


**
సూరిబాబు అలియాస్ సూర్యనారాయణ, సత్తిబాబు అలియాస్ సత్యనారాయణ ఇద్దరూ ఎప్పుడూ కెమెరాలు పట్టుకుని రామకృష్ణా బీచిలోనే తిరుగుతూ ఉంటారు. టూరిస్టులకి ఫోటోలు తియ్యడం, రీల్సు చెయ్యడం వారి వృత్తి, ప్రవృత్తీ కూడా.
మొన్నోరోజు వాళ్లిద్దరూ బీచికి వెళ్లేసరికి అక్కడ పోలీసులు జనాన్ని రాకుండా కట్టడి చేస్తున్నారు. ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా, బోసిపోయి కనిపించింది. “ఏదో తేడా కొడుతున్నాదిరా సూరిగా!” అన్నాడు సత్తిబాబు. అవునన్నాడు సూరిబాబు. అక్కడ బాగా తెలిసిన పోలీసుని అడిగితే, కాసేపట్లో చంద్రబాబు గారు బీచిని పరిశీలించడానికి వస్తున్నారని చెప్పాడు. రీల్స్ చెయ్యడానికి మంచి కంటెంటు ఉంటుందని ఇద్దరూ సరదా పడ్డారు.
“సార్, సార్..మమ్మల్ని అక్కడి పోనిస్తే మేం బాబు గారి విజువల్స్ తీసుకుంటాం సార్!”అని వారు పోలిసుని ప్రాధేయపడ్డారు. “సీఎం గారితో ఎలాగూ పెద్ద కెమేరా బ్యాచే ఉంటుంది, మీరు వాళ్లతో కలిసిపొండి”అని ఆ పోలీసు అనుభవజ్ఞుడిలా సలహా ఇచ్చాడు. ఎగిరి గంతేశారిద్దరూ.
ఈలోగా కొందరు మున్సిపల్ వర్కర్లు యూనిఫారాలేసుకుని వచ్చారు. వచ్చీరాగానే వారి దగ్గరున్న సంచీలోంచి కాయితం ముక్కలు, ప్లాస్టిక్ కవర్లు, నానా చెత్త తీసి బీచిలో ఇసక మీద పడేశారు. “ఏంట్రా ఇది సత్తిగా, సుబ్బరంగా ఉన్న బీచిలో చెత్త అలా ఏసేస్తున్నారేటి?” అన్నాడు సూరిబాబు.
“అంటే, బాబు గారు ఇప్పుడొస్తారన్నమాట.. చీపురట్టుకుని బీచిని క్లీన్ చేస్తారన్నమాట!”.
“స్టార్ట్ కెమెరా..యాక్షన్” అని చెప్పడానికి అక్కడ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఉన్నాడేమోనని ఇద్దరూ వెతికారు కాని ఆయన కనిపించలేదు.
సత్తిబాబు చెప్పినట్టే చంద్రబాబు గారు కుడి ఎడమల కెమెరాల్ ధగ ధగ మెరయ బీచిలో అడుగుపెట్టారు. వస్తూనే ఇసక మీద చెత్తని చూసి,కళ్లెర్ర చేసి “ఏమ్, గాడిదలు కాస్తున్నారా? ఇక్కడ ఈ చెత్తేంటి?” అని వర్కర్లకి క్లాసు పీకుతారని సూరిబాబు ఆశపెట్టుకున్నాడు గాని చంద్రబాబు వారితో కబుర్లేసుకున్నారు. చంద్రబాబుకి ఇవ్వడానికి వర్కర్లు సరికొత్త పొడుగాటి చీపుర్ని రెడీగా పట్టుకున్నారు. చంద్రబాబు ఆ చీపుర్ని తీసుకుని సుతారంగా తుడవడం మొదలుపెట్టారు.
” ఇంకా నయం, బీచ్ షాక్స్ మొదలయి ఉంటే ఖాళీ బీరు బాటిల్సు కూడా దొరికేవి” జనాంతికంగా అనుకున్నాడు సత్తిబాబు. ఆస్థాన వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు టకటకమని తమ పని పూర్తి చెయ్యగానే ‘స్వచ్చ భారత్’ పనిని వర్కర్లకి అప్పగించి చంద్రబాబు బయల్దేరారు.
“లొకేషన్ చేంజ్” అనుకున్నారు సత్తిబాబు, సూరిబాబు.
**
బీచ్ లో, సముద్రం బ్యాక్ డ్రాప్ లో అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక మురీ మిక్స్చర్ బండి కనిపించింది సత్తిబాబు, సూరిబాబులకి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ‘ఒంటి కాయ, శొంఠి కొమ్ము’లా ఒక మహిళ, ఒకే ఒక్క మురీ మిక్స్చర్ బండి కనిపించేసరికి వారికి ఆశ్చర్యం వేసింది.
చంద్రబాబు అటువైపు అడుగులు వేశారు. కెమెరామన్ల బ్యాచితో పాటు వీరు కూడా ఆయన్ని అనుసరించారు. చంద్రబాబు ఆమెని పలకరించారు.
“ఏంటమ్మా, బావున్నావా? ఏం చేస్తున్నావిక్కడ?”
ఆ మహిళ మొహం చింకి చాటంత అయింది. ” మా దగ్గర చాట్ మసాలా ఉంటుంది, మురీ మిక్స్చర్ ఉంటుంది. మా దగ్గర ఫేమస్ సార్ మురీ మిక్స్చర్..ఆర్కే బీచ్ కి వచ్చేవారంతా మొక్కజొన్న పొత్తులు, మురీ మిక్స్చర్ తీసుకుంటారు సార్!” గడగడ వల్లించింది.
” ఏదమ్మా నాకో ప్లేట్ ఇయ్యి..ఎక్కడి నుంచి వస్తావమ్మా?”
ఆమె గబగబా మిక్స్చర్ కలిపి ప్లేటులో ప్రసాదం పెట్టినట్టు కొద్దిగా పెట్టి చంద్రబాబుకి ఇచ్చింది.” మాది ఇక్కడే, ఇక్కడికి దగ్గిరే సార్!”
చంద్రబాబు ఆ కొద్దిపాటి మిక్స్చర్ లో స్పూనులో పావు వంతు తీసుకుని, మళ్లీ అందులో ఇంకో పావు వంతు నోట్లో పెట్టుకుని నవులుతూ సంభాషణ కొనసాగించారు.
“ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావిది?”
“సార్, రెండు సంవత్సరాల నించి చేస్తున్నా..”
“ఎన్ని గంటలు పని చేస్తారమ్మా?
“సార్, మధ్యాన్నం రెండు గంటలకి వస్తాన్సార్..తొమ్మిది గంటలకి వెళ్లిపోతాన్సార్!”
“ఎన్ని ప్లేట్లు అమ్ముతున్నారు రోజుకి?”
“రోజుకి ఐదొందలు అమ్ముతాం సార్..శని ఆది వారాల్లో రెండు వేలు మూడు వేలు అమ్ముతాం సార్!”
“ఎంతమ్మా, రేటెంతన్నారు?”
“మురీ మిక్స్చర్ అయితే ప్లేటు ముప్పయ్ రూపాయలు సార్..”
వింటున్న సత్తి, సూరి బాబులకి మతిపోయింది. మనసులోనే స్పీడుగా లెక్కలు కట్టేశారు. “రోజుకి ఐదొందల ప్లేట్లు అంటే పదిహేనువేల రూపాయలు..శని, ఆదివారాల్లో మూడు వేలు అంటే సుమారు తొంభయ్ వేల రూపాయలు..” వాళ్లకి గాభరా ఎక్కిపోయి లెక్కపెట్టడం మానేశారు.
“మాయ్యా..మనం కూడా ఇలాంటి బండి పెట్టేసుకుందామేటి” అన్నాడు సత్తిబాబు. “నోర్ముయ్యెహే..ఆవిడ పొరపాట్న అలా చెప్పింది గానీ ఆ వందలూ, వేలూ ప్లేట్లు లెక్క కాదు, అది డబ్బుల్లెక్క.. పెద్దాయన ఏదో అడుగుతున్నాడు. విను, విను” కసిరాడు సూరిబాబు.
“ఎంత మీకు గిట్టుబాటు అవుతుందమ్మా?”
“బిజినెస్ ఉన్న రోజుల్లో పర్వాలేదు సార్, వర్షాకాలమైతే ఇబ్బంది సార్.. బేరాలుండవు సార్!”
“ఎల్ నినో వల్ల మనకి వర్షాలుండవులే..పండగ చేస్కో” గొణుక్కున్నాడు సూరిబాబు.
” ఇంట్లో వాళ్లేం చేస్తారమ్మా?”
” పిల్లలిద్దరికీ పెళ్లిళ్లయిపోయాయి. ఇంటర్ వరకు చదువుకున్నారు.”
“మీ హజ్బెండు…?
“లేరు సార్.. డైవర్సు అయిపోయింది” నసుగుతూ చెప్పింది.
“పిల్లలు సెటిలయ్యారా అమ్మా?”
“లేదు సార్, సాయంత్రం అయ్యేసరికి ఈ మురీ మిక్స్చర్ బండి దగ్గిరకే వస్తారు సార్.. ఎలా ఉంది సార్ టేస్టు చెప్పలేదు..”
“చాలా బావుందమ్మా..” అని చంద్రబాబు ప్లేటు ఆవిడకి ఇచ్చి “ఇదిగో కలెక్టర్..” అని పిలిచారు. “ఈ అమ్మాయికి ఒంటరి మహిళ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి” అని ఆదేశాలు జారీ చేసి బయల్దేరారు.
” ఇన్ని ఆరాలు తీసిన పెద్ద మనిషి మీ ఇంట్లో, మీ వీధిలో నీళ్ల ప్రాబ్లం ఉందా అని కూడా అడిగి ఉంటే బావుండేది..తేరే మేరే ‘బీచ్’ మే కైసా హై యే బంధన్ అంజానా..” అని పాడుకుంటూ సత్తిబాబు, సూరిబాబు కూడా బయల్దేరారు.
***
ఆ రోజు రాత్రి సూరిబాబుకి ఓ కల వచ్చింది. ఆ కలలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫోన్ చేశారు. ఇద్దరూ ఇంగ్లీషు, హిందీలో మాట్లాడుతుంటే సూరిబాబు కళ్ల ముందు తెలుగులో సబ్ టైటిల్సు పడుతున్నాయి.
నరేంద్ర మోదీ: “హలో, చంద్రబాబు గారూ, బాగున్నారా? మొన్న విశాఖపట్నం బీచిలో మీరు జరిపిన పర్యటన తాలూకు వీడియో చూసి, నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను.
చంద్రబాబు: ధన్యవాదాలు మోదీ గారూ! ఆ వీడియో మీరు చూసినందుకు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది.
నరేంద్రమోదీ: నిన్ను చూస్తుంటే నాకు కూడా భలే సంతోషంగా ఉందయ్యా.. నిజం చెప్పాలంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందనుకో!
చంద్రబాబు: అవును సార్.. నేను ఈ మధ్య నేను మిమ్మల్నే ఫాలో అయిపోతున్నానని, ఆ విధంగా ముందుకుపోతున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
నరేంద్రమోదీ: ముఖ్యంగా నువ్వు బీచిలో మురీ మిక్స్చరు తింటున్న సీను చూస్తుంటే, ఆ మధ్య నేను బెంగాల్ లో రోడ్డు పక్క స్టాలులో ఝల్మురీ తిన్న సీను గుర్తొచ్చింది.
చంద్రబాబు: అవును మోదీగారూ..మీరు ఝల్మురీ తిన్న వీడియో నేను కూడా చూశాను. అప్పట్నించీ నేను కూడా అలాగ రోడ్డు పక్క ఏదయినా చిరు తిండి తింటూ వీడియో దిగాలని తహతహలాడిపోయానంటే నమ్మండి.
నరేంద్రమోదీ: శభాష్ చంద్రబాబూ, నువ్వు నన్ను అలా అనుసరిస్తున్నావంటే నాకు చాలా గర్వంగా ఉంది.
చంద్రబాబు: మీరు ఇంకో విషయం గమనించారో, లేదో..నేను ఇది వరకు మీటింగుల్లో చివరికి ‘జై జన్మభూమి, జై తెలుగుదేశం’ అని నినాదాలిచ్చి ముగించేవాణ్ణి. ఇప్పుడు మీలాగా ‘భారత్ మాతాకీ జై!’ అని మూడుసార్లు గొంతు చించుకుని నినాదం ఇస్తున్నానని, ఆ విధంగా కూడా నేను ముందుకు పోతున్నానని ఈ సందర్భంగా మనవి జేసుకుంటున్నాను.
ఈలోగా సూరిబాబు కలలో ఓ పాత తెలుగు సినిమా పాట బ్యాగ్రౌండ్ లో వినిపించడం మొదలుపెట్టింది.
“నువ్వూ, నేనూ నడిచేది ఒకే బాట, ఒకే బాట..నువ్వూ నేనూ పలికేది ఒకే మాట, ఒకే మాట..ఆ బాట ఏనాడు తిరుగులేనిదీ, ఆ మాట ఏనాడు తీరిపోనిదీ…”
సూరిబాబు కల కరిగిపోయింది.
**
— మంగు రాజగోపాల్
(లీడర్ దినపత్రిక 24-09-26 సంచికలో ప్రచురితం)





