గరివిడి…గర్వపడి..


******
విజయనగరం జిల్లాలో విజయనగరం టవున్ కి పాతిక కి.మీ. దూరంలో గరివిడి అనే చిన్న ఊరు ఉంది. అక్కడ చాలా పెద్ద ఫెర్రో అల్లాయిస్ ఫ్యాక్టరీ (FACOR)ఉండేది. అక్కడ సిబ్బంది ఉండడానికి క్వార్టర్సు కూడా ఉండేవి. అదంతా కలిపి ఒక టవున్ షిప్ లా ఏర్పడి, దానికి ‘శ్రీరామ్ నగర్’ అని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం పేరు పెట్టింది. వీరు మహారాష్ట్రకి చెందిన బడా మార్వాడీవారు. అలా ఈ ప్రాంతాన్ని గరివిడి-శ్రీరామ్ నగర్ అని పిలిచేవారు. ఒకరకంగా గరివిడి పేరు పాపులర్ అయ్యింది ఈ ఫేకర్ తోనే.
ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో ఫేకర్ వ్యవస్థాపకుడైన దుర్గాప్రసాద్ షరాఫ్ జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించేవారు. ఊరు ఊరంతా స్వీట్ల పేకట్లు పంచేవారు. ఆ సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో బహిరంగ సభ జరిగేది. ఆ సభ కవరేజ్ కి విశాఖపట్నం నుంచి విలేకరుల బృందాన్ని కార్లలో తీసుకు వెళ్లేవారు. అప్పట్లో అంటే 1982 లో నేను విశాఖలో ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ గా ఉండేవాణ్ణి. ఫేకర్ వేడుకలు కవర్ చేసిన జర్నలిస్టుల్లో నేనూ ఒకడిని.
అప్పట్లో గరివిడి అంటే ఫేకర్, ఫేకర్ అంటే గరివిడిగా చలామణీ అయ్యేది. కాలక్రమంలో ఫేకర్ మూతబడింది. శ్రీరామ్ నగర్ పేరు మరుగున పడింది. గరివిడి గరివిడిగానే మిగిలిపోయింది..
ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది.
ఆ గరివిడి ప్రాంతంలో రెడ్డి విజయలక్ష్మి అనే బుర్రకథ కళాకారిణి వెలుగులోకి వస్తున్న రోజుల్లోనే నేను ఉత్తరాంధ్ర విడిచిపెట్టి హైదరాబాద్ కి వెళ్లిపోయాను. ఆ రోజుల్లో గరివిడి లక్ష్మిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆ కళాకారిణి గురించి కర్ణాకర్ణీగా వినడమే గాని ప్రత్యక్షంగా ఆమె ప్రదర్శన చూసే అవకాశం నాకు దొరకలేదు.
అమెరికాలో ఐటీ రంగంలో కోట్లు సంపాదించిన విశ్వప్రసాద్ గారు సినిమా రంగం మీద మక్కువ కొద్దీ పది పదిహేనేళ్ల కిందట హైదరాబాద్ కి వచ్చి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే చిత్ర నిర్మాణ సంస్థని నెలకొల్పి వరసపెట్టి సినిమాలు తియ్యసాగారు. వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా స్థాయి భారీ చిత్రాలు నిర్మించారు. అటువంటి పెద్ద నిర్మాణ సంస్థ గరివిడి లక్ష్మి జీవిత గాధని తెరకెక్కిస్తోందన్న విషయం నాకు ఈమధ్యనే తెలిసింది. విశ్వప్రసాద్ గారి కుమార్తె కృతి ప్రసాద్ పూర్తిస్థాయి నిర్మాతగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
రెండేళ్లుగా ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పటికీ దీని విశేషాలు మాత్రం గత రెండు నెలల నుంచే నాకు తెలుస్తూ వచ్చాయి. ఒక ఉత్తరాంధ్రవాసిగా నాకు ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. కొంత బెంగ కూడా కలిగింది. బెంగ ఎందుకంటే, గతంలో ఉత్తరాంధ్ర జీవితాల మీద తీసిన సినిమాలు కమర్షియల్ గా చూస్తే అంత బాగా ఆడలేదు. ఈ సినిమా హిట్టవ్వాలని, నిర్మాతకి నష్టం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.
ఇవాళ గరివిడి లక్ష్మి సినిమా సాధించిన విజయాన్ని విప్పార్చిన కళ్లతో విస్మయంగా తిలకిస్తున్నాను. థియేటర్లలో ఉర్రూతలూగుతున్న ప్రేక్షకుల్ని చూసి ఉప్పొంగిపోతున్నాను. ఒక ఉత్తరాంధ్రవాసిగా పులకించిపోతూ గర్వపడుతున్నాను. ఉత్తరాంధ్ర మాటా పాటలని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. గరివిడి లక్ష్మి సినిమాకి ప్రాణం పోసిన దర్శకుడు జమ్ము గౌరినాయుడు, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కథా నాయిక ఆనంది, నిర్మాత కృతి ప్రసాద్, పని చేసిన ప్రతి ఒక్కరికి జేజేలు పలుకుతున్నాను.
చివరిగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలకు ఒక మనవి చెయ్యదలుచుకున్నాను. ఒకప్పుడు సినిమా రిలీజయినప్పుడు ఆ సినిమా పాటల పుస్తకాలు థియేటర్లలో అమ్మేవారు. ఇప్పుడు గరివిడి లక్ష్మి సినిమాకి కూడా పాటల పుస్తకాన్ని అచ్చు వేసి విక్రయించాలని కోరుతున్నాను. అలాగే గరివిడి లక్ష్మి సినిమా కథ, షూటింగ్ విశేషాలు, ఫోటోలతో ఒక వెండితెర నవల కూడా ప్రచురించాలని మనవి చేస్తున్నాను.
ఒకప్పుడు నాకు గరివిడి అంటే ఫెర్రో అల్లాయిస్ ఫ్యాక్టరీ గుర్తొచ్చేది. ఇక నుంచి గరివిడి అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తొస్తుంది.
— మంగు రాజగోపాల్
సీనియర్ జర్నలిస్టు

(లీడర్ దినపత్రిక 25-10-26 సంచికలో ప్రచురితం)

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *