వైభవంగా శ్రీవారి పుష్పయాగం

తిరుమలలో సోమవారం 16వ తేదీన శ్రీవారి పుష్పయాగం వైభవంగా జరిగింది. భూమిపై ప్రాకృతిక విపత్తులు భూకంపాలు, తుఫానులు, వ్యాధులు ప్రబలకుండా, సమస్త మానవాళిని, ప్రకృతిని, జీవకోటిని కాపాడాలని కోరుకుంటూ ఆగమశాస్త్రం ప్రకారం ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. 15వ శతాబ్దంలో ప్రాచుర్యంలో ఉన్న ఈ సంప్రదాయాన్ని టీటీడీ 1980లలో తిరిగి పునరుద్ధరించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలో స్వామివారి జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసారు. 15వ శతాబ్దం తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి లోక కళ్యాణార్థం టీటీడీ పునరుద్ధరించింది.
శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం చేసారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం కన్నుల పండువగా జరిగింది. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగించారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. పుష్పయాగం టికెట్ పొందిన భక్తులకు ఒకే రోజులో రెండుసార్లు శ్రీవారి దర్శనం చేసుకునే అరుదైన అవకాశం లభిస్తుంది.

-వి. రామచంద్ర మూర్తి సీనియర్ జర్నలిస్టు

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *