
కోనసీమ. ఇప్పుడు గాయాల వనం. వనమంతా గాయాల కుప్ప. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం. కొబ్బరి తోటలన్నీ ఇలాగే కుప్పకూలిన దేహాలయ్యాయి. నమ్ముకున్న చెట్లే మరోసారి. ఇంకోసారి బతుకుల్ని బండబారేలా చేశాయి. ఇప్పుడు రోడ్లన్నీ ఆకుపచ్చని రంగు వేసినట్లుగా మారాయి. ఆర్నాబ్. సరిగ్గా మూడు రోజుల క్రితం బాలసారె జరుపుకున్న బీభత్సం పేరు. చుట్టూ నీళ్ల తోటలతో నిండిపోయిన లంకల సెలయేరు మా కోనసీమ. వందల కిలోమీటర్ల వరకూ వ్యాపించిన మృత్యువు నీడ. వెంటాడుతున్న భయం వాసన. ఇది మానవులనే వెంటాడే మరణం కాదు. పచ్చదనాన్ని వేళ్లతో సహా పెకిలించిన శ్మశానం. ఒకటి, రెండు, మూడు, ముఫ్ఫై మూడు వేల మృతదేహాలు. మనుషులవి కాదు. కొబ్బరిచెట్లది ఈ లెక్క. చెట్లకి ఓట్లు ఉంటాయా..! ఉండే ఉంటాయి. బహుశా పరిహారం రూపంలో ఓట్ల కొనుగోలు జరుగుతుందేమో..! పిల్లలున్నా… లేకపోయినా మా కోనసీమలో ప్రతి ఇంటా కొబ్బరి చెట్టే పెద్ద కొడుకు. ఆకుపచ్చని చీర కట్టుకుని పచ్చి గాలికి వయ్యారాలు పోయే వరి చేలు మా ఆడపడుచులు. ఆకలి తీర్చే అన్నా, చెల్లెళ్ల మధ్యలోకి ఆర్నాబ్ పేరుతో శత్రువు రాక. గుర్తించారు. గమనించారు. గమనంలో ఉంచుకోమన్నారు. భూమి అంటే డబ్బా. ఇనప్పెట్టెల్లోనూ, బ్యాంకుల్లోనూ దాచుకుందుకు. కాగితాలుగా మార్చుకున్న షేర్లలా బీరువాల్లో బందించేందుకు. మాకే కాదు ఎక్కడైనా భూమి అంటే తల్లి. తండ్రి. ఆదరించే బంధువు. అక్కున చేర్చుకునే స్నేహితుడు. ప్రతీ ఏటా ఆ తల్లి గాయపడుతోంది. ఆ తండ్రి తల్లడిల్లుతున్నాడు. ఆ బంధువు గుండె బరువెక్కుతోంది. ఆ స్నేహితుడు కన్నీరవుతున్నాడు.
నిన్న ఉదయం నవ్విన అరటి పువ్వు. నిన్న సాయంత్రం విరగకాసిన కొబ్బరి పువ్వు. పసిపాప నవ్వుల్లా గాలికి ఊగే వరి పొలాలు. ఇప్పుడేవి!. ఎక్కడా కానరావేం!.
మా వెటకారాలకి మీరు నవ్వుకుంటారు. మా పెదవుల నుంచి జారే మాటలకు మీరు తుళ్లి పడుతూంటారు. మా ఆప్యాయతలకు మురిసిపోతూంటారు. “ఆయ్… కాళ్లు కడుక్కుని లోపలికి రండి” అన్న మా ఆహ్వానాలకి సంబర పడిపోతూంటారు. ఇప్పుడు దృశ్యం మారింది. మా కాళ్లన్నీ నీళ్లలోనే ఉన్నాయి. మీకు కళ్ల నుంచే నీళ్లు వస్తాయి. మాకిప్పుడు దేహమంతా నీటి పుట్ట. వేళ్లు వేదనవ్వడం ఇక్కడే చూస్తారు. వరి దుప్పులను ఎత్తుకున్న భుజాలు వర్షపు ధారలు కావడం మీకెక్కడా కానరాదు. కొబ్బరి కాయలు కోసే కత్తులకు కన్నీళ్లు మొలుస్తాయి. అరటి గెలలు మోసుకొచ్చే సైకిళ్లు సైక్లోన్ రాగాలవుతాయి. కంద పిలకలను కత్తి పీటలతోనే కోయాల్సిన అవసరం లేదు. అవి ఇప్పుడు అంతర్ పంట కానే కాదు. మా రైతుల అంతర్లోకాల శోక సంద్రంలో తేలియాడుతున్న బహిర్ పంటలు.
తాగేందుకే కాదు… స్నానమాడేందుకే కాదు… ఇతరేతర ఏ అవసరానికైనా కాదు… నీళ్లు ఇప్పుడు కొత్త రూపంతో వికటాట్టహాసం చేస్తున్న ఖూనీకోరు. గాలి ప్రాణాలను కాపాడే సహజ వనరు కానే కాదు. ముక్కుపుటాల నుంచి వచ్చే ఉచ్వాశ నిశ్వాసమూ కాదు. గాలి చిరు గాలి సంగీతం అస్సలు కాదు. గాలి గాల్లోనే మమ్మల్ని వీధి పాలు చేస్తున్న ఓ సంచారి. అయినా కోనసీమోళ్లం కదా… మనుషుల పట్ల…. ప్రకృతి పట్ల…. ప్రపంచం పట్ల ప్రేమ ఉన్నోళ్లం కదా. అందుకే… ఇందుకే… తిరిగి తిరిగి నీటితోనే జీవిస్తాం. గాలితోనే సంచరిస్తాం. మేం పులస చేపలకే కాదు… పులిసిపోయిన దేహాలకి ప్రసిద్ధి.
చుట్టూ నీళ్లున్న అందమైన కోనసీమ. ఇదిగో ఇలా అప్పుడప్పుడు
కళ్లల్లోంచి గోదావరిలా వొలుకుతోంది. సంక్రాంతి వస్తోంది. ఈలోగా తేరుకుంటాం. తమాయించుకుంటాం. తంటాలు పడతాం. ఈ నేటి కష్టం చూసి పండగకి రావడం మానేయకండి. కోనసీమోళ్లం కదా… కడుపులో దాచుకున్నదే మీకూ ఇంత పెడతాం. మా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం. మీరు మాకేం చేయనవసరం లేదు. మా కన్నీళ్లని మీ తువ్వాళ్లతోనూ, చీర చెంగులతోనూ తుడవండి. మేం నవ్వేస్తాం. ఆయ్… నవ్వించేస్తాం. వస్తారు కదూ… !
ముక్కామల చక్రధర్, సీనియర్ జర్నలిస్ట్, 99120 19929
‘చక్రవాకం’ 31-10-2026





