తెలంగాణలో ఆలయాలకు మహర్దశ

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చింది. ముందుగా అత్యంత ప్రసిద్ధమైన ఆలయాల పునర్‌నిర్మిణపనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదావరి పుష్కరాలకుముందే పనులు పూర్తిచేసేలక్ష్యంగా వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం నిధులు విడుదల చేయడమే కాకుండా ఆయా ఆలయాలలో నిర్మాణపనులను చేపట్టారు. భవిష్యత్ తరాలను, రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటుకల నిర్మాణాల స్థానంలో పూర్తిగా కృష్ణశిలల ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాసర, ధర్మపురి, భద్రాచలం, వేములవాడ, కాళేశ్వరం, కొండగట్టు తదితర ఆలయాలలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులకు అసౌకర్యాలు జరుగకుండా దర్శనం ఏర్పాట్లను కూడా చేసారు. ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని పూర్తిగా పది కోట్ల రూపాయల వ్యయంతో గర్భాలయంతో సహా రాతి కట్టడంగా మార్చే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గర్భాలయ రాతి పనులు జరిగే సమయంలో స్వామివారికి నిత్య పూజలు జరిపేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా బాల ఆలయాన్ని ఏర్పాటు చేసారు. ఇదేవిధంగా బాసరలో కూడా బాల ఆలయం ఏర్పాటు చేశారు. మిగిలిన ఆలయాలలో నిర్మాణం పనులు చేపట్టిన సమయంలోనే ఆగమ శాస్త్రాల కనుగుణంగా తగు నిర్ణయాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఆలయాల నిర్మాణం పనులను పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర పండితులు సూచనల మేరకే నిర్మాణం పనులను చేపట్టారు. ఆలయ పవిత్రతకు, చారిత్రక వైభవానికి భంగం కలగకుండా వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ‘పాంచరాత్ర ఆగమ’ శాస్త్రాల కనుగుణంగా ఈ పునర్నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం ముందుగా స్తపతి విచ్చేసి పనుల వివరాలకు సంబంధించిన సూచనలు చేసారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి వచ్చేలా, పుష్కరాలకు ముందే ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యేలా ప్రణాళిక సిద్దం చేశారు. ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆరోగ్య ప్రదాతగా భక్తులు కొలుస్తారు. భక్తుల విశ్వాసాలకు భంగం రాకుండా శాస్త్రోక్తంగా, ఆగమశాస్త్రాల ప్రకారం పూర్తిగా రాతి కట్టడంతో పునర్నిర్మిస్తున్నారు. అంతేకాకుండా శ్రీ యోగ నరసింహస్వామి ప్రధాన ఆలయానికి 20 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన దేవాలయ విస్తరణ, ఆధునీకరణకు ప్రణాళికలు సిద్దం చేశారు. దీనితో బాటుగా భక్తుల మౌలిక వసతుల పనులు, వైకుంఠ ద్వార నిర్మాణం, భక్తులు బస చేసేందుకు నదీ తీరంలో రెండు పెద్ద ధర్మశాలలు, కొత్త కల్యాణ మండపం, నిత్య అన్నదాన మరియు ప్రవచన మండపాలు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారంతో పల్లవ, చోళ శైలిలో సహజసిద్ధ సాంప్రదాయ పద్ధతుల్లో లీకేజీల నివారణ, పురాతన కట్టడాల పరిరక్షణ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, ధర్మపురి క్షేత్రంతో పాటు కోటిలింగాల ప్రాంతాన్ని కూడా కలుపుకుని సమగ్ర ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రెండువందల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించింది. ఇందులో భాగంగా అధికారికంగా పునర్నిర్మాణ పనులకు భూమిపూజ (శంకుస్థాపన) చేశారు.
