలో నిమజ్జనం చేయడం తలెత్తుతున్న కాలుష్య సమస్యను నివారించడానికి వీలుగా మట్టివిగ్రహాలనే వాడాలని దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ప్రజలు ఆచరిస్తున్నారు.

“గణపతి బప్పా మోరియా” అనేది వినాయక చవితి వేడుకల్లో విరివిగా వినిపించే అత్యంత ప్రసిద్ధ నినాదం
మోరియా’ వెనుక కథమోరియా గోసావి అనే భక్తునికి సంబంధించినది. 14 లేదా 15వ శతాబ్దంలో మహారాష్ట్రలోని పూణె సమీపంలోని చించ్‌వాడ్ ప్రాంతంలో మోరియా గోసావి అనే గొప్ప గణేశ భక్తుడు, సాధువు ఉండేవాడు. వినాయకుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచి తరించాడు. గణేశుడిపై ఆయనకున్న అంకితభావానికి గుర్తింపుగా, భగవంతుడు ఆయన పేరును తన నామంతో పాటు నిలిచేలా వరం ఇచ్చాడని నమ్ముతారు. ఇలా గణపతి ఉత్సవాల్లో గణేశుడితో పాటు మోరియా నామన్ని కూడా కలిపి ‘గణపతి బప్పా మోరియా’ అని పిలవడం ఆచారంగా మారింది. ఇది కాలక్రమేణా మరాఠీ సంస్కృతి నుండి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
దేశంలో అత్యంత భారీగా విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించే వాటిని పరిశీలిస్తే భాగ్యనగరం హైదరాబాద్ ఆ జాబితాలో కనిపిస్తుంది. దేశంలోనే ఎత్తైన గణేశ విగ్రహం ఖైరతాబాద్ ప్రతి సంవత్సరం ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి యేటా దీని bత్తు పెరుగుతోంది. తెలంగాణలో పలు చోట్ల వినాయకునికి సమర్పించిన లడ్డూను నిమజ్జనంకంటే ముందు వేలంవేయడం జరుగుతోంది. లడ్డూను వేలంద్వారా గెలుచుకున్నవారు వాటిని ఆత్మీయులకు వితరణ చేస్తారు. తమ పంటలు వ్యాపారాలు పెరగుతాయన్న విస్వాసంతో భూములలో చల్లడం ఆచారంగా వస్తోంది. హైదరాబాద్ బాలాపూర్ ఇందుకు ఉదాహరణగా పేర్కోనవచ్చు.

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఆకట్టుకునేలా 2026 గణేష్ ఉత్సవాలకోసం సుమారు 70 అడుగులఎత్తులో నిలబడుతోంది. ఏటా ఏర్పాటు చేస్తున్న ఈ వినాయకునికి ప్రత్యేకత ఉంది. దీనిని పంచముఖ సంకటహర మహా గణపతి అని వ్యవహరిస్తున్నారు ఎందుకంటే దీనికి ఐదు ముఖాలు మరియు ఆరు చేతులు ఉంటాయి. విగ్రహం కుడివైపున 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిరూపం అదేవిధంగా ఎడమవైపున కాళికా మాత ప్రత్యేక ఆకర్షణ. ఐదు రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది కళాకారులు పర్యావరణ అనుకూలమైన పదార్థాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. ======

దేశంలోనే అతిపెద్ద గణేశోత్సవం మహారాష్ట్ర ముంబైలో లాల్బాగ్‌చా రాజా సిద్దివినాయక్ ఆలయం వద్ద జరుగుతుంది. అదేవిధంగా పుణేలో 1893లో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన ప్రదేశంలో కూడా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
పూణే నగరానికి శ్రీమంత్ దగడుషేత్ హల్వాయి గణపతి ఒక గొప్ప గౌరవ చిహ్నం . ప్రతి సంవత్సరం భారతదేశం నలుమూలల నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇక్కడికి వచ్చి గణేశుడిని పూజిస్తారు. నేడు, శ్రీమంత్ దగడుషేత్ హల్వాయి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలవడమే కాకుండా, ‘శ్రీమంత్ దగడుషేత్ హల్వాయి సార్వజనిక్ గణపతి ట్రస్ట’ ద్వారా సామాజిక సంక్షేమం మరియు సాంస్కృతిక అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ఒక సంస్థగా కూడా సేవలందిస్తోంది.
గోవా కుటుంబ, గ్రామస్థాయి ఉత్సవాలు జరుగుతాయి. వీటిని ‘చావత” పేరుతో వ్యవహరిస్తారు. తమిళనాడు విషయానికి వస్తే చెన్నై వినాయక చతుర్థి పేరుతో ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా పర్యావరణ సందేశాలకు అత్యధిక ప్రాధాన్యత కనిపిస్తుంది.
కర్ణాటకలోని బెంగళూరులో సంగీత-సాంస్కృతిక ఉత్సవం కచేరీలకు అత్యధిక ప్రాధాన్యత కనిపిస్తుంది. రాజస్థాన్ కోటాలో ఖడే గణేశ్ జీ ఆలయం, మనోకామ్నా మందిరంలో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ. అదేవిధంగా
గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద ఉత్సవం సూరత్‌లో సర్కార్ గణేశ్ ఉత్సవం జరుగుతుంది. ఇలా దేశ వ్యాప్తంగా ప్రతి గణేశ్ మండపానికి ప్రాధాన్యత కనిపిస్తుంది. కులమతాలకు అతీతంగా జాతీయ స్పూర్తితో భక్తిఉద్యమానికి తలమానికగా నిలుస్తున్న వినాయక ఉత్సవాలను భారతీయులు విదేశాలలో ఆడబరంగా జరుపుకుంటారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో, ఆస్ట్రేలియాలోని వివిధ ప్రదేశాలలో, లండన్‌తో పాటు యూరప్‌లోని వివిధ దేశాలలో వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

–వి. రామచంద్ర మూర్తి, సీనియర్ జర్నలిస్టు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *