
మాసానాం మార్గ శీర్షం గీతకారుడు శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు. వనంలో విరబూసిన ప్రతి కుసుమం ఎలా పరిమళిస్తుందో కాలం నుండి ఊపిరి పోసుకున్న ప్రతి క్షణం భగవంతుని రూపాలే అన్ని మాసాలకు విలువ ఉన్నా హరిహరాదులకు ఆరాద్యమైన కార్తీకానికి ప్రత్యేకత ఉంది కార్తీకం శివయ్య మాసంగా భావించడం విశేషం. సాధారణంగా ప్రకృతి చెంత శీతల గాలులు తనువుకి హాయి స్పర్శనిస్తూ మంచు తెరలు సూర్యోదయానికి అడ్డుగా ఉండి వెండి సింగారంలా ఉన్న సౌందర్యం శీతలానికే సొంతం. ఆ సమయంలో ప్రతి హృదయం భక్తికి తెరచిన ఉదయం అయి స్వాగతిస్తుంది. ఉషస్సు కన్నా ముందే మంత్రపుష్పాలు , అభిషేక జలాలు, కుసుమ కాంతుల పరిమళ దృశ్యం. ఇవన్నీ శివపార్వతుల చెంత చేరి తరించే సమయం కార్తీకం. ఆవేశకావేశాలకు దూరంగా సాత్వికమైన మనస్సు దైవ చింతన సందర్శనాలతో ఒక విధమైన ఆధ్యాత్మిక భావతరంగం కార్తీకంలో తప్ప మరెక్కడా కనబడదు.
దీపావళి వెలుగుల పండగ. అర్దరాత్రి వరకు సందడి చేసి కాలం తెరలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కార్తీకం అడుగులు వేస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు రావడం గొప్ప విషయం. కార్తేకం అంతా పర్వదినాలతో నిండిపోతుంది. సాధారణంగా కార్తీకంలో నాలుగు లేదా ఐదు సోమవారాలు వస్తాయి. అందరూ సోమవారాలలో ఉదయం నుంచి నక్షత్ర దర్శనం జరిగే వరకు ఉపవాసదీక్ష చేస్తారు. పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి ప్రతి గ్రామంలో శివాలయం భక్త జన సందోహంతో ఉండటం గమనార్హం. కార్తీకంలో ఇంకా అనేకానేక ప్రత్యేకతలు దాగి ఉన్నాయి.
కార్తీకమాసంలో నాగుల ఆరాధన జరిపే నాగుల చవితి , అన్నా చెల్లెళ్ళ అనుబంధాల 'యమద్వితీయ' వెంటనే వస్తాయి. కార్తీకంలో వెన్నెలకు చరిత్ర ఉంది. పున్నమి నిండుగా మెరిసే రేయి.అది. కార్తీక పౌర్ణమిగా వచ్చిన కాలం. అమ్మగారి సౌభాగ్యం కోసం జ్వాలాతోరణంగా దీపకాంతులతో అలంకరిస్తారు. క్షీరాబ్ధి ఏకాదశి నాడు.ఉసిరిచెట్టుని పూజిస్తారు. శ్రీహరి సేవనం మరీ మరీ విశేషం. కార్తీకమాసంలో మాస శివరాత్రికి మహాశివరాత్రికి ఉన్నంత ప్రాధాన్యత ఉంది. ఆ ఒక్క రోజు ఉపవాసం ఆచరిస్తే నెల అంతా ఉపవాసం ఉన్న ఫలితం చేకూరుతుంది. కార్తీకం అనగానే కొందరికి భక్తిభావం పొంగుతుంది. మిగతా రోజులలో ఒక్కసారి దేవాలయ సందర్శన చేసుకొని వారు సైతం కార్తీకమాసం అని పదే పదే ఉచ్ఛరిస్తారు. ఇది విమర్శగా భావించరాదు. భక్తి అనేది నిరాడంబరంగా , నిర్మలంగా
ఉండాలి. కార్తీకమాసం భక్తికి ప్రతిరూపం అనేది ఎవరూ కాదనలేరు. ప్రతి ఒక్కరూ పవిత్ర హృదయంతో ఆడంబరాలకు దూరంగా మారేడు పత్రిని ఇచ్చినా శివయ్య కరుణిస్తాడు. కార్తీకమాసం భక్తిభావనకు నిలయం.
–– డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు, 99490 39175