భద్రాచలంలో ప్రధాన గర్భాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహాన్ని తాకకుండా కేవలం పరిసరాలు, ప్రాకారాలు, ఉపాలయాలను మాత్రమే పునర్నిర్మిస్తున్నారు. మొదట అమ్మవారి విడిగా ఉన్న ఆలయాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పవిత్రంగా ప్రధాన ఆలయం (గర్భాలయం) లోపలికి తరలించారు. పనులు పూర్తయ్యే వరకు అమ్మవారి నిత్య కైంకర్యాలు అక్కడే నిర్వహిస్తారు. శాశ్వత నిత్య కల్యాణ మండపం, పాత హోమశాలలను తొలగించడంతో మిథిలా స్టేడియంలో తాత్కాలికంగా వైదిక వేదికను ఏర్పాటు చేసి నిత్య కల్యాణాలను జరిపిస్తున్నారు. అయితే భద్రాద్రి క్షేత్రంలో మూలవిరాట్ దర్శనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా పనులు సాగుతున్నాయి.
అదేవిధంగా చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర క్షేత్ర సమగ్ర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 354 కోట్లరూపాయలను కేటాయించినట్లు భోగట్టా. అమ్మవారి గర్భాలయం, ఉప ఆలయాల పునర్నిర్మాణంతో పాటు గోదావరి నదీ తీర ఘాట్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అయితే, భద్రాచలం, ధర్మపురి క్షేత్రాలతో పోలిస్తే వేములవాడలో బాల ఆలయ ప్రక్రియ మరియు దర్శనాల ఏర్పాట్లు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ ఆలయ ప్రాంగణ విస్తరణ, భక్తులకు అత్యాధునిక వసతుల కల్పన కోసం రూ. 650 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన పనులు జరుగుతున్నాయి. ఆలయ కోనేరు సుందరీకరణ పనులు పూర్తి చేసి, అందులో 40 అడుగుల భారీ శివుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో గర్భాలయాన్ని ముట్టకుండా విస్తరణ పనులు చేపట్టారు. శృంగేరి శారదా పీఠాధిపతుల సూచనలు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం మూలవిరాట్ కొలువై ఉన్న ప్రధాన గర్భాలయాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అలాగే ఉంచుతున్నారు.
త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వరం ఆలయం మరియు దాని పరిసర ప్రాంతాల పునర్నిర్మాణం కోసం సుమారు రూ. 146.42 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి పనులను చేపట్టారు.
బాల ఆలయం అంటే..
ఆగమ శాస్త్రం ప్రకారం, ఒక దేవాలయ గర్భాలయం పునర్నిర్మాణం జరుపుకుంటున్నప్పుడు, మూలవిరాట్ (ప్రధాన విగ్రహం) ఉన్న ప్రాంతాన్ని కదల్చడం లేదా అక్కడ శిల్పకళా పనులు చేయడం నిషిద్ధం. అందుకే, ఆలయ పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకు.. ప్రధాన విగ్రహాల్లోని దైవిక శక్తులను ‘కళాకర్షణ’ అనే పవిత్ర వైదిక ప్రక్రియ ద్వారా తాత్కాలికంగా నిర్మించిన ‘బాల ఆలయం’ లోని ప్రతిరూప విగ్రహాల్లోకి లేదా కలశాల్లోకి ఆవాహన చేస్తారు. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తుల పూజలు, నిత్య కైంకర్యాలు, అర్చనలు అన్నీ ఈ బాల ఆలయంలోనే జరుగుతాయి. మూల ఆలయ పనులు పూర్తయ్యాక, మళ్లీ శాస్త్రోక్తంగా ‘మహా సంప్రోక్షణ’ లేదా ‘కుంభాభిషేకం’ నిర్వహించి ఆ దైవిక శక్తిని తిరిగి ప్రధాన విగ్రహాల్లోకి ప్రవేశపెడతారు.
పుష్కరాలకు ముందే గోదావరి తీరంలోని ఆలయాలపనులను పూర్తిచేగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవగాశాలు ఉన్నాయి.

-వి. రామచంద్ర మూర్తి , సీనియర్ జర్నలిస్ట్

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *