(గమనిక: ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం మరి కొంత’ అన్నట్టు ఇందులో పురాణ గాధ కొంత, సొంత జోడింపు మరి కొంత).
*****
కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు పాండవులకి అర్ధ రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత వారు ఇంద్రప్రస్థ పురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తూ పట్టపురాణి ద్రౌపదితో హాయిగా కాలం గడుపుతున్న రోజులవి.
ఒకరోజు నారద మహర్షి పాండవుల్ని చూడడానికి వెళ్లాడు. ధర్మరాజు ఆయనకి భక్తితో సకల ఉపచారాలు చేశాడు. అప్పుడు నారదుడు అశీర్వదించి “ధర్మరాజా.. మీ అందరి శ్రేయస్సు కోరేవాడిగా ఇప్పుడు మీకు ఒక కథ చెబుతాను. నువ్వూ, నీ సోదరులు, ద్రౌపది కూడా వినాలి” అని వారినందరినీ పిలిపించుకుని కథ చెప్పడం ప్రారంభించాడు.
.*******
“పూర్వం హిరణ్య కశిపుడి వంశంలో నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు, ఉప సుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. చిన్నప్పటినుంచి ఈ అన్నదమ్ములిద్దరూ ఒకరి పట్ల మరొకరు అత్యంత ఆప్యాయతానురాగాలతో, ప్రాణ స్నేహితులమాదిరిగా మెలిగేవారు. అపురూప శక్తులు, అమరత్వం పొందాలని వారిద్దరూ నిర్ణయించుకుని బ్రహ్మ దేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాళ్లని వరాలు కోరుకొమ్మన్నాడు. ఆ ఇద్దరు రాక్షసులు చేతులు జోడించి ” బ్రహ్మదేవా.. మేము కోరిన రూపాల్లో మారిపోవాలి, తలచిన వెంటనే మాయం, ప్రత్యక్షం కావాలి, ఆకాశంలో ప్రయాణం చెయ్యగలగాలి, మాకు ఎవరి వల్లా చావు రాకుండా అమరత్వం కలగాలి” అని విన్నవించుకున్నారు.
అంతవరకు చిరునవ్వుతో వింటున్న బ్రహ్మ ఆఖరి కోరిక వినగానే ఉలిక్కిపడ్డాడు.”మిగతా కోరికలు తీర్చగలను కాని ఆఖరి అమరత్వం కోరిక మాత్రం తీర్చలేను. మరణం రాకుండా ఆపలేను. అయితే మీకు మీరే మరణ కారకులు అవుతారు తప్ప అన్యులు ఎవరూ మిమ్మల్ని చంపలేరు” అని వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు.
ఇక అక్కడినుంచి సుందోపసుందులకి పట్టపగ్గాలు లేకుండా పోయింది. ప్రజల్నీ, మునుల్నీ, ఆఖరికి దేవతలని కూడా వదలకుండా పీడించసాగారు. దాంతో అందరూ బెంబేలెత్తిపోయి వారికి వరాలిచ్చిన బ్రహ్మ దేవుడి దగ్గరికి వెళ్లి, ఆ రాక్షసుల బారి నుంచి విముక్తి ప్రసాదించమని ప్రార్ధించారు.
అప్పుడు బ్రహ్మ తిలోత్తమ అనే అతిలోక సుందరిని సృష్టించి, ఇతరుల వల్ల చావు లేని సుందోపసుందులు ఒకరి చేతిలో మరొకరు హతమయ్యేలా చెయ్యమని ఆదేశించాడు. తిలోత్తమ భూలోకానికి వెళ్లింది.సుందోపసుందులు ఆమె అందానికి ముగ్ధులై మనసు పారేసుకున్నారు. ‘నన్ను పెళ్లాడు’ అంటే ‘నన్నే పెళ్లాడు’ అంటూ పోటీ పడ్డారు. ‘మీరిద్దరూ యుద్ధం చెయ్యండి. మీలో ఎవరు గెలిస్తే వారిని మనువాడతాను’ అని తిలోత్తమ తెగేసి చెప్పింది. దాంతో సుందోపసుందులిద్దరూ యుద్ధానికి దిగారు. ఒకరినొకరు రక్తాలు కారేలాగ కొట్టుకుని, చివరికి బ్రహ్మ వరాన్ని నిజం చేస్తూ ఇతరుల వల్ల కాకుండా ఒకరి చేతిలో మరొకరు చచ్చారు” అని నారదుడు కథ ముగించి చివరికి ఇలా అన్నాడు.
” ధర్మరాజా.. ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పానో గ్రహించే ఉంటారు. ఒకరి కోసం ఒకరు ప్రాణమిచ్చేటంత సఖ్యతగా, స్నేహంగా మెలిగిన అన్నదమ్ములు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకోడానికి మూల కారణం కేవలం ఒక స్త్రీ. ఎంతవారలయినా కాంత దాసులు కారాదని నిరూపించే కథ ఇది. మీ అన్నదమ్ములు ద్రౌపది విషయంలో అటువంటి పొరపాటు చెయ్యరనే నమ్ముతున్నాను”
ధర్మరాజు చిన్నగా నవ్వి ” నారద మునీంద్రా..మీరు చెప్పిన సుందోపసుందుల వృత్తాంతం జగద్విదితం. కానీ ఆ తర్వాత జరిగిన కథ మీ దృష్టికి రానట్టుంది. వారిద్దరూ చనిపోయాక ఏం జరిగిందో నేను చెబుతాను, వినండి” అంటూ కథని కొనసాగించాడు.
******
బాహా బాహీ యుద్ధంలో సుందోపసుందులిద్దరూ మరణించాక వారి ఆత్మలు జరిగిన మోసాన్ని గ్రహించి వేదనతో రగిలిపోయాయి. వెంటనే బ్రహ్మలోకాన్ని చేరుకుని బ్రహ్మ దేవుడిని నిలదీశాయి. ” దేవా..మీరు మాకు అమరత్వాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మా చేతిలో మేమే చచ్చేటట్టు చేశారు. ఇది అన్యాయం. అధర్మం ” అంటూ వాపోయాయి. బ్రహ్మదేవుడు సానుభూతితో అంతా విని “సుందోపసుందుల్లారా..చింతించకండి. నేను మీకు న్యాయం చేస్తాను” అన్నాడు.
” చచ్చిపోయినవాళ్లం మాకెలా న్యాయం చేస్తారు బ్రహ్మదేవా?” అని రాక్షస ఆత్మలు అడిగాయి.
“సావధానంగా వినండి. భౌతికంగా మీకు అమరత్వం లేకపోయినా మీ ఆత్మలకి మాత్రం అమరత్వం సిద్దిస్తుంది. యుగాలు మారినా, వేల సంవత్సరాలు గడిచినా మీ ఆత్మలు భూలోకంలో ప్రాణ స్నేహితుల మధ్యనే తిరుగుతుంటాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతూ ఉంటుంది. అక్కడ తరుచూ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి శత్రువుని జయించడానికి కొన్ని రాజకీయ పక్షాలు ఒక కూటమిగా పొత్తులు కడతాయి. ఇప్పుడు మీ మరణానికి కారణమైన పడతి అప్పుడు అధికార కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. మీ ఆత్మలు కూటమి పక్షాలను ఆవహిస్తాయి. ఆ ప్రభావంతో ఆయా రాజకీయ పక్షాలు అధికార వ్యామోహంలో పడతాయి. పాలనాధికారం కోసం వెంపర్లాడతాయి. పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి మిత్ర పక్షాలతో పేచీలు పడతాయి. వెన్నుపోట్లకి దిగుతాయి. మనుషుల్ని పీడించాలనే మీ కోరిక ఆ రకంగా నెరవేరుతూ ఉంటుంది.”
బ్రహ్మ మాటలు విన్న సుందోపసుందుల ఆత్మలు ఆనందంతో ఒక్క గెంతులో భూలోకానికి చేరాయి.
********
ధర్మరాజు కథ ముగించి ” నారద మునీంద్రా..త్రికాల జ్ఞానులయిన తమకు ఈ కథ తెలియదనుకోను” అన్నాడు.
“తెలుసు ధర్మరాజా.. మీకు ఎంతవరకు తెలియాలో అంతవరకే ఆ కథ నేను చెప్పాను. ఇక లోకానికి ఏం తెలియాలో ఆ మిగతా కథ నువ్వు చెప్పావు. శుభం భూయాత్..నారాయణ, నారాయణ” అంటూ నిష్క్రమించాడు నారదుదు.
— మంగు రాజగోపాల్
(లీడర్ దినపత్రిక 22-10-26 సంచికలో ప్రచురితం)






